చంద్రబాబు మేనిఫెస్టోతో జనసేనకేంటి సంబంధం.?

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి కదా.? జనసేన పార్టీతో సంప్రదింపులు జరపకుండా, తెలుగుదేశం పార్టీ ఎలా సొంత మేనిఫెస్టో ప్రకటించేస్తుంది.? ‘మేం కలిసే పోటీ చేస్తాం.. పొత్తు పెట్టుకునే ముందర అన్ని విషయాల్నీ ప్రజల ముందర చర్చకు పెడతాం..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు, ఉమ్మడి ఎజెండా ప్రకారం మేనిఫెస్టో వుండాలి.

అయినాగానీ, టీడీపీ మాత్రం తనంతట తానుగా పాక్షిక మేనిఫెస్టో ప్రకటించేసింది. నిజానికి, వైసీపీకి చెక్ పెట్టడం టీడీపీ ఉద్దేశ్యం కాదిక్కడ. మిత్రపక్షం కావాల్సిన జనసేన పార్టీకి టీడీపీ తన పాక్షిక మేనిఫెస్టోతో షాక్ ఇచ్చింది.

‘మేమే అధికారంలోకి వస్తాం.. అవసరమైతే మీ సాయం తీసుకుంటాం.. మా మేనిఫెస్టో మాదే.. మీక్కావాల్సినన్ని సీట్లు పడేస్తాం.. అదీ పది పాతిక వరకు మాత్రమే..’ అన్న సంకేతాల్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనకు పంపినట్లయ్యింది.

ఔను, ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోతో జనసేనకు సంబంధం లేదు. అలాంటప్పుడు, టీడీపీ – జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశమే లేదు. కాకపోతే, అవగాహన కింద.. కొన్ని స్థానాల్లో టీడీపీ, బలహీన అభ్యర్థుల్ని పెట్టొచ్చు.

ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే, సొంతంగానే సత్తా చాటుతామన్న ‘అతి నమ్మకం’ టీడీపీలో బలపడింది. నిజానికి, ఈ విషయంలో వైసీపీ సంతోషపడాలి. జనసేన కూడా సంబరపడాలి.

కానీ, కొందరు జనసైనికులేమో ‘మాతో చర్చించకుండా మీరెలా మేనిఫెస్టో విడుదల చేస్తారు.?’ అని ప్రశ్నిస్తున్నారు. ప్చ్.. వారి దయనీయ స్థితి.!