ఏరోజైతే విశాఖ ఉక్కు కర్మాగారంలోని ప్రభుత్వ వాటాలను నూటికి నూరుశాతం అమ్మేస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించిందో, ఆ క్షణం నుంచే ఆంధ్రప్రదేశ్ లో ఆందోళన మొదలైంది. విశాఖ ఉక్కు కర్మాగారం విశుద్ధులు, నైతికవర్తనులైన నాయకుల నేతృత్వంలో సుదీర్ఘకాల పోరాటఫలితంగా సాధించుకున్న యాగఫలం. ముప్ఫయి రెండు మంది ఈ పోరాటంలో అసువులు వీడారు. నలభై ఏళ్ళనుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే తలమానికంగా ప్రభవిల్లిన ఈ కర్మాగారం గత అయిదేళ్లనుంచి నష్టాల్లో నడుస్తున్నదట. అనగా దాదాపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనుకోవాలి. మూడున్నర దశాబ్దాలపాటు లాభాల్లో నడిచిన కర్మాగారం మోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం నష్టాలబాట పట్టిందంటే కారణాలు ఊహించడం కష్టం కాదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్ వారికి అమ్మేసుకుని ఉపాధికల్పన బాధ్యతలనుంచి తప్పించుకోవడమే బీజేపీ పరమలక్ష్యం. అందులో భాగంగానే వారు ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలను రైతుబజార్లో పెట్టేశారు.
ఆంధ్రా పేరుతో విశాఖలో ఉన్న ఏకైక అతి పెద్ద కర్మాగారం…దాదాపు నలభై వేలమంది ఉద్యోగులను, వారి కుటుంబాలను పోషిస్తున్న మహా సంస్థ ఇది. ఈ సంస్థకు అనుబంధంగా మరెన్నో సంస్థలు వెలిశాయి. లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ఈ కర్మాగారం వల్లనే విశాఖను ఉక్కు నగరంగా అభివర్ణిస్తుంటారు. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఒక్కసారిగా ప్రయివేట్ యాజమాన్య పరం కాబోతున్నదంటే సహజంగా ఉద్యోగుల్లో మానసిక ఆందోళన కలగడం సహజం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలిస్తాం, ఆమరణదీక్షలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం అంటూ ఇప్పటికి కొందరు నాయకులు ఆర్భాటపు ప్రకటనలు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అది డ్రామాయేనని అందరికి తెలుసు. ఇంకా మున్ముందు ఎవరు ఇలాంటి రాజీనామాలు చేసినా అవన్నీ నాటకాలే అని నిశ్చయంగా భావించవచ్చు. ఎందుకంటే ఈనాటి నాయకులు తెన్నేటి విశ్వనాధం, పుచ్చలపల్లి సుందరయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి నాయకులు కారు. ఒక్కొక్కడు ఒక్కొక్క దోపిడీదారు, బ్యాంకులకు కన్నం వేసిన గజదొంగ, పదవులను స్వార్ధప్రయోజనాలకోసం వాడుకునే పరమనీచులు, ఇతర పార్టీలనుంచి ముడుపులు పుచ్చుకుంటూ ఉద్యమాలు అంటూ వీధినాటకాలు ప్రదర్శించే భటాచోరులు. ఈ నాయకులు ప్రజలకోసం పోరాడతారంటే పిచ్చికుక్క కూడా నమ్మదు.
