Robinhood : సినిమా పాటలు ప్రేక్షకులను ఆకర్షించడానికి సంగీతంతో పాటు డ్యాన్స్ మూమెంట్స్ కీలకంగా మారాయి. గతంలో మాస్ సాంగ్స్‌కి క్లాస్ టచ్ ఉండగా, ఇప్పుడు హుక్ స్టెప్పుల పేరిట మరీ ఘాటుగా డిజైన్ చేయడం కొత్త చర్చకు దారి తీసింది. హీరోలు, హీరోయిన్లు పాటల్లో చేసే డ్యాన్స్ స్టెప్పులు సినిమా ప్రమోషన్‌కి ఉపయోగపడినా, కొన్ని మూమెంట్స్‌పై ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా విడుదలైన ‘రాబిన్ హుడ్’ సినిమాలోని ‘అదిదా సర్‌ప్రైజు’ పాట కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఈ పాటలో హీరోయిన్ కేతికా శర్మ చేసిన హుక్ స్టెప్పులు, మల్లెపూల డిజైన్‌తో కూడిన కొరియోగ్రఫీపై నెగటివ్ కామెంట్లు పెరిగాయి. సోషల్ మీడియాలో ఈ స్టెప్పులు హీటెక్కడంతో, ట్రోలింగ్ ఊహించని విధంగా పెరిగింది. ఇదే తరహాలో గతంలో ‘డాకు మహారాజ్’ సినిమాలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పాటలోని కొన్ని మూమెంట్స్ కూడా నెగటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ సమయంలో విమర్శలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సన్నివేశాలను మార్చి థియేటర్లలో రిలీజ్ చేశారు.
ఇప్పుడు ‘అదిదా సర్‌ప్రైజు’ పాటపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదులు అందడంతో, స్టెప్పులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తొలగించాలని సూచించారు. మేకర్స్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, ఎడిటింగ్ మార్పులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో హుక్ స్టెప్పుల పేరుతో మరీ బోల్డ్ మూమెంట్స్‌ను ఉపయోగించడం పట్ల విమర్శలు పెరుగుతున్నాయి. ట్రెండ్‌ను అనుసరించాలన్న ఉద్దేశంతో మేకర్స్ మరీ హద్దులు దాటుతున్నారా అనే డిబేట్ ఇండస్ట్రీలో నడుస్తోంది.
ఈ తరహా స్టెప్పుల వల్ల సినిమా పబ్లిసిటీ బాగా పెరిగినా, మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాటల హుక్ స్టెప్పులు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు, ప్రశ్నించబడే విధంగా ఉండడం పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. మేకర్స్, కొరియోగ్రాఫర్లు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండేలా మహిళా కమిషన్ హెచ్చరిక పనికొస్తుందా లేక ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారుతుందా చూడాలి.