‘మహాకూటమి’ ఇరకాటంలో కోదండరాం

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

తెలంగాణ జనసమితి నేత కోదండరాం కు ‘కూటమి కష్టాలు’ మొదలయ్యాయని చెబుతున్నారు. ఎలగైనా సరే తెలంగాణా రాష్ట్రసమితిని ఓడించాలని, అధినేత కెసియార్ ను ఇంటికో జైలుకో పంపాలన్నది ప్రొఫెసర్ కోదండ రామ్ ఆశయం. అయితే ఈ ఆశయం నెరవేరేందుకు ఇతర టిఆర్ ఎస్ వ్యతిరేక శక్తులతో కలసి ఎన్నికలకెళదామంటే, కోదండరామ్ ఉనికి, ఆయన స్థాపించిన తెలంగాణ జనసమితి ఉనికి మూడు నాలుగు స్థానాలకు కుంచించుకుపోతున్నది. దీనితో కూటమి  నడుస్తున్నతీరు మీద ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

 

చాలా సార్లు కోదండరామ్  ఇరి గేషన్ మిషన్లన్నీ కమిషన్ల మిషన్ లయ్యాయని, మళ్లీ ఆంధ్రోళ్లు, తెలంగాణ ద్రోహులు ప్రత్యేక రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆయన చెబుతూనే వస్తున్నారు. కెసియార్ కంటే కోదండరామ్ కు ‘ఆంధ్రోళ్లు’ అంటే చాలా కోపం. వాళ్లని వలస పాలకులు అని కొత్త పేరు పెట్టింది తిట్టడం మొదలుపెట్టింది ఈ పొలిటికల్ సైన్స్ పంతులే. అయితే, విధి వక్రిస్తున్నది. ఆయన కెసిఆర్ ను ఓడించాలంటే,  ఏ పార్టీనయితే ఆంధ్రోళ్ల పార్టీ అని బ్రాండ్ వేసి, తరిమేయండని అన్నాడో ఆపార్టీతో చేతులుకలపాల్సి వస్తున్నది. కెసియార్ లాగే ప్రొఫెసర్ కూడా తెలుగేదేశం పార్టీ పనయిపోయింది, అది తెలంగాణాలో ఇక మాయమవుతుందని తీర్పు ఇచ్చాడు.  అయితే, అదే పార్టీ పక్కనే సీటేసుకుని కూర్చోవలసి వస్తున్నది.

 

మహాకూటమిలో మైనర్ పార్టనర్

అంతకంటే మరీ ముఖ్యంగా కాంగ్రెస్, టిడిపి, సిపిఐలతో కలసి ఏర్పాటుచేస్తున్న ‘మహాకూటమి’ ఆయనమైనారిటీ పార్టీనేత అవుతున్నారు. జెఎసి పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి, తెలంగాణ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన నాయకుడిగా ఆయనకూ పెద్ద పీట ఎవరూ వేయడం లేదు. ఒక నిజాయితీ, జనామోదం చూసి అన్ని పార్టీలు ఆయన్ని ముఖ్యమంత్రిగా ముందుకు తీసుకుపోతాయని అనుకున్నారు. ఈ టాక్ ఏమయింది.

గత నాలుగేళ్లలో 119 సీట్లకు అభ్యర్థులను నిలబెడతామని ఆయన చాలా చెప్పారు. ఈ ఉద్దేశంతోనే జెఎసిని వదిలేసి జనసమితి పార్టీ ఏర్పాటుచేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకపాత్ర ఉంటుందన్నారు. అయితే, ఆయన ఇలా మైనారిటీఅయిపోతున్నారు. కాంగ్రెస్ ఆయనకు ఆఫర్ చేస్తున్నది కేవలం మూడంటే మూడుసీట్లేనట. ఇంత పెద్ద తెలంగాణలో తెలంగాణ జనసమితి మూడు నాలుగు సీట్లకు కుదించుకు పోవాలంటే ఆయనకు మనొస్పడం లేదట. ఇంత చేసి ఇలా అయిపోయిందేమిటని ఆయన లోలోన బాధపడ్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఆఫర్ చేస్తున్న సీట్లతో ఆయన ఏమాత్రం సంృప్తిగా లేరని చెబుతున్నారు. అయితే, ఎలా? ఇపుడు గొడవ పడి పక్కకు వెళ్లిపోతే అది కెసియార్కు లాభిస్తుంది. కెసిఆర్ ను ఓడించి దొరలనుంచి, ఆంధ్రో వ్యాపారుల నుంచి తెలంగాణను కాపాడాలన్న తన ఆశయం నెరవేరాలంటే , తనొక్కడి చేత కాదు. కాంగ్రెస్ తో కలవాలి. కలిస్తే వస్తున్న సమస్య ఇది.

