కరోనాను ఎదుర్కోవడంలో విఫలం. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించడంలో చేతులు ఎత్తేయడం, వలస కార్మికుల సమస్యను పరిష్కరించడంలో విఫలం, ఉత్తర ప్రదేశ్ లో యోగి పాలనకు జీరో మార్కులు, రాష్టాల నీటి ప్రాజెక్టులకు నయాపైసా ఇవ్వకపోవడం, ఆర్ధికరంగంలో వైఫల్యం…ప్రభుత్వ సంస్థలను అమ్ముకోవడం…ఒకటి కాదు రెండు కాదు…మోడీ పాలన పూర్తిగా విఫలం అన్నారు….బీహార్ లో నితీష్ కుమార్ కు మూడింది అన్నారు.. ఉత్తర ప్రదేశ్ ఉపఎన్నికల్లో సీట్లు రావన్నారు….ఎనిమిదివేలకోట్ల రూపాయల వ్యయంతో మోడీ ప్రత్యేక విమానాన్ని కొనుక్కోవడాన్ని తప్పు పట్టారు. ఎనిమిది వందల కోట్ల వ్యయంతో పార్లమెంట్ భవనాన్ని నిర్మించడం దారుణం అన్నారు…ఏ రంగంలో చూసినా గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క ఘనకార్యమూ లేదు…మరి ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయేమిటి? ఒక్క బీహార్ మాత్రమే కాదు…ఉప ఎన్నికలు జరిగిన తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లో కూడా బీజేపీ ఊడ్చిపారేయ్యడానికి కారణాలు ఏమిటి? ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వాస్తవం కాలేదు? చాలా ఆశ్చర్యంగా ఉన్నది కదూ!
నిన్నటి ఫలితాలు చూసిన తరువాత ఈ దేశప్రజల దృష్టిలో నూరేళ్లు దాటిన కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని స్పష్టం అయింది.. సజీవంగా తొణికిసలాడుతున్న పార్టీ బీజేపీ మాత్రమే అని తేలిపోయింది. . ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు పోదు అన్నట్లు ఎంత తోమినా రాహుల్ గాంధీ మోడీకి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాలేకపోతున్నారు. రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు శూన్యం. రాహుల్ గాంధీని అనుకుని ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లక్షణాలు కలిగిన చివరి నాయకురాలు ఇందిరాగాంధీ మాత్రమే. 1977 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినప్పటికీ పార్టీని చీల్చి కొత్త పార్టీని పెట్టుకుని మూడేళ్లు తిరగకుండానే కేంద్రంలో విజయఢంకా మోగించారు. చిన్న కొడుకు సంజయ్ గాంధీ మరణంతో తనకు తోడు కావాలని రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని రాజీవ్ గాంధీని ఈదేశం మీద రుద్దారు ఇందిరాగాంధీ. అనూహ్యంగా ఆమె హత్య గావించబడటంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఆమె హత్య తాలూకు సానుభూతి కురవడంతో 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. కానీ, ఆ తరువాత 1989 రాజీవ్ గాంధీ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. 1991 లో జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. దాంతో రాజీవ్ గాంధీ నాయకత్వ ప్రతిభ ఏమిటో ఈ లోకానికి వెల్లడి కాలేదు.
ఆ తరువాత కాంగ్రెస్ నాయకత్వ బాధ్యత స్వీకరించడానికి సోనియా గాంధీ భయపడ్డారు. ఆమె నిరాసక్తత ఫలితంగా పీవీ నరసింహారావు, సీతారాం కేసరి తదుపరి అధ్యక్షులు అయ్యారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దిగజారడంతో సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూటమి రెండు సార్లు అధికారాన్ని చేపట్టగలిగింది. ఈలోపల రాహుల్ గాంధీ ఎదిగి పార్లమెంట్ సభ్యుడు కూడా అయ్యారు. అయినప్పటికీ ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యత చేపట్టడానికి వణికిపోతున్నారు అంటే ఆ పార్టీ దౌర్భాగ్యం కాదా? తనకన్నా వయసులో మూడేళ్లు చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణంతో రాజకీయరంగంలో దూకి సోనియాగాంధీనే ఎదిరించి సొంత పార్టీ పెట్టుకుని సింహంలా పోరాడి ఎనిమిదేళ్లు తిరగకుండానే ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. తనకన్నా ఇరవై ఏళ్ళు చిన్నవాడైన తేజస్వి యాదవ్ తన తండ్రి జైల్లో ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా పార్టీకి నాయకత్వం వహించి నిన్నటి ఎన్నికల్లో విజయం అంచులదాకా తీసుకొచ్చాడు! వెంట్రుకవాసిలో ఆయనకు ముఖ్యమంత్రి యోగం తప్పింది కానీ, లేకపోతె ఈపాటికి ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా పిలువబడేవాడు. తనకన్నా చిన్నవాడైన జ్యోతిరాదిత్య సింధియా తన పార్టీని ఛీకొట్టి బీజేపీలో చేరిపోయి నిన్నటి ఉపఎన్నికల్లో తనవారిని గెలిపించుకుని గర్వించదగిన నాయకత్వ లక్షణాలు చూపించాడు. రాహుల్ గాంధీకున్నంత సానుకూలతలు వీరిలో ఎవ్వరికీ లేవు. అందరూ పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడి విజయం సాధించిన విక్రమార్కులే! రాహుల్ గాంధీ మాత్రం తన అవివేకంతో, అహంకారంతో, అభిజాత్యంతో, అసమర్ధతతో కాంగ్రెస్ పార్టీకి ఒక గుదిబండలా తయారయ్యాడు! చేవచచ్చిన మోడులా తయారయ్యాడు!!
బీజేపీ తప్పులు చెయ్యని, ఒప్పులు చెయ్యని….రాహుల్ గాంధీ, సోనియాగాంధీ చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు బీజేపీకి కేంద్రంలో తిరుగులేదు. శవం లాంటి కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు… ఆత్మగౌరవం, నాయకత్వ ప్రతిభ కలిగినవారికి బీజేపీయే శరణ్యం. కాంగ్రెస్ పార్టీలో ఆత్మగౌరవానికి స్థానం లేదు. అదొక పెద్ద సైజు ప్రాంతీయపార్టీ స్థాయికి కుదించుకుని పోయింది. ఎవరైనా ఒక శక్తివంతుడు, మానధనుడు, నాయకత్వ లక్షణాలు, పోరాటగుణం కలిగినట్టి, సోమరితనం లేనట్టి గాంధీయేతర కుటుంబంలోని యువకుల చేతిలోకి పార్టీ పగ్గాలు వెళ్లనంతవరకు ఆ పార్టీ పుంజుకుంటుందని ఆశలు లేవు. మాకు పార్టీ కన్నా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ముఖ్యం అనుకునే బానిసభావాలు కల్గిన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ చిగురించడం అసంభవం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు