వానా వానా వల్లప్పా…

(మల్యాల పళ్లంరాజు)

చిన్నప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చిరు జల్లుల్లో తడుస్తూ.. వానా వానా వల్లప్పా.. వాకిలి తడిసే వల్లప్పా.. తిరుగు తిరుగు తిమ్మప్పా.. తిరగాలేను నర్సప్పా.. అని చక్కగా ఆడుకునేవాళ్లం.. జూన్ లో తొలకరి వచ్చినప్పటి నుంచి దాదాపు 3,4 నెలలు శ్రావణ భాద్రపదం నెలలు ముగిసే వరకూ వర్షాలే..

చిన్నప్పుడు  వర్షాకాలం వచ్చిందంటే ఆ సంబరాలే వేరు. గ్రామాల్లో జేష్ఠ మాసం పున్నమి.. ఏరువాక పున్నమి, అప్పటికే దుక్కి దున్ని ఉంచు కున్న భూములలో ఆనాడు విత్తనాలు వేయడం, అప్పటికే సిద్ధమై ఉంటే నార్లు నాటడం చేసేవారు. ఇక  సర్కార్ బడుల్లో.. అప్పట్లో అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వ పాఠ శాలలే కదా.. మరీ గట్టిగా వర్షం వస్తే, స్కూలికే పంపేవారు కాదు. అందుకే అప్పట్లో మా చదువుల్లి వానాకాలం చదువులు అనే వారు. ఒక వేళ బడిలో ఉన్నప్పుడు.. వర్షం మొదలైతే,  మధ్యాహ్నం భోజనం చేసేవరకూ, తరగతులు నడిపి గంట కొట్టేసేవారు. వర్షం పడుతున్నా.. హుషారుగా, హాయిగా తడుసుకుంటూనే, ఇంటికి పరుగు…తర్వాత ఇంట్లో అమ్మ పెట్టే చివాట్లు, తాయిలాలు భలే మజాగా ఉండేవి.

కాస్త డబ్బు ఉన్నోళ్లు.. గొడుగులు తెచ్చుకునేవారు.. ఒకే గొడుగులో నలుగురు దోస్తులు ఒక పక్క తడుస్తూ, పోవడం అదో మజా. నిజానికి వర్షాకాలం మొదలు కాక ముందే  కొన్ని గ్రామాల్లో గొడుగులు బాగు చేసేవాళ్లు.. సైకిళ్లు వేసుకుని, పాత గొడుగులు బాగు చేస్తాం… కొత్త గుడ్డలు వేస్తాం.. అని వచ్చే వాళ్లు. మా బామ్మ లాంటి వాళ్లు.. తీరిబడిగా కూర్చుని, పాత గొడుగులకు మాసికలు వేయడమో, ఇనుప ఊసలను మార్పించడమో  ముందే చేసి, వర్షాకాలానికి ముందే గొడుగులు సిద్ధం చేసే వాళ్లు. మధ్యతరగతి కుటుంబాల్లో అమ్మలు, జేబురుమాళ్లతో పాటు, గొడుగు పై కూడా మన పేరు, లేదా మన పేరులో ఓ అక్షరం కుట్టి పంపించే వాళ్లు.

ఇక వ్యవసాయం చేసే  రైతులు, రైతు కూలీలు, ముఖ్యంగా పేదలైతే, నెత్తిమీత గోనె సంచీలు నెత్తిమీద కప్పుకుని పనులు చేసుకునే వాళ్లు. వర్షాకాలంలో బడికి వెళ్లే పిల్లలకు కూడా నెత్తిన ఓ గోనె సంచీ వేసి పంపేవాళ్లు. కొన్ని ప్రాంతాల్లో తాటాకు గొడుగులు వాడే వారు. ముఖ్యంగా  పాలు పోసేవాళ్లు, పని వాళ్లు.. ఇలాగే పని చేసేవాళ్లు..

ఆరోజుల్లో వర్షంలో బయటకి వెళ్ళడం అంటే ఓ మజాగా ఉండేది.మరీ పొలాలంబడ మోకాల్లోతునీళ్ళల్లో వెడితే,అదో మజా. ఇప్పుడు గ్రామాల్లోనూ  మట్టి రోడ్లు పోయి. సిమెంటు రోడ్లు వచ్చే శాయి. ఇప్పుడు గొడుగులూ మోసుకెళ్ళడం నామోషీ అయింది. దానికి తగ్గట్లు ఫోల్డింగు టైపు గొడుగులొచ్చాయి. వాటి తరువాత రైన్ కోట్లూ, వచ్చాయి వర్షం పడుకున్నా,,, పిల్లలకి ఇళ్ళల్లోనే ఆ రైన్ కోట్ వేసేసో, స్కూలు బ్యాగ్గులోనో పెట్ పంపించడమో చేస్తున్నారు తప్ప, తల్లిదండ్రులు స్కూల్ మాన్పించడం లేదు ఇటీవల.

ఇప్పుడయితే, గ్రామాల్లో ఇళ్లలోనూ, పంట పొలాల్లోనూ, బోరు బావులు  పెరిగి పోయి భూగర్భ జలాలు పడిపోయి, నీళ్ల కరువు ఉంది కానీ, అప్పట్లో  గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ బావులు ఉండేవి, పెరట్లో ఉండే బావిలో వర్షం నీరు పైకి వచ్చి బొక్కెన  వేయకుండానే నీళ్ళు తోడుకోడం గొప్ప అనుభూతి.

వర్షం కారణంగా బడి విడిచేశారంటే, పాత పుస్తకాలు చించేసి, కాగితం పడవలు చేసి, ఇంటి ముందు సాగే, నీటిలో వేయడం ఓ మజా. ఇప్పుడు వర్షాలు లేవు.  వర్షాలు ఉన్నా.. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి ఎక్కువ. పిల్లలు టీవీకి, వీడియో గేమ్ లకే పరిమితమై పోతున్నారు.

చినుకే పడదేం… చెన్నప్పా…

ఈ ఏడాది.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలే లేవు.. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలలో పది జిల్లాలు వర్షాభావంతో ఇబ్బందులు పడుతుంటే, తెలంగాణలో (పాత) పది జిల్లాల్లోనూ వర్షాల కరువే. ప్రభుత్వాలు కరువు నివారణ చర్యలు చేపట్టి, నిధులు కేటాయించేసి చేతులు దులుపుకుంటున్నట్లు ఉంది. ఆషాఢ మాసంలో మా అమ్మవారికి బోనాలు పోసిన ఫలితమేమో కానీ,  రెండు మూడు రోజులుగా అడపా దడపా వర్షాలు మొదలయ్యాయి. అమ్మవారి దీవెనో,, బంగాళా ఖాతంలో అల్పపీడనం ఫలితమో మొత్తం మీద వానలు మొదలయ్యాయి. కేరళ, యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, హర్యానాలలో వర్షాలు ముంచెత్తుతున్నా…ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడే మొదలైన ఈ వర్షాలు ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.

 

*మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్