తెలుగుదేశం పని అయిపోయిందా?

chandrababu

తెలుగుదేశం పార్టీ నలభయ్యో వార్షికోత్సవ సందర్భంగా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న అంశం ఇది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చావుదెబ్బ తిని కొన్నాళ్లపాటు దిగ్భ్రమ నుంచి కోలుకోలేని తెలుగుదేశం పార్టీ మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో సైతం మరింత కృంగిపోయింది. తెలుగుదేశం పార్టీలో నలభై ఏళ్ళనుంచి వెలిగిపోతున్న అనేకమంది సీనియర్ నాయకులే నేడు కూడా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. నలభై ఏళ్లకాలం అంటే మామూలు మాటలు కాదు. కనీసం మరొక తరం నాయకులు ఏనాడో ఆ పార్టీలో ఉద్భవించాల్సింది. కానీ అలా జరగలేదు. ఎన్టీఆర్ ను కూలద్రోసి చంద్రబాబు అధికారం చేపట్టి తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకున్నా, అంతకు ఎన్టీఆర్ కాలం నాటి యనమల, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణ, అశోక్ గజపతి రాజు లాంటి నాయకులే ఇంకా ముందువరసలో ఉన్నారు. చంద్రబాబు తయారు చేసిన నాయకులు అంటూ ఎవ్వరూ లేరు. ఉన్నవారిలో దేవినేని ఉమా మహేశ్వరరావు, కేశినేని నాని, గల్లా జయదేవ్, పత్తిపాటి పుల్లారావు లాంటివారెవ్వరూ ప్రభావశీలురు కారు. ఇక రాయలసీమలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉంటున్న చెప్పుకోదగిన నాయకులు ఎవ్వరూ లేరు. అందరూ కప్పగంతుల నాయకులే. అనగా కాంగ్రెస్, వైసిపి నుంచి దూకినవారే. వీరెవ్వరికి విశ్వసనీయత లేదు.

చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీయేనా అని. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ నే తరిమేసిన తరువాత ఇక దీన్ని తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం సబబేనా అని ప్రశ్నిస్తారు. మనదేశంలో ఏ రాజకీయపార్టీకైనా శాశ్వతంగా ప్రజల మనస్సులో గుర్తుండాలంటే ఆ పార్టీ యొక్క గుర్తు ప్రధానం. ఎన్టీఆర్ సృష్టించిన తెలుగుదేశం గుర్తు సైకిల్. ఆ గుర్తు చంద్రబాబు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. కాబట్టి సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోనిదే. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో దెబ్బతిన్నంతమాత్రాన తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని భావించడం సమంజసం కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. దానికి ఇంకా ముప్ఫయి శాతం ఓటుబ్యాంక్ ఉన్నదని మొన్నటి స్థానిక ఎన్నికల్లో తేలింది. బీజేపీ ఏర్పడి నలభై ఏళ్లయినా దానికి ఆంధ్రప్రదేశ్ లో పునాదులు ఏర్పడలేదు. జనసేన ఏర్పడి ఏడేళ్లయినా ఆ పార్టీకి అయిదు శాతం కూడా ఓటుబ్యాంక్ లేదు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినట్లే. కనుక వైసిపికి ప్రతిపక్షం అంటూ ఉంటె అది తెలుగుదేశం పార్టీయే అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుబ్యాంక్ కన్నా స్థానిక ఎన్నికల్లో సుమారు పదిశాతం ఓటుబ్యాంకును తెలుగుదేశం కోల్పోయింది. అది ఇంకా తగ్గాలంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇదే తీరుగా మరో పదేళ్లపాటైనా కొనసాగాలి.

ఇక తెలుగుదేశం పార్టీకి బలమైన సామాజికవర్గపు అండదండలు ఉన్నాయి. పత్రికలు, టీవీ ఛానెల్స్ సహకారం ఉన్నది. వాటికి జగన్మోహన్ రెడ్డి మీద కసి, కక్ష తారాస్థాయిలో ఉన్నాయి. ఆరు నూరైనా అవి తెలుగుదేశం పార్టీ తరపునే పోరాడతాయి. అంతేకాకుండా వివిధ వ్యవస్థలలో చంద్రబాబు పాతిన విత్తనాలు మహావృక్షాలుగా ఎదిగాయి. ఈ అదృశ్యశక్తులు చంద్రబాబుకు మద్దతుగా నిలబడతాయి అనడంలో సందేహం లేదు. పైగా ఏదైనా రాజకీయ పార్టీ బ్రతకాలంటే దానికి బలమైన నాయకత్వం, ఫండింగ్ చాల అవసరం. తెలుగుదేశం పార్టీకి ఆ రెండూ పుష్కలంగా ఉన్నాయి. అవి లేకనే ప్రజారాజ్యం, లోక్ సత్తా, కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన పుంజుకోలేకపోయాయి.

ఇప్పుడు వస్తున్న సందేహం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వాన్ని ఇప్పటివరకూ అందించిన చంద్రబాబు ప్రభావం మెల్లగా క్షీణిస్తున్నది. చంద్రబాబు ధూర్త రాజకీయాల పట్ల ప్రజలు విసిగిపోయారు. గారడీవాడు గొంతు కోసుకున్నా దాన్ని గారడీయే అని ఎలా భావిస్తామో, చంద్రబాబు ఎంత గొంతు చించుకున్నా ఆయన నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లిపోతున్నది. చంద్రబాబు కొత్త రక్తాన్ని తయారు చెయ్యడంలో విఫలం అయ్యారు. యువరక్తం అనుకున్న లోకేష్ నాయుడు పరమశుంఠగా, అసమర్ధుడుగా ఇప్పటికే జనంలో ముద్ర వేయించుకున్నాడు. కాబట్టి లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందన్న ఆశలు ఎవ్వరికీ లేవు.

ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది భవిష్యత్తు లేనిది తెలుగుదేశం పార్టీకా లేక చంద్రబాబు నాయుడికా అని. నిస్సందేహంగా చంద్రబాబుకు భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ ను దీటుగా ఎదుర్కోవాలంటే తెలుగుదేశంలో యువ నాయకత్వం రావాలి. కానీ, అలాంటి యోధుడు తెలుగుదేశం పార్టీలో కనుచూపుమేరలో లేడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విశ్వసనీయత కలిగిన డైనమిక్ నాయకుడుగా జనం మదిలో స్థానం సంపాదించారు. ఆ స్థానాన్ని తొలగించడం మరో ఇరవై ఏళ్లదాకా అసాధ్యం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఓడిపోతే నాడు ఎన్టీఆర్ కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది. చంద్రబాబును తొలగించడం, లేదా పార్టీ చీలిపోవడం సంభవించే అవకాశం ఉన్నది.

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు