మరీ దారుణ పరాజయం ఏమీ కాదు. కాకపోతే, ఓటమి అత్యంత బాధాకరం. చాలా చాలా కఠినమైనది ఈ ఓటమి. జీర్ణించుకోవడం చాలా చాలా కష్టం. తెలంగాణ జాతి పితగా కేసీయార్ గురించి గులాబీ శ్రేణులు చెబుతుంటాయి. కానీ, ఇప్పుడు ఈక్వేషన్ మారిపోయింది. తెలంగాణ సమాజం, కేసీయార్ పార్టీని తిరస్కరించింది.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది.
ముందు ముందు తెలంగాణలో చాలా మారిపోతాయ్. విభజన తర్వాత చాలా రాష్ట్రాల్లో ఉద్యమ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాలున్నాయి. కొందరు ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రులై, ఆ తర్వాత జైలు పాలయి.. రాజకీయంగా అడ్రస్ గల్లంతయిన సందర్భాలూ లేకపోలేదు.
కేసీయార్ పరిస్థితి ఏమవుతుంది.? కేసీయార్ తనయుడు కేటీయార్ మాటేమిటి.? అసలు ఎందుకీ పరాజయం.? చాలా కారణాలున్నాయి గులాబీ పార్టీ పతనానికి. తొలి కారణం, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని భారత్ రాష్ట్ర సమితిగా మారడం. పేరు మార్పుతోనే, తెలంగాణ సమాజానికి కేసీయార్ పార్టీ దూరమైపోయింది.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ని దూరం చేసుకోవడం కేసీయార్ చేసిన ఇంకో తప్పిదం. చెప్పుకుంటూ పోతే కారణాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. ఎన్నికల ముందర, ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి వెటకారం.. అదే సమయంలో, టీడీపీ అధినేత చంద్రబాబు గురించీ వెటకారం.. ఇవి చాలవా.?
రెండు సార్లు గెలిచాం.. మూడోసారీ గెలిచేస్తామనే అతి ధీమా కేసీయార్ కొంప ముంచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తనకు టిక్కెట్ వద్దని గులాబీ పార్టీని ఎందుకు వదిలిపోయారని కేసీయార్ ఆత్మవిమర్శ చేసుకుని, బుజ్జగింపులకు దిగి వుంటే పరిస్థితి ఇంకోలా వుండేదేమో.! పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి ఆర్థికంగా బలవంతుడైన నాయకుడ్ని దగ్గర చేసుకుని వుంటే, ఖమ్మం జిల్లాలో కలిసొచ్చేదేమో.! ఇలాంటి చర్చలు జరుగుతున్నాయంటే, కేసీయార్ దారుణ తప్పిదాలు చాలా చాలా చేసినట్టే కదా.!
‘కేసీయార్ రాకూడదు సారూ..’ ఇది తెలంగాణలో కొందరు ఉద్యోగులు ఎన్నికల ముందర చెప్పిన మాట.! కేసీయార్ వరకూ ఇలాంటి మాటలు చేరి వుండవా.? ఎందుకింత వ్యతిరేకతను కేసీయార్ మూటగట్టుకున్నారు.? ఇదంతా స్వయంకృతాపరాధం.!