(మల్యాల పళ్లంరాజు*)
ఆంధ్ర రాజకీయాలలో కాపుల స్థానం విశిష్టమైనది. రాష్ట్ర జనాభాలో 27 శాతం మేరకు ఉన్న కాపుల ప్రాబల్యం గొప్పదే. అయితే, ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వరకూ అంటే దాదాపు ఆరున్నర దశాబ్దాల కాలంలో కాపు కమ్యూనిటీ కింగ్ మేకర్ గా గుర్తింపు పొందిందే తప్ప కింగ్ ను ఆవిష్కరించలేక పోయింది. ఒకప్పటి హరిరామ జోగయ్య, కన్నాలక్ష్మీనారాయణ, ముద్రగడ పద్మనాభం, చిరంజీవి, వంటి నాయకులు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పదవి చేపట్టే స్థితికి చేరలేకపోయారు.
రాష్ట్రంలో మరో రెండు అగ్రకులాల నేతలు కాపు నాయకుడిని ఆ స్థాయికి ఎదగనీయలేకుండా కృషిచేశారు. పరోక్షంగా అణచివేత జరిగిందని చెప్పవచ్చు. రాష్ట్ర స్థాయి నాయకుడుగా ఎదుగుతున్న సమయంలోనే వంగవీటి రంగా కన్నుమూశారు. తర్వాత రాష్ట్ర స్థాయి నాయకుడుగా ఎదిగిన కాపు నాయకులే లేరు. పవన్ కల్యాణ్ ఆ స్థానం భర్తీ చేస్తారా. ఇప్పటి వరకూ పల్లకీ మోసిన కాపు కమ్యునిటీ. పల్లకీలో తమ నాయకుడిని ఆవిష్కరించుకుంటుందా అన్నది కోటి డాలర్ల ప్రశ్న.
కాపు కమ్యునిటీలో మెజారిటీ సీమాంధ్రలో ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో పట్టుగలిగి ఉంది.
రాష్ట్రంలో అన్ని పార్టీలకూ కాపుల ఓట్లు కావాలి. అందుకే ప్రస్తుత రాజకీయాల్లో కాపు కమ్యునిటీ కీలకం అయింది. ఈ కమ్యునిటీ ఓట్లకోసం టీడీపీ,వైఎస్ ఆర్ సీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా పోటీ పడుతున్నాయి. తమ ప్రయోజనాల విషంలో కాపు కమ్యునిటీ మేధావులు కూడా ఒకే ఆలోచనతో సాగుతారు. ఒకప్పుడు కాపు కమ్యునిటీ కాంగ్రెస్ కు కంచు కోట. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మెజారిటీ కాపులు ఆ వైపు మొగ్గు చూపినా, తర్వాత మళ్లీ కాంగ్రెస్ పక్షానే చేరారు. ఎన్టీఆర్ హయాంలో 1988లో కిస్టమస్ మర్నాడు విజయవాడలో ప్రముఖ కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా హత్యానంతరం కాపులలో వ్యక్తమైన ఆగ్రహం, ఆవేశం, ఆందోళన ఇప్పటికీ పూర్తిగా సమసిపోలేదు. ఆ హత్య కాపు, కమ్మ కమ్యునిటీల మధ్య తీవ్రమైన విభేదాలకు దారితీసింది. రంగా హత్యానంతరం జరిగిన మారణకాండ, 42 మంది మరణాలు, వందకోట్ల పైగా ఆస్తుల ధ్వంసం కమ్మకమ్యునిటీని ఏకం చేసింది. ఆ తర్వాత నుంచి విజయవాడలో కమ్మ కమ్యునిటీ కాపులపై పైచేయి సాధించారు.ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ చతురత వల్ల కాపు కమ్యునిటీకి పూర్తిగా కాంగ్రెస్ కు దన్నుగా నిలిచింది. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్లు కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది.
2009లో అదే కమ్యునిటీకి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో కాపు యువతలో కొత్త ఉత్సాహం పెల్లుబికింది. కానీ, ఇతర వర్గాలను కలుపుకోవడంలో, అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతో చిరంజీవి వైఫల్యం చెందాడు. 18 అసెంబ్లీ సీట్లు గెలిచినా, తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఆ కమ్యునిటీ యువతను నిస్పృహకు, ఆగ్రహానికి గురిచేసింది.
విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని, బీసీలలో చేరుస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి 2014లో కాపులకు 25 పార్లమెంటు స్థానాల్లో నాలుగు, 175 అసెంబ్లీ స్థానాల్లో 27 సీట్లు ఇస్తే, వైఎస్ఆర్ సీపీ 30 అసెంబ్లీ స్థానాలు, ఆరు ఎంపీ సీట్లు, కాంగ్రెస్ 27 అసెంబ్లీ సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చి ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. విభజన అనంతరం కొత్త రాష్ట్రం అభివృద్ధి కావాలంటే సమర్థుడైన చంద్రబాబు నాయకత్వం కావాలని జనం భావించడం, పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడంతో ఈ వర్గం టీడీపీ వైపే మొగ్గుచూపింది.
రాజకీయ చతురతలో అపర చాణక్యుడుగా భావించే చంద్రబాబు, తమ కమ్యునిటీ నేతలకు, తమ ఓటు బ్యాంక్ గా భావించే బీసీలకు ఒకపక్క న్యాయం చేస్తూనే, కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపి, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఓ వెయ్యికోట్లు విసిరి, ఓ పనై పోయింది బాబు అన్నట్లు చేశారు. ఈ తాయిలాలు కాపు కమ్యునిటీని పూర్తిగా సంతృప్తి పరచలేక పోయిన మాట వాస్తవం. దీంతో ప్రత్యామ్నాయంగా జగన్ వైఎస్ ఆర్ పార్టీ వైపు వెళ్లాలా, పవన్ కల్యాణ్ జనసేన వైపు వెళ్లాలా అన్న డైలమాలో ఆ కమ్యునిటీ ఉన్న సమయంలో కాపుల రిజర్వేషన్ల విషయం తన చేతిలో లేదని, అది కేంద్రం పరిధిలోనిదని, నిస్సహాయతను వ్యక్తం చేసి చేతులు ఎత్తివేయడం.. కాపు కమ్యునిటీకి అశని పాతంలా పరిణమించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి కాపు కమ్యునిటీని ఏకంచేసి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ ఓట్ బ్యాంక్ ను చేస్తే, ఆయనే చేజేతులా వారిని దూరం చేసుకున్నారన్న భావన రాజకీయవర్గాల్లో షికారు చేస్తున్నది.
ఆ తరుణంలో పవన్ కల్యాణ్ తమ కమ్యునిటీ ఏకైక నాయకుడిగా ఆ యువత చూస్తున్నారు. ప్రశ్నించడం కోసమే తాను పార్టీ పెట్టానని, అధికారం తనకు అవసరం లేదని, ఆ తపన తనకు లేదని మొదట పవన్ కల్యాణ్ చెప్పినా, తర్వాత సభల్లో తనకు అధికారం ఉంటేనే ఏమైనా చేయగలనని చెప్పడం, ఓట్లు వేస్తే సీఎం అవుతాననడం చూస్తే సొంత బలం లేకున్నా, అధికారం హస్తగతం చేసుకోవాలన్న ఆలోచన పవన్ మాటల్లో వ్యక్తం అయింది.
వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలపై స్పందించడం, జనంలోకి దూసుకుపోవడం, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడం, ఉత్తరాంధ్ర నుంచి సాగిస్తున్న సుడిగాలి పర్యటన, చూస్తుంటే ఈ సారి పవన్ కల్యాణ్ ప్రభంజనం వస్తుందా అని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. తమ కమ్యునిటీకి చెందిన వ్యక్తి సీఎం కావాలన్న బలమైన ఆకాంక్ష కాపు కమ్యునిటీ యువతలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో 2014లో కింగ్ మేకర్ గా పేరొందిన పవన్ కల్యాణ్ ఇప్పుడు స్వయంగా కింగ్ గా మారతారా అన్నది వేచి చూడాలి.
(*మల్యాల పళ్లం రాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్)