ఒక రాజకీయ పార్టీని బయటి నుండి చుట్టుముట్టే సమస్యల కంటే అంతర్గతంగా పుట్టుకొచ్చే కలహాలే ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. ఇలా అంతర్గత కలహాలతో కుప్పకూలి కనుమరుగైన పొలిటికల్ పార్టీలు చాలానే ఉన్నాయి. ఏ పార్టీ పరిస్థితినైనా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అంటూ అంచనా వేస్తుంటారు. ఎన్నికల తర్వాత పార్టీలో చోటు చేసుకునే పరిణామాలే రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని డిసైడ్ చేస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఎన్నికల్లో గెలిచిన పార్టీ అయినా ఓడినా పార్టీ అయినా ఆ పరిస్థితులను మెరుగైన రీతిలో ఉండేలా జాగ్రత్తపడాలి. కానీ కొందరు మాత్రం వాటిని సరైన రీతిలో ఉంచుకోలేక నష్టపోతుంటారు.అధికారంలో ఉన్నాం కదా అంతా మన అదుపులోనే ఉందనే భ్రమలో ఉంటారు. వాళ్లు అలా ఉండగానే జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది. అందుకు ఉత్తమమైన ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు అలా నాశనమయ్యారు:
2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన ప్రతిపక్షం వైసీపీని నుండి భారీ స్థాయిలో వలసలను ప్రోత్సహించారు. 23 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఇక చోటా మోటా లీడర్ల సంగతైతే సరేసరి. ఆ చేరికలను చూసి చంద్రబాబు చాలా సంబరపడ్డారు. ఎంత గొప్ప పని చేశానో అనుకున్నారు. వైసీపీని నిర్వీర్యం చేస్తున్నానని పొంగిపోయారు. కానీ ఆ తర్వాత మొదలైంది ముసళ్ళ పండుగ.
పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఆల్రెడీ పార్టీలో ఉన్న నేతలను డామినేట్ చేయడానికి ట్రై చేశారు. ఇది పాత లీడర్లకు నచ్చలేదు. తీవ్రంగా ప్రతిఘటించారు.నేరుగా బాబుగారికే బాధ చెప్పుకున్నారు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో అనేక నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పైపెచ్చు కొత్తగా పార్టీలో చేరిన వారికి బాబుగారు మంత్రి పదవులు సైతం కట్టబెట్టారు.
దీంతో అసంతృప్తి తారా స్థాయికి చేరింది. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు గ్రూపులు ఏర్పడ్డాయి. కొత్తగా వచ్చినవారు ఎలాగూ మాట వినరు. ఇక పాత వారు పార్టీ మీద కొత్తవారి కంటే మాకే హక్కు ఎక్కువని ఎదురుతిరిగారు. ఫలితం శ్రేణులు చెదిరిపోయాయి. ఒక్కటిగా ఉండాల్సిన వారు చీలిపోయి చిన్న చిన్న గ్రూపులయ్యారు. ఎన్నికల నాటికి వారందరినీ ఒక్కటి చేయడం బాబు వల్ల కాలేదు. ఫలితం వ్యతిరేక ఓటింగ్ జరిగింది. టీడీపీ ఓటు బ్యాంకు చాలా వరకు పనిగట్టుకుని మరీ వైసీపీ, జనసేనలకు మద్దతిచ్చింది. దీని మూలంగానే అనేక నియోజకవర్గాల్లో త్రుటిలో ఓటమి పాలయ్యారు టీడీపీఅభ్యర్థులు. చివరికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జగన్ కూడ బాబు బాటలో వెళ్తున్నారా ?
ఇప్పుడు వైసీపీలో కూడ టీడీపీలో కనిపించిన వాతావరణమే కనిపిస్తోంది. పార్టీ అంతర్గత కలహాలతో ఇబ్బందిపడుతోంది. రాజీనామాలు చేస్తేనే తన పార్టీలో చేర్చుకుంటానని ప్రగల్భాలు పలికిన జగన్ అనధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా దగ్గర పెట్టుకున్నారో అందరికీ తెలుసు. మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీలు పేరుకు టీడీపీ ఎమ్మెల్యేలే అయినా వైసీపీతో అంటకాగుతున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో పైచేయి సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరి చేరికతో అప్పటివరకు పార్టీలో ఉన్న నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఎన్నికల ముందువరకు తమను తీవ్రంగా విమర్శించినవారు ఇప్పుడు గెలిచాక వచ్చి పక్కన చేరతారా.. మేము అనుభవించాల్సిన అధికారాన్ని వాళ్లు అనుభవిస్తారా అంటూ రగిలిపోతున్నారు.
చీరాలలో ఆమంచి, కరణం బలరాం మధ్య ఈ ఆధిపత్య పోరు తీవ్రంగా నడుస్తుంటే గన్నవరంలో వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావులు పార్టీ జెండా ఎవరి సొంతమో తేల్చుకుందాం అన్నట్టు తలపడుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మద్దాలి గిరిబాబు వెర్సెస్ యేసు రత్నం అన్నట్టు ఉంది సిట్యుయేషన్. వీరంతా గ్రూపులుగా విడిపోయి పోటీపడుతున్నారు. ఫలితంగా పార్టీ క్యాడర్లో చీలికలు మొదలయ్యాయి. ఎవరికి వారు సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. నిత్యం హైకమాండ్ వద్దకు పిర్యాధులు వెళుతూనే ఉన్నాయి. అయినా పరిష్కారం లేదు. ఇవి కేవలం బయటపడ్డ గొడవలే. లోపలే నలుగుతున్నవి ఇంకెన్నో. రానున్న రోజుల్లో ఇవి పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి జగన్ ఇప్పటికైనా ఈ వర్గపోరుకు తెరదించే కసరత్తు మొదలుపెట్టకపోతే ఆయన కూడ చంద్రబాబు తరహాలో తలపట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది.