అన్నవరం టూ భీమవరం వారాహి యాత్ర నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్ ఎప్పుడనేది మిగిలిన షెడ్యూల్స్ ని బట్టి ఉండొచ్చని సమాచారం. ఈ సమయంలో వారాహి తొలివిడత ముగింపు సభ భీమవరంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో మైకందుకున్న పవన్… ప్రభాస్ ఫ్యాన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ పై ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
2015లో భీమవరం లో పవన్ కళ్యాణ్ పోస్టర్ ని చింపినందుకు గాను ప్రభాస్ ఫ్యాన్స్ పై పవన్ ఫ్యాన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి గొడవలు చేసారు. అప్పట్లో ఇరువురి హీరోల మధ్య జరిగిన ఈ గొడవ ని అదుపు చెయ్యడానికి భీమవరం టౌన్ లో 144 సెక్షన్ ని విధించారు. ఈ గొడవలో భాగంగా ప్రభాస్ ఫ్యాన్స్ కొందరిపై పవన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో దాడులకు తెగబడ్డారని వార్తలొచ్చాయి.
ఈ సమయంలో ఆ విషయాన్ని భీమవరంలో ప్రస్థావించిన పవన్… “గతంలో ఇదే భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి – నా ఫ్యాన్స్ చిన్న పోస్టర్ విషయం లో పెద్ద గొడవ జరిగింది. ఈ సంఘటన నా మనసుని ఎంతో బాధించింది. అంత చిన్న విషయానికి అంత పెద్ద గొడవలు చెయ్యాల్సిన అవసరం లేదు, దయచేసి ఇలాంటి గొడవలకు దిగకండి అని మిమల్ని వేడుకుంటున్నాను” అని అన్నారు!
పైగా ఈ సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కావాలని తన పోస్టర్స్ చింపినా కూడా క్షమించేయాలని జనసేన అధినేత తన ఫ్యాన్స్ కు కార్యకర్తలకు సూచించారు. ఈ మాటల్లో వ్యగ్యమే కనిపిస్తుంది తప్ప… ఐకమత్యపు తాలూకు వివరణ రావడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు! ఎవరికి ఉండేది వారికి ఉంటుందని కామెంట్లు పెడుతుండటం గమనార్హం.
దీంతో… 2015లో జరిగితే ఇప్పుడు మనసుకు బాధ అనిపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ప్రభాస్ అభిమానులు! నాడు ఏమైపోయారంటూ ఆన్ లైన్ వేదికగా అడుగుతున్నారు! ఇదే సమయంలో నాడు టీడీపీ ప్రభుత్వంలో వన్ సైడ్ గా వ్యవహరించి బాధితులనే ఇబ్బంది పెట్టారని కామెంట్ చేస్తున్నారని తెలుస్తుంది! భీమవరంలో గతంలో పవన్ ఓడిపోవడానికి ప్రభాస్ అభిమానులు, ప్రభాస్ సామాజికవర్గానికి చెందిన ప్రజలు కారణం అని అప్పట్లో జనసైనికులు బలంగా నమ్మినట్లు కథనాలొచ్చాయి.
దీంతో ఆ అక్కసు వెళ్లగక్కేందుకు… నాడు ప్రభాస్ ఫ్యాన్స్ పై గొడవలకు దిగి గాయపరిచారని అప్పట్లో వార్తలొచ్చాయి! అయితే మరోసారి పవన్ భీమవరంలో పోటీ చేస్తారని కథాన్లొస్తున్న వేళ… మరోసారి పవన్ ని ఇక్కడ ఓడించాలని ప్రభాస్ అభిమానులు, ఆయన సామాజికవర్గ ప్రజలు బలంగా ఫిక్సయ్యారని సోషల్ మీడియా కథనం! దీంతో మరోసారి దెబ్బతినకుండా ముందు జాగ్రత్త చర్యలకు దిగిన పవన్… ఈ మేరకు ఆ దాడి సంఘటన తనకు చాలా బాదేసిందని.. 8 ఏళ్ల తర్వాత చెబుతున్నారని.. ఇది అవకాశవాద సానుభూతే తప్ప మరొకటి కాదని తాము గ్రహించామని అంటున్నారు!
మరి రాబోయే ఎన్నికల్లో ప్రభాస్ ఫ్యాన్స్… జనసేన విషయంలో ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
ఏది ఏమైనా… హీరోల అభిమానులు నిత్యం సంయమనం పాటించాలని, అభిమానాలను సినిమాల వరకే పరిమితం చేసుకోవాలని, ఫ్యాన్స్ మద్య గొడవల వల్ల హీరోలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనే విషయం గ్రహించాలని పలువురు సూచిస్తున్నారు!