అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందని చంద్రబాబు మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న సంఘటన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు సరిగా సమావేశాలకు హాజరు కావడంలేని సంగతి తెలిసిందే. దీంతో… ఏపీ అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అయితే ఆ లోటును భర్తీ చేస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ నిర్ణయించింది.
ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ బుధవారం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చినబాబు… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జూం ద్వారా సమావేశమయ్యారు. చాలా సేపటి డిస్కషన్ అనంతరం… అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించారు.
దీంతో… తాజా అసెంబ్లీ సమావేశాలు ఉన్నంతలో రసవత్తరంగానే జరిగే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే… అధికారపక్షం నేతల దాటికి విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యి వెళ్లిపోయేలా పథకాలు రచిస్తారా.. లేక, పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపాల్సి ఉండటంతో చర్చలో పాల్గొంటారా అనేది వేచి చూడాలి.
మరోపక్క ఇప్పటికే కేబినెట్ భేటీ అయి అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసింది. పలు బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ సమయంలో… చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా అసలు టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా రారా అనే అనుమానం అందరిలో ఉన్న నేపథ్యంలో… ఆ అనుమానాలు తొలగిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి హాజరు కావాలంటూ ఆ పార్టీ శాసన సభాపక్షం నిర్ణయించింది.
ఈ సందర్భంగా జూం మీటింగులో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడిన నారా లోకేష్.. పోరాటమే అజెండాగా పెట్టుకున్నప్పుడు ప్రజల కోసం ఎన్ని అవమానాలైన భరిద్దామని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ తో పాటు వివిధ ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు చట్టసభల వేదికగా ఉన్న అవకాశాన్ని వదులుకోకూడదని.. అందుకే సమావేశాలకు హాజరుకావాలని సూచించారు.