ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక పేదల దేశంగా అభివర్ణించబడిన భారతదేశం… ఇప్పుడు అదే ప్రపంచ బ్యాంక్ నుండి ప్రశంసలు అందుకుంటోంది. 2011-12లో 27.1%గా ఉన్న తీవ్ర పేదరికం 2022-23 నాటికి కేవలం 5.3%కి తగ్గిందన్న గణాంకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇది ఊహించని మార్పు మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక వ్యూహాలపై నమ్మకాన్ని కలిగించే విషయం కూడా.
ఇది కేవలం నగరాల్లో మాత్రమే కాదు… గ్రామీణ భారత్‌లోనూ అదే స్థాయిలో మార్పు వచ్చిందన్నది విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 18.4% నుంచి 2.8%కి పడిపోవడం, పట్టణాల్లో 10.7% నుంచి 1.1%కి చేరడం అభినందనీయం. మొత్తం మీద 269 మిలియన్ల మంది పేదల గమనాన్ని అభివృద్ధి దిశగా మలిచిన ఘనత ప్రభుత్వానికి దక్కుతోంది.
అంతేకాదు, ప్రభుత్వ పథకాల విజయమే ఈ మార్పుకు మూలం. ఉజ్వల యోజనతో ఇంటింటికి వంటగ్యాస్, జన్ ధన్ ఖాతాలతో బ్యాంకింగ్ సేవలు, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా ఆరోగ్య భద్రత, ఆవాస్ యోజనతో గృహ కల… ఇవన్నీ కలిసి పేదల జీవితం మారేలా చేశాయి. ఇది కేవలం సంక్షేమం మాత్రమే కాదు, సమగ్ర అభివృద్ధికి తీసుకున్న అడుగుల ఫలితం.
ఇక బహుముఖ పేదరిక సూచిక (MPI) లోనూ 53.8% నుండి 15.5%కి పడిపోవడం, దేశ జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగవుతున్నాయని చాటుతోంది. ఆరోగ్యం, విద్య, ఉపాధిలో సాధించిన పురోగతి, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నిలిపేందుకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే ఇదంతా నిలకడగా ఉండాలంటే నిరంతర శ్రద్ధ అవసరమనే విషయాన్ని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.