టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చే క్రైమ్..ఇన్వెస్టిగేటివ్ కథలకు మంచి స్పందన ఉంటుంది. అలాంటి కథలకు ఆడియెన్స్ బాగా ఎట్రాక్ట్ అవడమేగాక.. సినిమాను ఆదరించి బాక్సాఫీస్ వద్ద కాసులపంట పండిస్తుంటారు. సరైన కథ.. అందుకు తగ్గ స్క్రీన్ ప్లే తో క్రైం రేట్ ను తెరపై ఆవిష్కరి స్తే… బాక్సాఫీస్ వద్ద బొమ్మ హిట్టే. సరిగ్గా ఇలాంటి కథ ఒకటి ప్రేక్షకుల మనసులను దోచుకోవడానికి వచ్చింది. ఆ కథే ‘ముఖ్యగమనిక’. టైటిలోనే ఎంతో క్యాచీనెస్ కనిపిస్తుంది. దర్శకుడు వేణు మురళీధర్. వి. ‘ముఖ్య గమనిక’ అనే ఈ కథను ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కజిన్ … అంటే అల్లు అర్జున్ కి మేనమామ కొడుకు అయినటువంటి విరాన్ ముత్తంశెట్టి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ సినిమాని శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి బజ్ తో విడుదలయింది. మరి ఈ క్రైం థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో తెలుసుకుందాం…
కథ: ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు విరాన్ (విరాన్ ముత్తంశెట్టి). అతని తండ్రి ఊహించని విధంగా హత్యకు గురవుతాడు. ఫలితంగా తండ్రి ఉద్యోగం విరాన్ కి వస్తుంది. అయితే విరాన్ తండ్రి మాత్రమే కాదు.. ఇంకా చాలా మంది పోలీసులు ఊహించని విధంగా హత్యలకి గురవుతూ ఉంటారు. అయితే… దీని వెనుక ఉన్న మిస్టరీని ఎలాగైనా చేధించాలని విరాన్ డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి తన తండ్రి చనిపోయిన రోజునే మిస్ అయిన ఓ ఆర్.జె.కేసు ఎదురవుతుంది. అతను ఎలా మిస్ అయ్యాడు? దాని వెనుక అతని భార్య హస్తం ఉందా? అసలు ఆర్.జె మిస్సింగ్ కేసుకి విరాన్ తండ్రి హత్యకి గల సంబంధం ఏంటి? ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి హంతకుడిని పట్టుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: ‘ముఖ్యగమనిక’ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు వేణు మురళీధర్. వి. నూటికి నూరుపాళ్లు విజయం సాధించారని చెప్పొచ్చు. తన టేకింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు. దర్శకుడు కత్తిమీది సాములాంటి కథను ఎంచుకున్నప్పుడే సినిమాపై అతడికున్న ఆలోచన ప్రస్ఫుటమవుతోంది. ఒక థ్రిల్ కలిగించే క్రైమ్ కథను తెరపై ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దాలంటే మాటలు కాదు.. చేతలు కావాలి. అలాంటి చేతలు దర్శకుడు వేణు మురళీధర్. వి. లో మెండుగానే ఉన్నాయని సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఇట్టే ఒప్పేసుకుంటారు. ఆసక్తికరంగా.. వైవిధ్యంగా సాగిపోయే కథనంలో అక్కడక్కడా వచ్చే కొన్ని థ్రిల్ కలిగించే సన్నివేశాలకు ప్రేక్షలనుంచి మంచి స్పందన కనిపించింది. అంతే కాదు.. దర్శకుడికి సినిమాపై ఉన్న మక్కువని ప్రేక్షకులు గుర్తించేలా చేసింది. ఒక క్రైమ్.. థ్రిల్ కథని రూపొందించడంలో దర్శకుడు వేణు మురళీధర్ తీసుకున్న శ్రద్ధ ప్రతీ ఫ్రేమ్ లోనూ మనం చూడొచ్చు. ఒక క్రైం థ్రిల్లర్ కు ఎలాంటి ఎలిమెంట్స్ వుండాలో అన్నీ ఈ సినిమాలో చూడొచ్చు. దర్శకుడు వేణు మురళీధర్.వి తీసుకున్న కథ…. కథనం చాలా కాంటెంపరరీగా వుండటంతో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వరు. దర్శకుడు మెప్పించే క్రైం థ్రిల్లర్ తీసి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. రెండు విభిన్న క్రైం ఎలిమెంట్స్ ను… ఒకే స్టోరీలో చెప్పి… ఆద్యంతం ప్రేక్షకులని మెప్పించారు.
ఎవరెలా చేశారంటే.. కథానాయకుడు విరాన్ చక్కటి కథను ఎంచుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. అతడు ఎంచుకున్న ఈ కథని చూస్తే సినిమాలపై అతడికున్న కసి.. టేస్ట్ ఇట్టే అర్థమవుతుంది. నటుడిగా మంచి కెరీర్ ని సాధించాలంటే మరింతగా కృషి చేయాలి. ఆదిశగా అతడిని అతడు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది క్రైం థ్రిల్లర్ సినిమా కావడంతో .. ఇన్వెస్టిగేషన్ కోణంలో ఫరవాలేదనిపించే నటనను ప్రదర్శించాడు. హీరోయిన్ లావణ్య సాహుకారకి తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఆర్.జె.రోల్ చేసిన నటుడు , అతని భార్యగా చేసిన ఆర్యన్ ఇప్పిల్లి తమతమ పాత్రలకున్న పరిధిమేరకు బాగా నటించారు. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వీరిద్దరికీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది. బాగా ఉపయోగించుకున్నారు. ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.
టెక్నీకల్ విషయాలకొస్తే… సాంకేతిక నిపుణుల పనితీరు భేషుగ్గానే ఉంది. సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ ఎంతో రిచ్ గా వుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ ఫరాలేదు. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ సినిమాని శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మించారు. వారి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. సినిమా స్థాయిని పెంచేట్టుగా నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా క్వాలిటీగా నిర్మించారు. థ్రిల్ కలిగించే క్రైమ్ కథను నిర్మించే సాహసం చేసి.. మంచి ఫలితాన్ని ఇచ్చిన . రాజశేఖర్, సాయి కృష్ణలను అభినందించాల్సిందే.
రేటింగ్: 3