రాజకీయాలసంగతి పక్కన పెడితే ఒక మహాసంస్థను ప్రయివేట్ పరం చెయ్యడం వలన లాభమా నష్టమా అనే అంశాన్ని పరిశీలిస్తే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తున్నారు. కొందరు విమర్శిస్తున్నారు. పాతికేళ్ళక్రితం అయితే ఇలాంటి వార్తలు మనలో భయాన్ని కలిగించేవి. కానీ గత ఇరవై ఏళ్లకాలంగా ఎన్నో ప్రభుత్వ సంస్థలు ప్రయివేట్ పరం అయ్యాయి. అటువంటి వార్తలకు మనం అలవాటు పడ్డాము. అందువల్లనే ఈ విషయంలో ఆశించినంత స్పందన అయితే కనిపించడం లేదు. ప్రయివేట్ పరం చేసినందువల్ల తమకు ఉద్యోగ భద్రత కరువవుతుందని, వేధింపులు ఎక్కువవుతాయి, కఠిన క్రమశిక్షణ పాటించాల్సి వస్తుంది, ఎక్కువ గంటలు పని చేయాల్సివస్తుంది అనే పేలవమైన వాదనలు ఉద్యోగులనుంచి వినిపిస్తున్నాయి తప్ప ప్రయివేటీకరణ వలన జాతికి నష్టం ఏమిటో వారు బలంగా చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం ఖనిజ గనులను ఎక్కువగా కేటాయించి ఆదుకోవాలని, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తున్న సంస్థను అమ్మేయవద్దని విమర్శకులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కర్మాగారాన్ని అమ్మేయకుండా లాభాలబాటలో నడవడానికి కొన్ని సూచనలు చేస్తూ కేంద్రానికి లేఖ వ్రాశారు.
ఇక సమర్ధించేవారి వాదనలను పరిశీలిస్తే ప్రయివేట్ యాజమాన్యానికి అప్పగించినంతమాత్రాన కర్మాగారం విశాఖనుంచి బయటకు వెళ్లిపోదని, ఎవ్వరి ఉద్యోగాలు కూడా పోవని అంటున్నారు. నష్టాలబాటలో ఏళ్లతరబడి పయనించి దివాళా తీసిన అనేక సంస్థలను ప్రయివేట్ పారిశ్రామికవేత్తలు కొనుగోలు చేసే లాభాల్లోకి మళ్లించారని అనేక ఉదాహరణలు ఇస్తున్నారు. మనం ప్రయాణించే మెజారిటీ విమానాలను నడుపుతున్నది ప్రయివేట్ సంస్థలే. రోడ్డు ప్రయాణం చేసేటపుడు మనం ఆర్టీసీ బస్సుల కన్నా ప్రయివేట్ ట్రావెల్స్ వారికి ప్రాధాన్యత ఇస్తాము. గవర్నమెంట్ పాఠశాలలు మన ఇంటి పక్కనే ఉన్నా, మన పిల్లలను లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తూ ఎక్కడో నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రయివేట్ పాఠశాలలకు పంపిస్తాము. పోస్టల్ సర్వీసులు ఉన్నా, కొరియర్ సర్వీస్ వారి సేవలను వినియోగించుకుంటాము. ప్రభుత్వ టెలికం సేవలు ఉన్నప్పటికీ జియో, ఎయిర్ టెల్ లాంటి ప్రయివేట్ నెట్ వర్క్ సేవలని ఎంచుకుంటాము. ప్రయివేట్ వశం కావడం వలన కచ్చితమైన పనితీరు కనపర్చాల్సి ఉంటుంది. యూనియన్ కార్యకలాపాల పేరుతో ఆఫీసు ఎగ్గొట్టి బయట తిరగడం లాంటివి కుదరవు. అన్నింటికంటే ముందుగా వారు రిజర్వేషన్లను పాటించరు. మెరిట్స్ ను బట్టే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రయివేటీకరణను వ్యతిరేకించే ఎంతమంది తమ పిల్లలను చదువులకోసం, ఉద్యోగాలకోసం విదేశాలకు పంపినిచ్చారు? అక్కడ వారికేమైనా గవర్నమెంట్ ఉద్యోగాలా? ఈ విమర్శకుల పిల్లలు లక్షలమంది మనదేశంలోనే ఐటి కంపెనీల్లో పనిచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అవేమైనా గవర్నమెంట్ ఉద్యోగాలా? అంటూ నిలదీస్తున్నారు.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఒకసారి కేంద్రం కన్ను పడిన తరువాత దాన్ని ఆదుకోవడం కష్టమే. ఎందుకంటే మనదేశంలో ఎప్పుడైతే ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాయా, అప్పుడే ప్రయివేటీకరణకు బీజం పడింది. మరో పాతికేళ్ల తరువాత ఒక్క అణుపరిశోధనా కేంద్రాలు, అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు, రక్షణరంగ సంస్థలు మినహా మిగిలిన అన్ని సంస్థలు ప్రయివేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు