“పార్టీ లేదు.. డ్యాష్ లేదు” అని అచ్చెన్నాయుడు ఏ ముహూర్తాన్న అన్నారో తెలియదు కానీ… ఆ మాటల వీడియోలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ అచ్చెన్నాయుడు ఏమిచేసినా.. అందులో రెండో కోణంపై విశ్లేషణలు సాగుతున్నాయి. అది పైకి.. అచ్చెన్నాయుడు పార్టీ మేలు కోసం చేసినట్లు అనిపిస్తున్నా.. దాని వెనకాల ఆయన మనసులోమాటను నిజం చేయాలనే తపన కూడా ఉందా అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా… తాజాగా రాష్ట్రంలోని టీడీపీ నేతలందరికీ ఒక పరీక్షపెట్టారు అచ్చెన్నాయుడు.
ప్రస్తుతం “యువగళం” పేరుతో లోకేష్ పాదయాత్రం రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు త్వరలో వందరోజులు పూర్తవ్వనుంది. అవును… ఈ నెల 15న లోకేష్ పాదయాత్రకు శతదినోత్సవం జరగనుంది. దీంతో లోకేష్ సాధించిన ఈ ఘనకీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా నిర్ణయించాలని ఫిక్సయ్యారు ఏపీ టీడీపీ ఇన్ ఛార్జ్ అచ్చెన్నాయుడు. ఈ మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ నాయకులు… తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఏపీలోని ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలందరినీ కలుపుకుపోతూ… కనీసం ఏడు కిలోమీటర్ల దూరం ఉండేలాగా పాదయాత్రలు చేయాలని పిలుపునిచ్చారు అచ్చెన్నాయుడు. తద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఏకకాలంలో యాక్టివేట్ చేసినట్లవుతుంది భావించారు. దీంతో… ప్లాన్ బాగానే ఉంది అంటూనే ఆచరణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఇది ఒకరకంగా చూస్తే పార్టీకి ప్లస్ పాయింట్ అని… మరోరకంగా చూస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే ప్రమాధం ఉందని అంటున్నారు.
ఏపీలో ఇప్పుడూ 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ బలంగా లేదు! ఇప్పటికీ టిక్కెట్టు కన్ ఫాం చేయడం లేదనే కోపంతో పక్క చూపులు చూస్తున్న నేతలెందరో ఉన్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకులు లేక, కేడర్ అనాధగా మిగిలిన పరిస్థితి. ఈ నేపథ్యంలో… అచ్చెన్న ఇచ్చిన పిలుపుతో ఈ లోపాలన్నీ తెరపైకి వచ్చే ప్రమాధం ఉందని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు. జిల్లాల వ్యాప్తంగా ఈ పాదయాత్రలు ప్లాన్ చేస్తే… ఆ జిల్లాల్లో ఒకటి రెండు నియోజకవర్గాల్లో పరిస్థితి బాగోకపోయిన… గుంపులో గోవిందలా వ్యవహారం చక్కబడిపోయేది కానీ… ఇలా ప్రతీ నియోజకవర్గానికి అని చెప్పడం వల్ల డొల్ల బయటపడిపోయే ప్రమాధం ఉందని అంటున్నారు.
దీంతో… అచ్చెన్నాయుడుకి ఈ విషయం తెలియదా.. తెలిసే ఈ నిర్ణయం ప్రకటించారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో సీటుకీ ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్న పరిస్థితి. ఉదాహరణకు సత్తెనపల్లి లాంటి నియోజకవర్గం. మరి అక్కడ ఏ టీడీపీ నేత లీడ్ తీసుకుని ఈ పాదయాత్రలు చేపడతారు అనేది చెప్పడం కష్టం. ఫలితంగా వర్గపోరు తెరపైకి రావడం.. ఫలితంగా మొదటికే మోసం రావడం జరిగే మరొక ప్రమాధం ఉందని అంటున్నారు.
ఏది ఏమైనా… ఏకకాలంలో అన్ని నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలకు అగ్ని పరీక్ష పెట్టిన అచ్చెన్నాయుడి ప్లాన్ ఎలాంటి ఫలితాలిస్తాదనేది వేచి చూడాలి!