కేసీఆర్ మ్యాజిక్ పనిచెయ్యడం లేదా?

నిన్నటి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత అందరికీ కలుగుతున్న సందేహం ఇదే.  మొన్న దుబ్బాక ఉపఎన్నికలో బాధ్యత మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకుని సర్వం తానై వ్యవహరించి ప్రచారం చేసిన హరీష్ రావు బీజేపీ చేతిలో ఓటమి చవి చూడటంతో హరీష్ రావు ప్రభావం తగ్గిపోయిందని అందరూ భావించారు.  హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనే పేరుంది.  పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయానా మేనల్లుడు.  అయినప్పటికీ హరీష్ రావుకు, కేసీఆర్ కు మధ్య చెడిందనే ఊహాగానాలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి.  అందుకనే తొలివిడత మంత్రివర్గంలో హరీష్ రావుకు స్తానం దక్కలేదు.  హరీష్ రావుకు కోపం వస్తుందనే ఉద్ద్యేశ్యంతోనే కేటీఆర్ ను కూడా అప్పట్లో పదవికి దూరంగా ఉంచారు.  ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా హరీష్ రావును మంత్రిగా చేయాల్సివచ్చింది.  అయినప్పటికీ హరీష్ రావు ఈనాటికీ కేసీఆర్ ను నమ్మడు అంటారు కొందరు తెరాస వారు సైతం.  
 
kcr magic not working in ghmc elections
kcr magic not working in ghmc elections
ఇక కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పార్టీలో నంబర్ రెండుగా ఉన్నారు.  పార్టీకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్.  అన్నీ బాగుంటే కొడుకును ముఖ్యమంత్రిగా చేసి తాను ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చెయ్యాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు.   కేటీఆర్ కూడా గత ఆరేళ్లుగా మంత్రి పదవిలో ఉంటూ రాష్ట్రంలో ఐటి రంగం, పరిశ్రమల విస్తరణకు తనవంతు కృషి చేస్తున్నారు.  ఆయనకూ తండ్రి లాగానే మంచి వాగ్ధాటి, భాషాప్రవీణ్యం ఉన్నాయి.  యువతలో మంచి ఆకర్షణ శక్తి ఉన్నది.  గత ఆరేళ్లలో అనేక ఎన్నికలకు ఆయన సారధ్యం వహించి పార్టీని విజయతీరాలకు చేర్చారు.  కేటీఆర్ రంగంలోకి దిగితే విజయం ఖాయం అనే పేరు వచ్చింది.  నిన్నటి గ్రేటర్ ఎన్నికలకు సమస్తం తానై వ్యవహరించారు కేటీఆర్.  ప్రచార సారధ్యం, వ్యూహాలు రచించడం, మజ్లీస్, బీజేపీలతో పోరాడటం అన్నీ కేటీఆర్ నిర్వహించారు.  అయినప్పటికీ  విజయం సాధించడంలో  కేటీఆర్ కు తీవ్రమైన దెబ్బ ఎదురైంది.   కేటీఆర్  ఇమేజ్ ను మసకబార్చిన ఎన్నికలుగా ఇవి వారి ప్రాభవాన్ని ప్రశ్నార్థకం చేశాయి.  ముఖ్యమంత్రి కొడుకు కావడంతో ఎవ్వరూ మాట్లాడలేకపోయారు.  
 
కేసీఆర్ కుమార్తె కవిత కూడా మంచి చరిష్మా కలిగినవారే.  ఆమె కూడా టీఆరెస్ కాంపెయినింగ్ స్టార్ గా ఫెమస్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కవిత కూడా ప్రచారాన్ని నిర్వహించారు.  అయినప్పటికీ ఆశించిన ఫలితాలు దక్కలేదు.  
 
మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యుల గ్లామర్ క్షీణదశ  వైపుగా పయనిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.  ప్రజల మనోభావాలు వేగంగా మారిపోతున్నాయి.  ఇంకా తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, ప్రాంతీయవాదం పేర్లు చెప్పి ఓట్లు సాధించడం భవిష్యత్తులో కష్టం అవుతుందేమో.  ఎందుకంటే తరాలు మారిపోతున్నాయి.  తెలంగాణ వచ్చినపుడు పదిహేనేళ్ళు ఉన్న యువతకు  తెలంగాణ ఉద్యమ చరిత్ర గూర్చి అవగాహన ఉండకపోవచ్చు.   ఇప్పుడు  వారంతా చదువులు పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉన్నారు.  భావోద్వేగాలు వారిమీద పని చెయ్యవు.  పైగా కుటుంబ పాలన మీద వారికి ఆసక్తి ఉండదు.   కాబట్టి 2023 లో మళ్ళీ అధికారం సాధించాలంటే తెరాస తన వ్యూహాలను మార్చుకోక తప్పదు.