పవన్ కల్యాణ్ నాకు చేసిన ద్రోహం వ్యక్తిగతం.. కచ్చితంగా ద్రోహమే.. కానీ ఆయన వ్యక్తిగత్గంగా మచివారు, డబ్బు పిచ్చి లేనివారు. సమాజానికి సేవ చేయడానికి కుటుంబాన్ని వదిలేశారు అని చెప్పుకొస్తున్నారు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. ఈ మేరకు ఆమె ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు.
అవును… పవన్ కల్యాణ్ పై ఇంతకాలం రకరాకాల ఫ్లాట్ ఫారం లపై వ్యతిరేకంగా, ఆగ్రహంగా స్పందించిన ఆయన మాజీ భార్య రేణూదేశాయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ చాలా మంచోడు అంటోన్నారు. దీంతో ఈ వీడియోపై భిన్నమైన కామెంట్లు వినిపిస్తున్నాయి.
“నా మాజీ భర్తకు మద్దతుగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో చాలామందికి అర్థంకాకపోవచ్చు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఆయన నాకు అన్యాయం చేశారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అది నా వ్యక్తిగతం” అని చెప్పిన రేణు దేశాయ్.. అనంతరం పవన్ వ్యక్తిగతంగా మంచోడని తెలిపింది.
అవును… “ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు. సమాజానికి ఏదో చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన చాలా అరుదైన వ్యక్తి. ఆయన డబ్బు మనిషి కాదు. డబ్బుపై ఆయనకు ఆసక్తి లేదు. సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకుంటాడు” అని స్టేట్ మెంట్ ఇచ్చింది రేణూ దేశాయ్!
“ఆయన సక్సెస్ ఫుల్ హీరో. కావాలంటే సినిమాల్లో కొనసాగవచ్చు. కావాల్సినంత క్రేజ్, డబ్బు వస్తుంది. కానీ ఆయన రాజకీయాలు ఎంచుకున్నాడు. కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కనపెట్టాడు” అని అన్నారు.
అనంతరం… “ఆయన దగ్గర నేను లేకపోయినా, ఆయన్ను గమనిస్తూనే ఉన్నాను. ఆయన రాజకీయంగా నిజాయితీగా ఉన్నారు. చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ చెబుతున్నాను.. ఆయనకు ఓ అవకాశం ఇవ్వండి. నేను ఆయన మాజీ భార్యగా చెప్పడం లేదు.. సమాజానికి చెందిన ఓ పౌరురాలిగా చెబుతున్నాను” అని ముగించారు.
అయితే రేణూ దేశాయ్ ఉన్నట్లుండి ఇలా ప్లేట్ ఫిరాయించి.. పవన్ కు సపోర్ట్ చేయడి, ఆయన సమాజం కోసం ఫ్యామిలీని వదిలేశారు అని చెప్పడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకోసం పవన్ ఈ మేరకు రాయభారం పంపించి ఇలా చెప్పించి ఉంటారని.. ఆమె ఆత్మవంచన చేసుకుని చెప్పి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో… పవన్ ను బద్రీ సినిమా నుంచీ దగ్గరగా చూసిన వ్యక్తిగా… నిజంగానే వ్యాఖ్యానిస్తున్నారేమో అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. పిల్లల ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఇలా మద్దతు పలికి ఉంటారని అంటున్నారు.
ఇదే క్రమంలో… పవన్ వల్ల వ్యక్తిగతంగా తను చాలా నష్టపోయానని, 11 ఏళ్లు ఆ బాధను అనుభవించానని చెప్పిన రేణుదేశాయ్.. తను ఎలాగైతే అన్నీ మరిచిపోయి జీవితాన్ని కొనసాగిస్తున్నానో.. అలాగే మిగతావాళ్లు కూడా పవన్ 3 పెళ్లిళ్ల వ్యవహారాన్ని వదిలేయాలని కోరడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కావడం లేదంటున్నారు ఇంకొంతమంది.
కాగా… పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. ఈమెతో వైవాహిక జీవితంలో ఉంటూనే, రష్యాకు చెందిన మహిళతో పవన్ సంబంధం పెట్టుకున్నారు. ఆమె ద్వారా బిడ్డకు తండ్రి కూడా అయ్యారు. ఈ విషయాన్ని 2-3 సందర్భాల్లో రేణు దేశాయ్ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ విషయాలన్నీ మరిచిపోండి.. ఆయన మంచి వారు.. ఆయనకు ఛాన్స్ ఇవ్వండి అంటోంది పవన్ మాజీ భార్య!