ఎలా.? ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు ఎలా ఇంత చక్కగా అమలవుతున్నాయ్.? పొరుగు రాష్ట్రాలు సైతం ఆశ్చర్యపోతున్న సందర్భమిది. ఎందుకంటే, ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రం, సంక్షేమ పథకాలకు సంబంధించి పక్కా ‘టైం టేబుల్’ పాటించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికీ ఇబ్బందులొస్తున్నాయ్‌గానీ, సంక్షేమ పథకాలు ఆగడంలేదు. అందుకే, వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత ఏమీ కనిపించడంలేదు గ్రౌండ్ లెవల్‌లో. చిన్న చిన్న సమస్యలున్నా, అవి ఏ ప్రభుత్వానికైనా మామూలే. కానీ, పార్టీలో కొందరు నేతల పట్ల మాత్రం కింది స్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది.
ఎమ్మెల్యేలదీ, ఎంపీలదీ అదే తీరు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల పట్ల కింది స్థాయిలో వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఈ విషయమై పార్టీ అధినేత వద్ద కూడా పంచాయితీ నడుస్తోంది. ఉత్తరాంధ్రలోనూ, రాయలసీమలోనూ ఇదే పరిస్థితి. ఆయా ప్రజా ప్రతినిథుల మధ్య వ్యక్తిగత వైరాలు, పంపకాల తేడాల కారణంగా వివాదాలు ముదిరి పాకాన పడుతోంటే, వాటిని సరిదిద్దే క్రమంలో ముఖ్య నేతలకు ఆయా వ్యవహారాల్ని పురమాయిస్తున్నారుగానీ, ఆ వివాదాలైతే సద్దుమణగడంలేదు.
ఇసుక తెచ్చిన తంటాలే.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నాయ్..
గుంటూరు జిల్లాకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మొదటి నుంచీ వైరం నడుస్తూనే వుంది. ఆ వివాదం ఎప్పటికప్పుడు సద్దుమణిగినప్పుడే కనిపిస్తోంది.. అంతలోనే ముదిరి పాకాన పడుతోంది. పేకాట క్లబ్బుల విషయంలోనూ ఆ ఇద్దరి మధ్యా తలెత్తిన గొడవ అధికార పార్టీ పట్ల గ్రౌండ్ లెవల్‌లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. మరోపక్క, ప్రభుత్వంపై విపక్షాల నుంచి దూసుకొస్తున్న విమర్శల్ని సరైన రీతిలో తిప్పి కొట్టడంలో అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా ప్రజా ప్రతినిథులు విఫలమవుతున్నారు.
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష..
త్వరలో స్థానిక ఎన్నికలు జరగాల్సి వుంది. అయితే, ఈ విషయమై కూడా వివాదం నడుస్తోంది. ఒకవేళ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరిగితే మాత్రం.. దాదాపు రెండేళ్ళ తమ పాలనకు అది కొలమానం అవుతుంది. ఈలోగా గ్రౌండ్ లెవల్‌లో వివాదాల్ని చల్లార్చే దిశగా వైసీపీ అధిష్టానం సరైన చర్యలు తీసుకోకపోతే మాత్రం.. ఆ గొడవలే చిలికి చిలికి గాలివానై పార్టీని ముంచేసినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదేమో.!