చాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు అపజయం లేకుండా పయనిస్తూ, ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ రూ.58 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇది ఐసీసీ అందించిన అధికారిక ప్రైజ్ మనీ కంటే మూడింతల ఎక్కువ కావడం గమనార్హం. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సెలక్షన్ కమిటీ సభ్యులకు అందజేయనున్నట్లు బోర్డు తెలిపింది.
ఇండియా టోర్నమెంట్‌లో.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్, ఆ తర్వాత పాకిస్తాన్‌పై మరో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు చేరిన భారత జట్టు, ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. బీసీసీఐ ఈ విజయాన్ని భారత క్రికెట్ యొక్క బలాన్ని తెలియజేసే అద్భుతమైన ఘట్టంగా అభివర్ణించింది.
బోర్డు అధ్యక్షుడు రొజర్ బిన్నీ మాట్లాడుతూ, “బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ టైటిల్స్ గెలవడం ప్రత్యేకమైన విషయం. ఈ ఆర్థిక నజరానా టీమ్ ఇండియాకు గల గౌరవాన్ని చూపించే సూచిక” అని తెలిపారు. ఇదే ఏడాది భారత్ మహిళల అండర్-19 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకోవడం, దేశంలో క్రికెట్‌కు ఉన్న బలమైన వ్యవస్థను రుజువు చేస్తోందని అన్నారు.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సాయికియా మాట్లాడుతూ, “భారత ఆటగాళ్ల కష్టసాధన, ప్రణాళికాబద్ధమైన ఆలోచన వల్లే ఈ విజయం సాధ్యమైంది. టీమ్ ఇండియా తెలుపుతున్న అంకితభావం, అద్భుత ప్రదర్శన ప్రపంచ క్రికెట్‌లో భారత స్థానాన్ని మరింత బలపరిచింది” అని అభిప్రాయపడ్డారు. బీసీసీఐ ఈ నజరానాతో ఆటగాళ్ల కృషిని గుర్తిస్తూనే, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శనకు ప్రోత్సహించనుంది.