ఆంధ్ర, తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరు లాభించేనా !

million dislikes for man ki beat modi twitter account hacked

(మల్యాల పళ్లంరాజు)

తెలంగాణలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ముందస్తుకు హడావుడి చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మళ్లీ మరో ఐదేళ్లు అధికారంలోకి వచ్చేందుకు ఏఏ పార్టీలతో జతకట్టాలి అన్న అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఇటు తెలంగాణలో కానీ, అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతీయ జనతా పార్టీతో పొత్తు కట్టే పార్టీలేవీ పెద్దగా కన్పించడం లేదు. దీంతో 2019 పార్లమెంటు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు జరిగే ఎన్నికలలో కాషాయ దళం ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నది. జనసంఘ్ నాటి రోజుల్లో కానీ, భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి పట్టుమని పది స్థానాలు సాధించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో బీజేపీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏమేరకు సొంత బలం పై నెగ్గుకు వస్తుందో చూద్దాం.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్. టి. రామారావు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు నడుం బిగించడంతో భారతీయ జనతా పార్టీ టీడీపీ మధ్య అవగాహన పెరిగింది. చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత 90వ దశకం చివర్లో అటల్ బిహారీ వాజపేయి ఆధ్వర్యంలోని బీజేపీకి చేరువయ్యారు. దీంతో కొన్నేళ్లపాటు బీజేపీ టీడీపీ దోస్తీ…జోరుగా సాగింది. టీడీపీ లోక్ సభ స్పీకర్ పదవి కూడా తీసుకున్నారు. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత ఉభయ పార్టీల మధ్య స్నేహసంబంధాలు దెబ్బతిన్నాయి.

2014 జూన్ 2 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. 2014 మే లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ విభజన, నరేంద్ర మోడీ ప్రభంజనం నేపథ్యంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ బీజేపీ వైపు మొగ్గు చూపారు. అటు బీజేపీ, ఇటు జనసేన పార్టీల మద్దతుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగలిగారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం తో పొత్తు కారణంగా భారతీయ జనతా పార్టీ 9 అసెంబ్లీ స్థానాలను, 3 పార్లమెంటు స్థానాలను గెలుచు కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సాధించిన అతి పెద్ద విజయం అది. నిజానికి ఆంధ్రలో బీజేపీ నాలుగు స్థానాల్లో పోటీ చేసినా, కేవలం రెండు స్థానాల్లో నెగ్గింది. విశాఖ పట్నం నుంచి హరిబాబు, నర్సాపురం నుంచి గోకరాజు గంగరాజు, విజయం సాధించగా, రాజం పేట నుంచి పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి, తిరుపతి నుంచి పోటీ చేసిన కారుమంచి జయరాం ఓటమి పాలయ్యారు. సికింద్రాబాద్ లో బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. తెలంగాణలో బీజేపీ నెగ్గిన ఏకైక పార్లమెంటు సీటు అది.టీడీపీతో పొత్తు కారణంగానే, ఎమ్మెల్సీ పదవులు అందుకోగలిగింది. ఇద్దరు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

తెలుగురాష్ట్రాల్లో బీజేపీ పార్టీ బలం ఎంత

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సమస్యపై తెలుగుదేశం బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. తెలంగాణలో కూడా బీజేపీ, తెలుగుదేశం తెగతెంపులు అయినట్లే. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ లో కానీ పూర్తిగా అన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే సామర్థ్యం కానీ, విజయం సాధించగల నాయకులు గానీ, కార్యకర్తల బలం కానీ లేదనేది సుస్పష్టం. అర్బన్ పార్టీగా పేరొందిన బీజేపీకి కొన్ని నగరాలలోనే కార్యకర్తల బలం ఉంది. ఆర్ ఎస్ ఎస్ , సంఘ్ పరివార్ సంస్థల బలాన్నికూడగట్టుకున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో బలం లేనందువల్ల ఒంటరిగా నెగ్గే అవకాశాలు దాదాపు మృగ్యమే. అయినా అటు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణ లోనూ తాము ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామన్న బీజేపీ ధీమా చూస్తుంటే.. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభంజనం పైనే ఆశలతో ఉన్నట్లు కన్పిస్తోంది.
ఒక దశలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, పవన్ కల్యాణ్ జనసేన, జగన్ వైసీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరిగినా, ప్రస్తుతం ఆ అవకాశాలు కన్పించడం లేదు. పెద్దగా కేడర్ లేని బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, జనసేనతో పంచ ముఖ పోటీలలో ఏమేరకు నెగ్గుకు రాగలదో చూడాలి.

2014 పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు. 2014లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం ఉంది. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో మోడీ గ్రాఫ్ చాలా మేరకు పడిపోయింది.

500, వెయ్యి నోట్ల రద్దు, జీఎస్టీతో జనం పై పడిన అదనపు భారం, రోజురోజుకూ పెరిగి పోతున్న నిత్యావసర ధరలు, మండి పోతున్న పెట్రోలు ధరలు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామంటూ నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానం వట్టి మాటలే అని తేలిపోయాయి. 2019లో కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడమే ప్రశ్నార్థకంగా మారింది. 2014లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, శివసేన వంటి పార్టీలు బిహార్ లో ఇటీవల కలిసిన జేడీయూ కూడా పార్లమెంటు ఎన్నికల నాటికి బీజేపీతో కలిసే అవకాశాలు కన్పించడం లేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరి పోరు కనీసం ఒకటి రెండు పార్లమెంటు స్థానాలనైనా నెగ్గుకు రాగలదా అన్నది ప్రశ్నార్థకమే. నిజానికి బిజెపి  స్వతంత్రంగా  పోటీ చేసి 1998 లో నాలుగు లోక్ సభస్థానాలు గెల్చుకుంది. అపుడు 18.3 శాతం ఓట్లు సంపాదించించి. అయితే, ఆ ప్రాభవం కాపాడుకోవడానికి బదులు టిడిపితో పొత్తు పెట్టుకుని ఎదగలేకపోయింది.  2014 ఎన్నికల్లో టిడిపి తో పొత్తు ఉన్నా మూడు శాతం మించి వోట్లు రాలేదు.అందువల్ల ఇపుడున్న పరిస్థితులోల స్వతంత్రంగా పోటీ చేస్తే  బిజెపి కూడా వామపక్షాల్లాగా కంట్లో కలికానికి లేకుండా పోతుందా లేక 1998 నాటి బలం నిరూపించుకుంటుందా? 

తెలుగురాష్ట్రాలలో మోదీ పెద్ద ఇన్స్పిరేషన్ కాదు. ఆయన చేతులూపడం చూడటం తప్ప మోదీ భాష ఇక్కడి వాళ్లకు అర్థమయి చావదు. దానికితోడు  ఈ మధ్య బిజెపిని రాష్ట్రంలో పొగిడే పార్టీయే లేకుండా పోయింది. బిజెపి ని పొగిడితే జనం హర్షించరనే భావం ఆంధ్రలో కల్గించడంలో చంద్రబాబు విజయవంతమయినట్లే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో పోటీచేయడం వల్ల బిజెపి సత్తా నిరపించుకుంటుందా … చూడాలి.

 

*మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్