సీన్ రివర్స్ 

కాంగ్రెస్ తో కలిస్తే సమాన హోద కాకపోయినా గౌరవప్రదమయిన హోదా వస్తుందనుకున్నారు. ఈ ఉద్దేశంతోనే కాంగ్రెసోళ్లను వెంటబెట్టుకోకుండా ఆయన ఎక్కడికి వెళ్లలేదు. తమాషా ఏమంటే, ఇంతవరకు ఉద్యమాలపేరుతో గాని, ధర్నాల పేరుతో గాని, గవర్నర్ కలవడానికి కాని, ఆయన నాయకత్వంలోనే అఖిల పక్షం బృందం వెళ్తూ వచ్చింది. తీరా ఎన్నికల రాజకీయాలలో ఆయనిపుడు సీట్లకో  కాంగ్రెస్ ని బతిమాలుకోవలసి వస్తుంది. కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేయాల్సి వస్తున్నది. పగ్గాలు కాంగ్రెస్ అప్పగించాల్సి వస్తున్నది. కాంగ్రెస్ సఖ్యత బాగుంటుందనే ఆయన ఇంతవరకు కాంగ్రెస్ నేతలెవరినీ టిజెఎస్ లో చేర్చుకోలేదు.

కాంగ్రసేమో 90 సీట్లకు తక్కువ కాకుండా పోటీచేయాలనుకుంటున్నది. పార్టీ బలపడ్డానని భావిస్తున్నది. రాహుల్ గాలి వీస్తున్నది, తెలంగాణలో కెసియార్, జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకత మొదలయిందన్న ఉత్సాహం కాంగ్రెస్ లో ఉంది. అందుకే ఎక్కవ సీట్లు పోటీ చేసి, రేపు అవసరమయితే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థితిలో ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నది.

గెలిచే స్థానాలు వదులుకోవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించినట్లు చెబుతున్నారు. దీనివల్ల మహాకూటమిలో కాంగ్రెసేతర పార్టీలకు మిగిలింది కేవలం 29 స్థానాలే.

కూటమిలో హోదా ఏమిటి?

కూటమి అనగానే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తాము 8-12 స్థానాల్లో పోటీ చేస్తామనచెబుతున్నారు. బతికితే చాలు అనుకున్న టిడిపినేతులు కూటమి పేరుతో 25 స్థానాలు అడుగుతున్నారు. అన్ని స్థానాలకు పోటీ చేయాలనుకున్న జనసమితి కూటమితో కుంచించుకుపోయి 25కి పైగా స్థానాల్లో నయినా పోటీ చేయాలనుకుంది. ఇపుడు ఇందులో సగం కాదు, సగంలో సగం కూడా రావడం లేదు.
దీనితో కోదండరాం అసంతృప్తితో రగిలిపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
వ్రతం చెడినా ఫలితం దక్కడం లేదాయనకు. ద్వేషించిన తెలుగుదేశం పార్టీతో చేతులు కలుపుదామనుకున్నా ప్రయోజనం పెద్దగా ఉండటం లేదు. ఆంధ్రా పార్టీతో చేతులు కలిపితే టిఆర్ ఎస్ అదే పనిగా అపకీర్తి పాలుచేస్తుంది. పోనీ, కెసియార్ ను ఇంటికో జైలుకో పంపేందుకు అన్ని విషయాలు కాంప్రమైజ్ అవుదామనుకుంటే, ేపు రాబోయే ప్రభుత్వం తన ఆశయాలకు అనుగుణంగా ఉంటుందన్నగ్యారంటీ ఏమిటి. అందువల్ల ఒక మహాకూటమికి ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం (కామన్ మినిమమ్‌ ప్రోగ్రాం – సిఎంపి) రూపొందించాలని, ఆశయాలనన్నింటిని వదులుకుని కూటమిలో చేరుతున్నందుకు పరిహారంగా సిఎంపి తయారు చేసే కమిటీకి అంటే,మహాకూటమికి ఛెయిర్మన్ గా నయినా నియమించాలని ఆయన కోరుతున్నారట.

ఇది సాధ్యమా? సాధ్యం కాకపోతే, కోదండరామ్ ఏం చేస్తారు? ఈ కూటాలకు, గూటాలను
గుడ్‌ బై చెప్పి, సొంత జెండా పట్టుకుని 119 స్థానాలకు పోటీ చేస్తారా? ఈ సమాధానాలే తెలంగాణ జనసమితి భవిష్యత్తును నిర్ణయించేది. వారం రోజులో ఆయనేమిటో,ఆయన పలుకుబడి ఏమిటో తెలిపోతుంది.