ఇకపై ఏ వాహనం అయినా 20 ఏళ్ళు మాత్రమే బతకాలి. అంతకు మించి బతకాలనుకుంటే కుదరదు. వ్యక్తిగత వాహనాలకే ఈ 20 ఏళ్ళ నిబంధన. కమర్షియల్ వాహనాలకైతే 15 ఏళ్ళు మాత్రమే బతకాలి. ఆ తర్వాత వాటిని తుక్కుగా మార్చెయ్యాల్సిందే. కేంద్రం, కొత్త నిబంధన తెరపైకి తెస్తోంది. ఈ మేరకు తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. వాహనాలు కొంతకాలం తర్వాత పాడైపోతాయనీ, తద్వారా కాలుష్యం పెరగడంతోపాటు, ప్రమాదాలూ పెరుగుతాయన్నది కేంద్రం వాదన. ఇందులో నిజం లేకపోలేదు. కానీ, వాహనం.. అంటే, చాలామందికి ప్రాణంతో సమానం. ఒకప్పుడు వాహనాల్ని కొనుగోలు చేయడమంటే, అది జీవితాంతం తమతోనే వుంటుందనే భావన వుండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి ఏడాదీ కారు మార్చేసేవారు ఎక్కువైపోయారు. రీసేల్ వాల్యూ కోణంలో కావొచ్చు, మోజు తీరిపోవడం కావొచ్చు.. ఇంకో కారణం కావొచ్చు. కారణమేదైనా, ఎక్కువ కాలం ఒకే వాహనం వాడటం అనేది బోరింగ్ వ్యవహారమైపోయింది.
అలా ఫీలయ్యేవారికి కేంద్రం తీసుకురానున్న కొత్త నిబంధన పెద్ద ఊరటే. మార్కెట్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు వస్తూనే వుంటాయి. క్రమంగా రోడ్ల మీద పాత వాహనాలు తగ్గిపోతాయి. అయితే, ఇక్కడ వాహనదారుల ఆర్థిక స్థితిగతులు ఏమవ్వాలి.? వారి సెంటిమెంట్లు ఏమవ్వాలి.? అన్న ప్రశ్న కూడా వస్తోంది. కేవలం, ఈ ‘జీవిత కాలం’ నిబంధన వాహనాలకేనా.? భవిష్యత్తులో మనుషులు కూడా ఎక్కువ కాలం బతక్కూడని ప్రభుత్వాలు ఏమైనా నిబంధనలు తెస్తాయా.? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అంతే మరి, ప్రజారోగ్యం మీదా, సంక్షేమం మీద ప్రభుత్వాలు పెద్దయెత్తున ఖర్చు చేస్తున్నాయి. జనాభా సమస్య దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ భారాన్ని తగ్గించుకోవడానికి సమీప భవిష్యత్తులో ‘ఇంత కాలమే జీవించాలి..’ అనే తుగ్లక్ నిబంధనో, లేదంటే, ఇంత వయసొచ్చాక సంక్షేమ పథకాలు వర్తించవనో తుగ్లక్ పాలకులు చెబితేనో.? అన్న డౌటానుమానాలు కొందరికి కలుగుతున్నాయి. కానీ, అలా జరిగే పరిస్థితి వుండదు. ఎందుకంటే, రాజకీయ పార్టీలకు ఓట్లు కావాలి. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిపోయాం మనం. జనాభా పెరగాలి, సంక్షేమ పథకాల లబ్దిదారులు పెరగాలి. ఇదే రాజకీయ పార్టీల లక్ష్యంగా, ప్రభుత్వాల ఆలోచనగా కనిపిస్తోంది. కానీ, మద్యతరగతి ప్రజానీకమే.. ప్రభుత్వాల చర్యల కారణంగా అటు పైకి ఎగరలేక, ఇటు కిందకి పడిపోలేక.. నరకాన్ని అనుభవించాల్సి వస్తోంది తుగ్లక్ ప్రభుత్వాల నిర్ణయం కారణంగా.