ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో మరో ఆసక్తికర మలుపు తిరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్, రష్యా తమకు దూరమయ్యారని బహిరంగంగానే వాపోయారు. ట్రూత్ సోషల్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసిన ట్రంప్, చైనా కారణంగానే ఈ రెండు దేశాలను కోల్పోయామని స్పష్టం చేశారు. కుట్ర బుద్ధి కలిగిన చైనా భారత్, రష్యాలను దగ్గర చేసుకుందని ఆయన విమర్శించారు. ఈ మూడు దేశాల మధ్య ఏర్పడిన స్నేహం దీర్ఘకాలం కొనసాగుతుందని ట్రంప్ వ్యంగ్యంగా విమర్శించారు.
నిజానికి రెండో సారి అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత.. ట్రంప్ చేపట్టిన కఠినమైన సుంక విధానాలు, టారిఫ్ నిర్ణయాలు అనేక దేశాలతో అమెరికా సంబంధాలను దెబ్బతీశాయి. భారత్ విషయంలోనూ ఇదే జరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించడం పెద్ద వివాదంగా మారింది. అయితే ఈ నిర్ణయం అమెరికాకే భారీ నష్టాన్ని కలిగించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అమెరికా కఠిన వైఖరికి ప్రతిస్పందనగా భారత్ రష్యాకు మరింత చేరువైంది. తాజాగా చైనాలో టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం ఈ పరిణామానికి బలాన్ని చేకూర్చింది. ఆ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు వాణిజ్యం, ఇంధనం, భద్రత వంటి రంగాల్లో సహకారం పెంపుదలపై చర్చించారు. మూడురాష్ట్రాల ఈ కూటమి ట్రంప్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రత్యేకంగా ఏడేళ్ల తర్వాత మోదీ చైనాకు వెళ్లడం, గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఇలాంటిది జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ వేదికపై భారత్, రష్యా, చైనా ఒకే తాటిపై నిలవడం అమెరికా ఆందోళనలకు కారణమవుతోంది. టారిఫ్‌ల రూపంలో ఒత్తిడి పెంచినా భారత్ వెనక్కి తగ్గలేదు. బదులుగా కొత్త భాగస్వామ్యాల వైపు అడుగులు వేస్తోంది. ఈ అనూహ్య పరిణామం ట్రంప్‌ను బిత్తరపోయేలా చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. తన చర్యలే ప్రత్యర్థి దేశాల మధ్య చెలిమి పెరగడానికి కారణమయ్యాయని ట్రంప్ స్వయంగా ఒప్పుకోవడం గ్లోబల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
