రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం త్వరలో ముగియనుంది. అయినాగానీ, ఆయన మీద అధికార వైసీపీ రాజకీయ యుద్ధం చేస్తోంది. నిజానికి వైసీపీ రాజకీయ పోరాటం చేయాల్సింది విపక్షాల మీద. మొత్తం అధికారాన్నంతా ఎస్ఈసీ మీద ప్రయోగించడానికి వైసీపీ అధినాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు పలు సందర్భాల్లో బెడిసికొట్టాయి. ఎస్ఈసీని తొలగించడం, ఈ క్రమంలో తెచ్చిన ఆర్డినెన్స్.. అది కాస్తా న్యాయస్థానాల్లో వీగిపోవడం.. ఇవేవీ దాచిపెట్టగలిగే విషయాలు కావు. ఎందుకింత పట్టుదల.? పైగా, ఆ పట్టుదలతో వైసీపీ సాధించిందేమిటి.? వ్యవస్థలకు మకిలి అంటించడంలో వైసీపీ పూర్తిస్థాయిలో సఫలమయ్యిందిగానీ.. ఈ చర్యల ద్వారా ప్రజల్లో వైసీపీ చులకనైపోయిందన్నది నిర్వివాదాంశం. పంచాయితీ ఎన్నికలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని వైసీపీ నేతలు ఓ పక్క కుండబద్దలుగొట్టేస్తున్నారు. అదే సమయంలో ఏకగ్రీవాలపై దృష్టి పెట్టాలంటూ వైసీపీ శ్రేణులకు పిలుపునిస్తారు. సరే, అది వైసీపీ రాజకీయ స్టాండ్ అనుకోవచ్చు.
కానీ, ఎస్ఈసీ మీద పంచాయితీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు చేయడమెందుకు.? అలా చేయడం ద్వారా వైసీపీ సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతోంది.? ఈ ప్రశ్న ప్రజాస్వామ్యవాదుల్ని, సగటు ప్రజల్ని ఆలోచనలో పడేస్తోంది. రాజ్యాంగ వ్యవస్థల పట్ల నమ్మకం లేని వ్యక్తులు అధికారంలో వుంటే, ఇలాగే అరాచకం రాజ్యమేలుతుందన్న అభిప్రాయం రాజకీయ విమర్శకుల నుంచి వినిపిస్తోంది. ఇదే అభిప్రాయం ప్రజల్లో కూడా బలపడే స్థాయిలో అధికార వైసీపీ నేతలు, ఎస్ఈసీ నిమ్మగడ్డపై అసహనంతో ఊగిపోతున్నారు. అధికారంలో వున్నది వైసీపీనే. రేప్పొద్దున్న పంచాయితీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసేది కూడా వైసీపీనే. ఎందుకంటే, ఇలాంటి ఎన్నికల్లో అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువ. ఎంత గింజుకున్నా విపక్షాలు అధికార పార్టీతో పంచాయితీ ఎన్నికల్లో పోటీ పడలేవు. మరెందుకు ఉలికిపాటు.? ఈ ఉలికిపాటు కారణంగా తమ గెలుపు అవకాశాల్ని వైసీపీ తగ్గించుకుంటోందా.? అన్న అనుమానం వైసీపీ శ్రేణుల్లోనే బలపడుతుండడం గమనించాల్సిన అంశం. ఇప్పటికే ఈ పంతంలో అధికారుల్ని బలిపెట్టింది వైసీపీ అధిష్టానం. ఇప్పుడిక కొందరు వైసీపీ ముఖ్య నేతలు కూడా ఎస్ఈసీ దెబ్బకి చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తే, అందుకు వైసీపీ అధినాయకత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందేమో.