నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు విన్న తరువాత నాకో కథ జ్ఞాపకం వస్తున్నది. శ్రీరాముడు ఒకసారి ఎక్కడికో నడిచి వెళ్తుండగా ఒక కప్పు ఆయన కాలికింద పడింది. శ్రీరాముడు అది గమనించకుండా ఒక పౌరిడితో మాట్లాడుతున్నాడు. కొంతసేపటి తరువాత ఆయనకు మూలుగు వినిపించింది. కాలు పక్కకు జరిపాడు. విలవిలా కొట్టుకుంటున్న కప్పను చూసి “అయ్యో…మండూక శ్రేష్టమా….నా పాదం నీమీద మోపబడినపుడు అరవకుండా ఎందుకు బాధను సహించవు?” అని ప్రశ్నించాడు. “శ్రీరామా…నాకు ఎవరైనా అన్యాయం చేస్తే నేను శ్రీరామా..శ్రీరామా అని వేదనతో ఆర్తనాదాలు చేస్తాను. కానీ, ఆ శ్రీరాముడే నాకు అన్యాయం చేసినపుడు నేను ఎవరితో మొరపెట్టుకోవాలీ?” అని బదులిచ్చింది ఆ భేకము.
ఆశ్చర్యానికి గురిచేసిన తీర్పు
సాధారణంగా ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వాలు ఒక్కోసారి తమ నిరంకుశత్వంతో ప్రజాకంటకంగా మారుతాయి. అమాయకులను వేధిస్తాయి. అలాంటి సందర్భాల్లో మనకు రాజకీయంగా న్యాయం జరగనప్పుడు మనం ఆశ్రయించేది న్యాయస్థానాలనే. ప్రభుత్వ కర్కశత్వం నుంచి కోర్టులు అలా అమాయకులను రక్షించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, నిన్న ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ మాజీ అడ్వకేట్ జనరల్, మరియు రాజధాని భూముల అక్రమాల్లో ఎసిబి పెట్టిన కేసుల మీద ఆగమేఘాల మీద ఇచ్చిన తీర్పు దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ అనేక సందేహాలు సామాన్యుల మదిలో మెదులుతున్నాయి.
దర్యాప్తు చేయించే అధికారం కూడా ప్రభుత్వానికి లేదా?
ఇన్నాళ్లుగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సుప్రీమ్ అనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాని మంచి చెడులకు అధికార పార్టీదే బాధ్యతగా ఉండేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక భయంకరమైన అవినీతి జరిగిందని భావించి అందుకు బాధ్యులైన వారిమీద తన అధికారపరిధిలోని అవినీతి నిరోధక శాఖ వారితో దర్యాప్తు జరిపిస్తే దాన్ని హైకోర్టు కొట్టేయడం, దర్యాప్తు జరపడానికి వీల్లేదని ఆదేశించడం చాలా ఆశ్చర్యకరం. అంటే ఒక ప్రభుత్వానికి ఒక నేరంపై విచారణ జరిపించే అధికారం కూడా లేదా?
పరువు మర్యాదలు గొప్పవారి సొంతమా?
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో రాజ్యాంగపరమైన దోషం ఏమైనా ఉంటే కోర్టు ఆ నిర్ణయాన్ని అడ్డుకోవచ్చు. కానీ, ఎసిబి దర్యాప్తు వెయ్యడంలో రాజ్యాంగ దోషం ఏముంది? పైగా సదరు నిందితుడు దమ్మాలపాటి శ్రేనివాస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలు ఆ నివేదికలో ఉన్నారు కాబట్టి వాటిని బయటపెట్టరాదని, పత్రికల్లో ప్రచురించరాదని, సోషల్ మీడియాలో రాయకూడదని ఆదేశించడం ఎలా రాజ్యాంగబద్ధమో నాకు అర్ధం కావడం లేదు. అంటే గొప్పవారి బంధువులు కేసుల్లో నిందితులుగా ఉంటే ఆ వివరాలను దాచిపెట్టాలా? పరువు మర్యాదలు, ప్రతిష్ట గొప్పవారికేనా? సామాన్యులకు ఉండవా? సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి గారి కుమార్తెలు, దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రస్తుతం ఎలాంటి అధికారిక పదవుల్లోగానీ, రాజ్యాంగహోదాల్లో గానీ లేరు. వారు కూడా సామాన్య పౌరులే. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినవారిమీదే కేసులు పెట్టి జైళ్లలో పెట్టిన వ్యవస్థ మనది. ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులను, మాజీ ప్రధానమంత్రులని సైతం విచారించి జైళ్లల్లో పెట్టిన చట్టం మనది. వారికన్నా ఒక మాజీ ఏజీ ఏవిధంగా గొప్పవారు?
ఇక్కడ నేరం జరిగింది అని ప్రభుత్వం ఆధారాలతో సహా నివేదికను బయటపెట్టింది. సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరింది. వైసిపి ఎంపీలు లోక్ సభలో రాజధాని అవినీతి పై సిబిఐ తో విచారణ జరిపించాలని కోరారు. ఒక నేరం జరిగిందని ఒక ప్రజాప్రభుత్వం ఆరోపించినపుడు దానిపై సత్వరం విచారణ చెయ్యాల్సిన కోర్ట్ అసలు దర్యాప్తును ఆపాలని ఏ విధంగా ఆదేశిస్తుందో సామాన్యులకు అవగతం కావడం లేదు. ఈ రకమైన తీర్పులు నేరగాళ్లకు మరింత బలాన్ని చేకూర్చడం లేదా?
ప్రభుత్వ దోషం ఉంటే పరిహారం కోరవచ్చు
ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏమిటంటే…తన అధికారపరిధిలో ఉన్న సంస్థలతో దర్యాప్తు చేయించుకునే అధికారం ఒక ప్రభుత్వానికి ఉన్నదా లేదా? కేవలం కొందరు గొప్ప కుటుంబాలవారు నిందితులుగా ఉన్నారనే సాకుతో దర్యాప్తును నిరోధించవచ్చా? నేరానికి గొప్ప, బీద అనే తారతమ్యాలు ఉన్నాయా? ఒకవేళ ప్రభుత్వం ఆరోపించిన నేరం రుజువు కాకపోతే సదరు బాధితులు ప్రభుత్వం మీద పరువునష్టం దావాలు వేసి పరిహారం రాబట్టుకోవచ్చు కదా?
మేధావుల నిరసనలు
నిన్నటి హైకోర్టు తీర్పుపై తెలుగు మేధావులు ఇంకా నోళ్లు విప్పలేదు కానీ, జాతీయస్థాయిలో చాలామంది పెదవి విప్పారు. ఈ తీర్పు అన్యాయం అంటూ ఎలుగెత్తారు. భావప్రకటనా స్వేచ్ఛను కాపాడవలసిన వ్యవస్థలు ప్రజల గొంతుకలు నొక్కడం ఏమిటని నిలదీస్తున్నారు. రాజ్ దీప్ సర్దేశాయి, వినోద్ కె జోష్, టైమ్స్ గ్రూప్ రాహుల్ శివశంకర్, ఎన్డీటీవీ ఉమా సుధీర్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ సంపాదకుడు సునీల్ జైన్, దక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరామ్ కర్రీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లాంటి అనేకమంది మేధావులు హైకోర్టు తీర్పు ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాచే విధంగా ఉన్నదని దుయ్యబట్టారు.
చట్టం అందరికీ ఒకటే
చట్టం ముందు అందరూ సమానమే. ఏ కొద్దిమందో చట్టానికి అతీతులు అని భావిస్తే ఆ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటే. ఈ తీర్పును తక్షణమే పునస్సమీక్షించాలి. అవినీతిపరులను, దోపిడీదారులను బోను ఎక్కించకపోతే న్యాయవ్యవస్థకు అర్ధమే లేదు. ఒక తాగుబోతు డాక్టర్ రోడ్డు మీద అల్లరిచేసినపుడు పోలీసులు కేసు పెడితే, దాన్ని కొట్టేసి ఆ చిన్న కేసును సిబిఐ కి అప్పగించిన హైకోర్టు వేలకోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన ప్రజాప్రయోజనాలు సంబంధించిన దర్యాప్తును నిరోధించడం ఎంత పెద్ద వింత! ఎవరిని రక్షించడం కోసం? పౌరుల గొంతు నొక్కడం ఎవరి ప్రయోజనాల కోసం?? ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని విధించిన రోజును చీకటిరోజుగా ఈనాటికీ చెప్పుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా నిన్న చీకటిరోజే.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు