న్యూఢిల్లీ: నల్లధనంపై పోరులో మరో కీలక అడుగుపడింది. స్విస్ బ్యాంకులో అకౌంట్లు కలిగిన భారతీయులు, భారత కంపెనీలకు చెందిన మరో జాబితా కేంద్ర ప్రభుత్వం చేతికి వచ్చింది. స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగుణంగా భారత్‌కు చెందిన పలు ఖాతాల వివరాలను అందించింది. నల్లధనంపై పోరులో భాగంగా విదేశాల్లోని బ్యాంకు అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్విస్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ బ్యాంకు(FTA) ఖాతాల సమాచారాన్ని అందిస్తోన్న 86 దేశాల్లో భారత్ ఉంది. సమాచార మార్పిడి ఒప్పందం కింద భారత పౌరులు, కంపెనీల ఖాతాల వివరాలను 2019 సెప్టెంబర్‌లో స్విస్ దేశం నుండి భారత్ మొదటి జాబితాను అందుకుంది.
నల్లధనంపై పోరులో స్విస్ బ్యాంకు అకౌంట్ల వివరాలు కీలకం. ఈ ఏడాది సమాచార మార్పిడిలో భాగంగా దాదాపు 31 లక్షల ఆర్థిక ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని వివిధ దేశాలతో పంచుకున్నట్లు ఈరోజు FTA తెలిపింది. మొత్తం 86 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాల సమాచారాన్ని పంచుకుంది. ఇందులో భారతీయులు, భారత కంపెనీలు ఉన్నాయి. పన్ను ఎగవేత, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన దర్యాఫ్తులో భాగంగా గత ఏడాదిగా భారత అధికారుల విజ్ఞప్తి మేరకు స్విస్ అధికారులు ఇప్పటి వరకు వందమందికి పైగా వ్యక్తులు/సంస్థల సమాచారాన్ని పంచుకున్నారు.
యాక్టివ్‌గా ఉన్న ఖాతాలతో పాటు 2018లో మూసివేసిన ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా స్విస్ అధికారులు మన దేశంతో పంచుకుంటారు. నల్లధనంపై ప్రభుత్వం పోరుతో పాటు వివిధ కారణాల వల్ల భారతీయులు, భారతీయ కంపెనీలు తమ బ్యాంకు ఖాతాలను ఇప్పటికే క్లోజ్ చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. చాలాకాలం పాటు స్విస్ బ్యాంకులు నల్లధనం దాచుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు చాలా దేశాలతో ఖాతాల వివరాలు పంచుకోవాల్సిన దిశలో ఒప్పందాలు జరిగాయి. భారత్‌తో స్విస్ అధికారులు పంచుకున్న ఖాతాల వివరాలు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఉపయోగపడతాయి. పన్ను సంస్కరణల్లో భాగంగా సదరు ఖాతాదారులు తమ వివరాలు సరిగ్గా ప్రకటించారా లేదా అని తెలుసుకోవడానికి ట్యాక్స్ అథారిటీస్‌కు ఉపకరిస్తుంది.
2021 సెప్టెంబర్ నాటికి మరో జాబితా :
స్విస్ బ్యాంకు నుండి మరో విడత జాబితా 2021 సెప్టెంబర్‌లో వస్తుందని భావిస్తున్నారు. కాగా, తాజా రెండో జాబితాలో వెల్లడించిన భారతీయుల ఖాతాల్లో ఎంత మొత్తం సంపద ఉందనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. ఒప్పంద నిబంధనల్లోని గోప్యతా క్లాజుల కారణంగా సమాచారం వెల్లడించలేని పరిస్థితి. స్విస్ బ్యాంకు అధికారులు పంచుకునే సమాచారంలో ఖాతాదారు పేరు, అడ్రస్, చిరునామా, దేశం, పన్ను గుర్తింపు నెంబర్, బ్యాంకుల పేర్లు, అకౌంట్ బ్యాలెన్స్, క్యాపిటల్ ఇన్‌కం వంటి సమాచారం ఉంటుంది.