గత రెండు సంవత్సరాలుగా మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా గ్లోబల్ వార్నింగ్ తో అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మన శరీరం తొందరగా డిహైడ్రేషన్ కు గురి అయ్యి అలసట నీరసం, తలనొప్పి, కళ్ళు తిరగడం, అవయవాల పనితీరు మందగించడం, వాంతులు, విరోచనాలు వంటి తీవ్ర అనారోగ్య సమస్యల వల్ల చివరికి ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళవచ్చు. వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేయడానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ వేసవిలో చిన్నపిల్లలు, గర్భిణీలు
గుండె జబ్బులు,అధిక రక్తపోటు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫీల్డ్ లో పనిచేసే వారు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో బయట తిరగడం మానేయండి.చెప్పులు లేకుండా బయటకు అస్సలు వెళ్లకూడదు. ముఖ్యంగా గృహిణులు వంట పనులను కూడా ఉదయమే ముగించేయాలి. ఈ ఎండలకు, స్టవ్ వేడి కారణంగా మరింత అలసిపోతారు. వేడి పదార్థాలను తినడం కంటే కొంత చల్లబడిన తర్వాత తినడమే మంచిది. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుని తినండి ఎందుకంటే ఎండవేడికి తొందరగా ఆహారం పాడవుతుంది పాడైన ఆహారాన్ని తింటే మరింత అని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఈ సమ్మర్ సీజన్ మొత్తం రసాయనాలు కలిగిన కూల్ డ్రింక్స్ తాగడానికి బదులు మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు వంటివి ఇంట్లోనే తయారు చేసుకొని తాగండి. ముఖ్యంగా తగినంత నీరు తాగడం వేసవికాలంలో మన ఆరోగ్యానికి చాలా మంచిది.ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ వీలైనప్పుడల్లా తాగండి. వదులుగా, మెత్తగా ఉండే లేత రంగు కాటన్ వస్త్రాలను ధరించండి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. తప్పనిసరిగా వెళ్లినప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని తలపై కప్పుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు రోజు వారి కార్యక్రమాలను ఉదయం 11 గంటల లోపు లేదా సాయంత్రం నాలుగు గంటల తర్వాత చూసుకోవడం మంచిది.