అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌నకు ఓ అద్భుత అవకాశం చేతికి అందేలా ఉంది. అదే- ప్రపంచబ్యాంకు పగ్గాలను అందుకునే ఛాన్స్. ప్రస్తుతం ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న జిమ్ యాంగ్ కిమ్ త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో ఇవాంకా ట్రంప్‌ను కూర్చోబెట్టబోతున్నట్లు కొన్ని విదేశీ వార్తా సంస్థలు వెల్లడించాయి.
ఇవాంకాతో పాటు నిక్కీ హేలీ కూడా ప్రపంచబ్యాంకు ఛైర్మన్‌గిరి పోటీలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రపంచబ్యాంకు ఛైర్మన్ పదవీ కాలం మూడేళ్లు. అమెరికా అధ్యక్షుడి తరహాలో రెండోసారి కూడా పోటీకి దిగొచ్చు. జిమ్ యాంగ్ కిమ్ వరుసగా రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ఇంకా ఎనిమిది నెలలు ఉంది.
ఈ లోగా- తాను దిగిపోతున్నట్లు జిమ్ యాంగ్ ప్రకటించారు. దీనితో కొత్త అధ్యక్షుడి కోసం కొన్ని పేర్లు తెరమీదికి వచ్చాయి. ఇవాంకా, నిక్కీ హేలీ, అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల విభాగం అండర్ సెక్రెటరీ డేవిడ్ మల్‌పాస్, ఆ దేశానికే చెందిన అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ చీఫ్ మార్క్ గ్రీన్ కూడా పోటీలో ఉన్నట్లు ఎఎఫ్‌పీ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సారి ప్రపంచబ్యాంకు ఛైర్మన్‌గా అమెరికన్‌నే ఎన్నుకోవాలనే నిర్ణయానికి వచ్చారని, ఇవాంకా ట్రంప్ పేరు దాదాపు ఖరారు కావచ్చని చెబుతున్నారు.
ఇవాంకా ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్త. 2017 నవంబర్‌లో హైదరాబాద్‌లో ఏర్పాటైన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్ సమ్మిట్‌కు ఆమె హాజరయ్యారు కూడా. ఆర్థిక రంగంపై ఆమెకు మంచి అవగాహన, పట్టు ఉన్నందు వల్ల ప్రపంచబ్యాంకు అధ్యక్ష పదవికి అర్హురాలవుతారని విదేశీ వార్తా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
