బెట్టింగ్ దందా: రానా, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి సహా 25 మంది పై కేసులు!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు ముమ్మరం అవుతోంది. అక్రమంగా డబ్బులు సంపాదించే ఈ యాప్స్ వల్ల ఎంతో మంది తమ సొమ్ము పోగొట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో పాటు, ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, బుల్లితెర నటీనటులపై కేసులు నమోదవ్వగా, తాజాగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది.

హైదరాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో టాలీవుడ్ నటీనటులు రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్ల, ప్రణీత సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇక బుల్లితెర నుంచి శోభా శెట్టి, సిరి హనుమంతు, నయని పావని, శ్రీముఖి, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, వర్షిణి, వసంత కృష్ణ, అమృత చౌదరి, ఇమ్రాన్ ఖాన్ సహా మొత్తం 25 మంది సెలబ్రిటీలకు నోటీసులు జారీ అయ్యాయి.

ఇప్పటికే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్‌ ఖాన్, కిరణ్‌ గౌడ్‌, హర్ష సాయి, రీతూ చౌదరి, టేస్టీ తేజ, సుప్రీత, సుధీర్‌, అజయ్‌, సన్నీ యాదవ్‌, సందీప్ పేర్లతో మొత్తం 11 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act- 2008 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. టేస్టీ తేజ, విష్ణుప్రియ తదితరులు విచారణకు కూడా హాజరయ్యారు.

ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు అరెస్ట్ కాగా, మరికొందరు విచారణకు హాజరవుతున్నారు. తమ సోషల్ మీడియా ద్వారా వీళ్లు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడంతో ఎంతో మంది భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు. పబ్లిసిటీ కోసం పేమెంట్స్ తీసుకున్న సెలబ్రిటీలు ఇప్పుడు నేరుగా కేసుల్లో చిక్కుకోవడం గమనార్హం. ఈ కేసుల దర్యాప్తు మరింత వేగవంతం అవుతోంది. ఇప్పటి వరకు బుల్లితెర సెలబ్రిటీలను టార్గెట్ చేస్తారని భావించిన నెటిజన్లు, ఇప్పుడు పెద్ద సినిమాల స్టార్స్ పై కేసులు నమోదు కావడం చూసి షాక్ అవుతున్నారు. మరోవైపు, నెటిజన్లు మాత్రం “తప్పు చేసిన వాళ్లందరూ శిక్ష అనుభవించాల్సిందే” అంటూ డిమాండ్ చేస్తున్నారు.