జగన్‌ను ఆపే దమ్ము టీడీపీకి ఉందా..లేదా ?

జగన్‌ను ఆపే దమ్ము టీడీపీకి ఉందా..లేదా ?
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆమరావతిని కాదని మూడు రాజధానుల ఆలోచనతో ముందుకొచ్చారు.  ఈ ఆలోచనను ఒక్క అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి.  అడ్డుకుని తీరుతామని సవాళ్లు చేస్తున్నాయి.  మరోవైపు భూములిచ్చిన రైతులు 200 రోజులకి పైగా దీక్షలు చేస్తున్నారు.  అయినా సీఎం వైఖరి మారలేదు.  అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు సన్నద్దమవుతున్నారు.  మండలిలో బిల్ పాస్ కాకపోవడంతో డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద పరిగణించి ఆమోదం తెలపాలని గవర్నర్ వద్దకు పంపారు.  గవర్నర్ గనుక ఆ బిల్లును ఆమోదిస్తే ఇక మూడు రాజధానులు అనేది అధికారికం అయిపోతుంది.  అప్పుడిక ప్రతిపక్షం రోడ్డెక్కి నిరసనలు చేయాల్సిందే తప్ప చేసేదేమీ ఉండదు.  
 
అందుకే గవర్నర్ బిల్లును ఆమోదించకుండా చేయాలని తెలుగుదేశం భావిస్తోంది.  అందుకుగాను మూడు రాజధానుల బిల్లును ఆమోదించకూడదని తన వాదనను వినిపిస్తోంది.  టీడీపీ నేతల వాదనలో రాజధానుల బిల్లును మండలి ఆమోదించలేదు కాబట్టి పాస్ చేయడానికి వీల్లేదనేది మొదటిది.  కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి ఆమోదించకూడదు అనేది రెండోది.  ఇక మూడు రాజధానులు అంటే విభజన చట్టంలో సవరణలు చేయాలి.  అది కేంద్రం పరిధిలోని అంశం అనేది మూడవది.  ఈ మూడు కారణాలు రాజకీయంగా సబబుగానే అనిపిస్తాయి కానీ రాజ్యాంగబద్దంగా పని చేయవు.  బిల్లు పాస్ కాకుండా ఆపలేవు.  ఎందుకంటే గవర్నర్ గారికి రాజకీయాభిప్రాయాలు, ప్రయోజనాలు అనవసరం.  ఆయన రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తారు కాబట్టి. 
 
ఇక టీడీపీ ఎత్తి చూపుతున్న కారణాలని ఒక్కసారి పరిశీలిద్దాం.  మండలి ఆమోదం లేదు కాబట్టి బిల్ పాస్ కాకూడదని టీడీపీ అంటోంది.  అసలు రాజ్యాంగం ప్రకారం శాసన మండలికి ఉండే అధికారాలు చాలా పరిమితం.  అవి కూడా శాసన సభ నిర్ణయాలను, బిల్లులను అడ్డుకోవడానికి అస్సలు కాదు.  ఏదైనా బిల్లును శాసన సభ ఆమోదించి మండలికి పంపితే మూడు నెలల లోపు దాన్ని అంగీకరించడమో, తిరస్కరించడమో, సవరణలు సూచించడమో చేయాలి.  లేని పక్షంలో మళ్లీ ఆ బిల్లు శాసన సభ ముందుకు వెళుతుంది.  అప్పుడు కూడా సభ ఆమోదం తెలిపి మండలి ముందుకు పంపితే నిర్ణయం ఏమిటో నెలలోపు చెప్పాలి.  లేకపోతే డీమ్డ్ టూ బీ పాస్డ్ అని ఆమోదం పొందుతుంది.  కాబట్టి ఇక్కడ మండలి ద్వారా అడ్డుకోవడం అనేది సాధ్యం కాదు. 
 
అలాగే రాజధానుల విషయమై కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి ఆమోదం కోసం గవర్నర్ వద్దకు వెళ్లకూడదనే వాదన కూడా సరికాదు.  ఎందుకంటే కోర్టులో శాసనాలు చేయకుండా శాసన సభను అడ్డుకోదు.  ప్రభుత్వం ఎందుకు నిర్ణయమైనా తీసుకుని దాన్ని చట్టం చేయాలి అనుకున్నప్పుడు కోర్టులు ఆ ప్రక్రియకు అడ్డు తగలవు.  అలా చేస్తే అది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం అవుతుంది.  ఇకవేళ ప్రభుత్వం చేసిన శాసనం రాజ్యాంగ విరుద్దంగా ఉంటే అప్పుడు కోర్టులు కలుగజేసుకుని అభ్యంతరం చెప్పవచ్చు.  ఇందుకు బెస్ట్ ఉదాహరణ పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం.  వైకాపా సర్కార్ ఏయే రంగులు వేయాలో బిల్ పెట్టి ఆమోదం తెలుపుకుని దాన్నే చట్టం చేసుకునే ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోలేదు.  తీరా రంగులు వేశాక అది రాజ్యాంగ విరుద్దమని మందలించి రంగులు తీయించింది.  రాజధానుల విషయంలో కూడా అంతే.  చట్టం చేయకుండా శాసన వ్యవస్థను కోర్టులు అడ్డుకోవు.  
 
చివరగా విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని, రాజధానులు అని ఎక్కడా లేదని టీడీపీ నేతలు అంటున్నారు.  అంతేకాదు విభజన చట్టం మేరకు కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సిఫార్సు మేరకే రాజధాని ఉండాలని, గతంలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకే అమరావతిని రాజధానిగా చేశామని, ఇప్పుడు మూడా కమిటీ ఉండాలని, ఇందులో కేంద్రం జోక్యం తప్పనిసరి అని వాదిస్తున్నారు.  అసలు రాష్ట్ర రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం.  రాజధాని ఏర్పాటు అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇష్టం.  అందులో కేంద్రం జోక్యం ఉండాల్సిన పని లేదు.  అలాగే కమిటీ సూచించే రాజధానినే ప్రభుత్వం ఆమోదించాలని కూడా రాజ్యాంగంలో లేదు.  కమిటీ అనేది కేవలం సూచనలు, సలహాలు, నివేదికలు ఇవ్వడానికే తప్ప ప్రభుత్వాన్ని శాసించడానికి కాదు.  
 
సో.. గవర్నర్ వద్దకు వెళ్లిన మూడు రాజధానుల బిల్లును ఆపడానికి టీడీపీ అస్త్రాలుగా వాడాలనుకున్న మూడు కారణాలు కూడా రాజకీయ వాదనకు పనికొస్తాయే తప్ప రాజ్యాంగ పరమైన వాదనకు పనికిరావు.  కాబట్టి ఆ కారణాలతో రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేసే గవర్నర్ గారిని టీడీపీ ప్రభావితం చేయలేదు.  ఒక్కమాటలో చెప్పాలంటే మూడు రాజధానుల విషయంలో గవర్నర్ ముందు జగన్‌ను ఆపే దమ్ము తెలుగుదేశం వాదనలో లేదనే అనాలి.