కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు నిన్నంతా హడావుడి చేశాయి. కేసీఆర్ కొత్త పార్టీ పేరును ‘నయా భారత్‘ అని నిర్ణయించినట్టు, త్వరలోనే ఎలక్షన్ కమీషన్ వద్ద రిజిష్టర్ చేయించనున్నట్టు బలమైన వార్తలు వినబఢ్ఢాయి. గతంలో కేసీఆర్ అనేక సార్లు థర్డ్ ఫ్రంట్ ప్రస్తావన తేవడం, మూడవ ప్రత్యామ్నాయం అవసరమని మాట్లాడటం, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ ఇతర రాష్ట్రాల నేతలను కలిసి ఫ్రంట్ ప్రయత్నాలు చేయడంతో నిన్నటి వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. కానీ కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం ఖాయమని కానీ ఇప్పుడప్పుడే ఆ ఆలోచన లేదని, ఈ వార్తలపై స్పందించవద్దని పార్టీ నేతలకు చెప్పారట. దీంతో నయా భారత్ పార్టీ ఒక కథేనని అంతా అనుకున్నారు. కానీ కొందరు తెరాస నేతలే జాతీయ పార్టీ గురించి లీకులిచ్చి ఇప్పుడు కాదంటున్నారని, కేసీఆర్ జమిలి ఎన్నికలు వస్తే తప్పకుండా పార్టీ పెడతారని అంటుంటే ఇంకొందరు మాత్రం అసలు కేసీఆర్ చేత థర్డ్ ఫ్రంట్ పెట్టించేదే మోదీ అని బాంబు పెల్చారు.
అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే బీజేపీ :
భారతీయ జనతా పార్టీ దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికలు తేవాలనే ఆలోచనలో ఉంది. దీనికోసం కసరత్తులు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉండదు. కేవలం జాతీయ స్థాయి పార్టీలే పాల్గొనగలవు. ప్రాంతీయ పార్టీలు శాసన సభలకే పరిమితమవుతాయి. అంటే ఇకపై కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపట్టిన పార్టీకి ప్రాంతీయ పార్టీలతో పనుండదు. మెజారిటీ కోసం వారు ఎవరినీ బ్రతిమాలనక్కర్లేదు. అక్కడ ఉండబోయేది అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే. ఏం జరిగినా ఆ రెంటి మధ్యనే జరగాలి. ఎలాగూ గెలిచిన పార్టీకి మెజారిటీ ఉంటుంది కాబట్టి ఏ బిల్లు విషయంలోనూ మద్దతు కోసం ప్రాంతీయ పార్టీల అండను కోరనవసరం ఉండదు.
ఈ పరిణామం ఫలితం ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ఈ కాలంలోనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో ఆటాడుకుంటోంది. రాష్ట్రాల డిమాండ్లను అస్సలు పట్టించుకోవట్లేదు. ఏదో విపత్కర సమయాల్లో, కీలక బిల్లులకు ఆమోదం కావాల్సి వచ్చినప్పుడే కొంచెం దిగొచ్చి మాట వింటోంది. ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడూ అయినా రాష్ట్రాల కోరికలను మన్నిస్తోంది. ఇకపై పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలే లేకపోతే, వాటి అవసరమే కేంద్ర ప్రభుత్వానికి రాకపోతే రాష్ట్రాల పరిస్థితి ఏంటి. రోజుకో కొత్త బిల్లు తెచ్చి ఒకరోజులో పాస్ చేయించుకుని ఆచరణలోకి తీసుకొచ్చేస్తుంది. వాళ్లను అడిగేవారు, ఆపేవారు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మోదీకి కావలసింది అదేనట. అందుకే అధ్యక్ష తరహా విధానం కోసం కసరత్తు చేస్తున్నారు.
మోదీ కోసమే కేసీఆర్ పార్టీ ?
వాస్తవంగా చూసుకుంటే గత ఎన్నికల్లో బీజేపీ దక్కించుకున్న ఓటు బ్యాంక్ శాతం 37.36 శాతం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ పొందింది 19.49 శాతం ఓట్లు. రెంటికీ తేడా 17 నుండి 18 శాతం. ఇక ప్రాంతీయ పార్టీలైన వైసీపీ 2.53, తృణమూల్ కాంగ్రెస్ 4.07, టీడీపీ 2.04, తెరాస 1.26, డీఎంకే 2.26, బీఎస్పీ 3.63 శాతం పొందాయి. బీజేపీ పొందిన 37.36 తీసేస్తే మిగిలిన 63 శాతం ఓట్లు బీజేపీకి వ్యతిరేక ఓట్ల కిందికే వస్తాయి. వాటిలో కాంగ్రెస్ వాటా 19.49 తీసేస్తే మిగిలిని 43 శాతం. ఇవన్నీ ప్రాంతీయ పార్టీల వాటా. వీటిని గనుక కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టగలిగితే.. అంటే ఎన్నికల ద్వారా కావొచ్చు లేదా కూటమి రాజకీయాల వలన కావొచ్చు. అప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి. ఇది జరగడం అంత సులభం కాకపోయినా అసాధ్యమైతే కాదు కదా. అందుకే మోదీ ఆ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ నుండి చీల్చాలని అనుకుంటున్నారట.
అందుకే తమకు, కాంగ్రెస్ పార్టీకి మధ్యలో థర్డ్ ఫ్రంట్ తీసుకొస్తున్నారని, దానికి కేసీఆర్ ను వాడుతున్నారన్నది వాదన. అంతేగా తమ మీద వ్యతిరేకత ఉన్నవారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఓడిపోవడం ఖాయం. అందుకే మూడవ పార్టీని తెరపైకి తెచ్చి తమ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ నుండి చీల్చితే మెజారిటీ తమకే ఉంటుందనేది మోదీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. ఈ వాదనలో కూడ నిజం లేకపోలేదు. ఈ వ్యతిరేక ఓటు బ్యాంకును చెదరగొట్టడానికి పెద్ద పార్టీలు ఎన్నికలకు ముందు కొత్త పార్టీలను బరిలోకి దింపడం కామన్. కాకపోతే మోదీ దాన్ని జాతీయ స్థాయిలో కేసీఆర్ ద్వారా చేయాలనుకుంటున్నారని రాజకీయ వర్గాలు, విశ్లేషకులు చెబుతున్నారు. మరి వీటిలో నిజం ఎంతుందో తెలియాలంటే రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో జరగబోయే మార్పులను గమనించాలి.