ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు రావడంతో ఇవి మరింత వేడెక్కాయి. పైగా పురందేశ్వరి ఏపీ బీజేపీకి చీఫ్ అవ్వడం, అనంతరం చంద్రబాబుని బీజేపీకి దగ్గర చేయాలని చూస్తున్నారనే విశ్లేషణలు తెరపైకి రావడంతో అధికారపార్టీ నేతలకు ఫుల్ గా పని దొరికినట్లవుతుంది.
దీంతో వైసీపీ నేతలు అటు చంద్రబాబు, పవన్ లతో పాటు తాజాగా పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ టూరిజం మంత్రి ఆర్కే రోజా మరింత ఫైరవుతున్నారు. సెటైర్లు వేస్తున్నట్లే వేసి గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఫైరయిన రోజా… బీజేపీకి కొత్త అర్ధం చెప్పారు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు మంత్రి రోజా. ముగ్గురినీ ఒకేగాటిన కట్టేస్తూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే తనను అరెస్టు చేస్తారంటూ సింపతీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. ఈ విషయాలపై పవన్ మౌనంగా ఉంటాడని ఎద్దేవా చేశారు.
ఇదే ఫ్లోలో… పురందేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు అయిన తర్వాత బీజేపీ అనేది.. “బాబు జనతా పార్టీ”లా మారిపోయిందని రోజా ఎద్దేవా చేశారు. అందువల్లే మరిది విషయంలో పురందేశ్వరి సైలెంట్ గా ఉన్నారని ఆమె విమర్శించారు. అదేవిధంగా… అమరావతిని అవినీతి రాజధానిగా మార్చేశారని, సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ దోపీడిగా మారిపోయిందని రోజా మండిపడ్డారు.
ఇదే సమయంలో ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కానీ చంద్రబాబుపై వస్తోన్న అవినీతి ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చేసరైకి పవన్ ఎక్కడ దాక్కున్నారని ఆమె నిలదీశారు.
కాగా… చంద్రబాబుకు ఐటీ నోటీసులు అందించిన అంశం ఈసాయంలో వైసీపీ నాయకులకు మంచి అవకాశంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నోటీసులపేరు చెప్పి వితౌట్ గ్యాప్ బాబు & కో లపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో రోజా అయితే వరుసగా ప్రెస్ మీట్ లు పెడుతూ చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలపై ఫైరవుతూనే ఉన్నారు.