కన్నా లక్ష్మినారాయణ పాయె.. సోము వీర్రాజు పాయె… పురంధేశ్వరి సంగతేంటి.? భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా చాలా చిత్రంగా కనిపిస్తాయి. అసలు ఆ పార్టీ పాత్ర, ఏపీ రాజకీయాల్లో ఎంత.? అన్న ప్రశ్నకి ‘శూన్యం’ అని కమలం పార్టీకి చెందిన నేతలే కొందరు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తుంటారు.
కన్నా లక్ష్మినారాయణతో పోల్చితే, సోము వీర్రాజు ఎగ్రెజివ్గా రాజకీయం చేశారు. పురంధరీశ్వరి కూడా అంతకు మించిన జోరుతో రాజకీయాలు చేసేస్తున్నారు బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ, బీజేపీ అధినాయకత్వం.. రాష్ట్ర నాయకత్వానికి సరైన సహాయ సహకారాలు అందించనప్పుడు.. ఏపీ బీజేపీ నేతలు ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం లేదు.
బీజేపీ జాతీయ నాయకత్వం, తెలంగాణ సహా దేశంలోని మొత్తం ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంతలా వైసీపీ సర్కారు గురించి కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నా.. అక్కడెవరూ పట్టించుకోవడంలేదు.
పురంధేశ్వరి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. సోదరి భువనేశ్వరి భర్త చంద్రబాబు జైల్లో వున్న దరిమిలా, ఆయన్ని రక్షించేందుకూ పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నా, ఆ ప్రయత్నాలకు బీజేపీ పెద్దల నుంచి సహాయ సహకారాలు అందడంలేదాయె.!
ఇంతలోనే, పురంధేశ్వరికి వ్యతిరేకంగా బీజేపీలో ఓ వర్గం పావులు కదుపుతోంది. చంద్రబాబుకి మద్దతుగా పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారనీ, టీడీపీ నేతలేమో చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీని శంకిస్తారనీ ఆ వర్గం బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేస్తోందిట. ఎన్నికల వరకూ అయినా పురంధేశ్వరి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వుంటారా.? అదైతే ప్రస్తుతానికి డౌటేనట.!