ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకుని ఇటీవల కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి. ఆ జాబితాలోని ‘మై డియర్ దొంగ’ విడుదలైంది. అభినవ్ గోమఠం , షాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ డేటింగ్ యాప్‌నకు కాపీ రైటర్‌గా పనిచేసే సుజాత (షాలిని), డాక్టర్ విశాల్ (నిఖిల్ గాజుల) ప్రేమికులు. తొలుత బాగానే ఉన్నా కొంతకాలం తర్వాత విశాల్‌లో మార్పు వచ్చిందని సుజాత భావిస్తుంది. డ్యాన్స్ క్లాస్, యోగా శిక్షణ.. ఇలా ఎక్కడికి పిలిచినా బిజీ అని చెబుతున్నాడంటూ ఫీలైపోతుంటుంది. ఈ క్రమంలోనే సురేశ్ (అభినవ్ గోమఠం) ఆమె ప్లాట్‌లో చోరీ చేసేందుకు వెళ్తాడు. అదే సమయానికి షాలిని బర్త్‌డే సెల్రబేషన్ చేసేందుకు స్నేహితులు బుజ్జి (దివ్య శ్రీపాద), వరుణ్ (శశాంక్ మండూరి), విశాల్ ఆమె ఇంటి వస్తారు. అప్పటికే సురేశ్‌తో కాసేపు మాట్లాడిన సుజాత.. అతడిని తన చిన్ననాటి స్నేహితుడిగా వారికి పరిచయం చేస్తుంది.
సురేశ్.. సుజాత ఇంట్లో ఏ వస్తువు చోరీ చేశాడు? అసలు.. దొంగ అని తెలిసినా సుజాత.. సురేశ్‌తో ఎందుకు పరిచయం పెంచుకుంది? వారి కుటుంబ నేపథ్యాలేంటి? విశాల్ పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి కారణమేంటి? అనేది సినిమా కథ. ఓ హీరోయిన్.. ఇద్దరు హీరోలు.. ప్రేమ.. చివరికి ఎవరో ఒకరు ఫీలవడం.. ఈ టెంప్లేట్ ఎన్నో సినిమాల్లో చూసిందే. ఇది ఆ ఫార్మాట్లో సాగే స్టోరీనే. కానీ, కామెడీ ప్రధానంగా తీర్చిదిద్దడంతో ప్రత్యేకంగా నిలిచింది. ఒకట్రెండు సన్నివేశాలు మినహా సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. లగ్జరీ అవసరం లేదు.. చిన్న చిన్న ఆనందాలే జీవితం అనుకునే యువతి సుజాత కథ ఇది. ఆమె ప్రేమ కథలను నేరుగా చెప్పకుండా.. ఓ హోటల్లో వెయిటర్‌కు సుజాత తన బ్యాక్ స్టోరీలను తానే వివరించడం ఆసక్తి కలిగిస్తుంది.
ఈ సినిమా కథను తానే స్వయంగా రాయడం విశేషం. ఆమె చేసే ఉద్యోగ ప్రస్తావన, స్నేహితులు, ప్రేమికుడు విశాల్ పరిచయ సన్నివేశాలు నెమ్మదిగా సాగినా.. సుజాత ప్లాట్‌లోకి సురేశ్ ప్రవేశించడం నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అభినవ్ తనదైన మార్క్ హావభావాలతో అలరించారు. తమ కుటుంబాల గురించి సుజాత, సురేశ్ ఒకరికొకరు వివరించే తీరు కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషనల్ సీన్స్‌ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. సుజాత పుట్టిన రోజు ఇతివృత్తంగా రాసిన సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి.
సర్ప్రైజ్ చేసేందుకు ఇంటికొచ్చిన బుజ్జి, వరుణ్, విశాల్‌లకు సుజాత.. సురేశ్‌ను తన ఫ్రెండ్‌గా పరిచయం చేయడం, మెకానికల్ ఇంజినీర్‌గా సురేశ్ వారిని నమ్మించేందుకు ప్రయత్నించడం చూస్తే నవ్వాగదు . సురేశ్ గురించి అసలు విషయం తెలుసుకున్న విశాల్ ఏం చేశాడనేది సెకండాఫ్‌లో ప్రధానాంశం. సురేశ్‌ను ఇరికించాలని ప్రయత్నించి తాను పోలీసుకు చిక్కడం, అందుకు సుజాతసరెండర్ అవ్వడం.. ఇలా ప్రతి ఎపిసోడ్‌ను ప్రేక్షకుడిని నవ్వించాలనే లక్ష్యంతోనే రూపొందించారు. ప్రీ క్లైమాక్స్ సీన్స్‌ను ఎమోషనల్‌గా రూపొందించినా ఫైనల్ కైమాక్స్ను కామెడీ ట్రాక్‌లోనే పెట్టారు.