గోదావరి -పెన్నా అనుసంధానం సాధ్యమా?

  (వి శంకరయ్య)                                      
 
1989 లో జాతీయ జల అభివృద్ధి సంస్థ ఒక నివేదిక తయారు చేసి గోదావరి నదిలో ఇచ్చం పల్లి వద్ద 717.84 టియంసిలు పోలవరం వద్ద 530 టియంసిలు మిగులు వుంటాయని మహానది గోదావరి కృష్ణ పెన్నా తో పాటు పాలారు మీదుగా కావేరీ అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. అయితే ఉమ్మడి ఎపి గోదావరి లో మిగులు జలాలు లేవని తేల్చింది. కాగా ఒరిస్సా మహానదిలో మిగులు నీరు లేదని చెప్పడంతో ఈ ప్రతిపాదన ఆగి పోయింది. అయితే ఈ నివేదిక ఏం చెప్పిన దంటే 1901-02 నుండి 1981_82 సంవత్సరాల మధ్య సమాచారం ఆధారంగా గోదావరిలో శ్రీ రాం సాగర్ దిగువన 75 శాతం నీటి లభ్యత కింద 2337.58 టియంసిలు 50 శాతం నీటి లభ్యత కింద 2690.45 టియంసిలు వుంటాయని ఫలితంగా ఇచ్చం పల్లి పోలవరం వద్ద మిగులు జలాలు వుంటాయని లెక్క కట్టింది. ఇది గత చరిత్ర.            
రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పాటు జరిగిన తదుపరి తెలంగాణ కోరిక మేరకు జాతీయ జల అభివృద్ధి సంస్థ మరో మారు సర్వే చేసి నివేదిక ఇచ్చింది.                       
 
1901-02నుండి 2010-11 వరకు అంటే 110 సంవత్సరాల గణాంకాల ప్రకారం గోదావరి లో నీటి లభ్యత వినియోగం మిగులును అంచనా వేసింది. గత నివేదికకు దీనికి తేడా వచ్చింది.
 
శ్రీ రాం సాగర్ దిగువన 75 శాతం నీటి లభ్యత కింద 2106.59 టియంసిలు 50 శాతం నీటి లభ్యత కింద 2633.59 టియంసిలు వుంటాయని గత నివేదికతో పోలిస్తే 75 శాతం కింద 231 తగ్గి పోతానని తేల్చింది.         
 
ఈ గణాంకాలు సరి పోలిస్తే తెలంగాణ ఎపి రెండు రాష్ట్రాలు చేపట్టిన పథకాలు కలుపు కొంటే ఇద్దరు అవసరాలు తీర్చేందుకు ఇచ్చం పల్లి నుండి 140 టియంసిలు జలాలు కిందకు విడుదల చేయాలని తాజా సర్వే తేల్చింది. ఇచ్చట ఒక అంశం గమనంలోనికి తీసుకోవాలి. అంతర్ రాష్ట్ర నదులలో నీటి లభ్యత ఏ రాష్ట్రంకు ఆ రాష్ట్రం అంచనా వేసే అవకాశం లేదు. తప్పు గాని ఒప్పు గానీ కేంద్ర జల సంఘం నిర్ణయించాలి. ఎందుకంటే ప్రాజెక్టులకు అనుమతులు వారు ఇవ్వాలి.     
 
వాస్తవం ఇలా వుండగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదో ఒకటి రెండు ఏళ్ల లో వచ్చే వరదలు పైగా నిర్మాణం లో వున్న ప్రాజెక్టుల వినియోగం అను భవానికి రాక ముందే ఆకాశానికి నిచ్చెనలు వేసి ప్రజలకు ఆశలు కల్పించు తున్నారు.                       
 
కృష్ణా నది వట్టి పోవడంతో ఇరువురు గోదావరి నదిపై పడుతున్నారు. గోదావరి పెన్నా అనుసంధానంతో 500 టియంసిలు జలాలు తరలిస్తానని మన ముఖ్యమంత్రి చెబుతున్నారు.
 
కేంద్ర జల సంఘం అనుమతి లేకనే ఇది సాధ్యమా? ఆ మధ్య గోదావరి కృష్ణ బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు తమకు సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టులు చేపడుతున్నాయని చైర్మన్ ఘాటుగా విమర్శించారు. ఎపి ఇంకా శైశవ దశలోనే వుంది. తెలంగాణ గోదావరి జలాలను రాష్ట్ర మంతటా తీసుకు రావాలని పథకం అమలు చేస్తున్నది.                           
 
ప్రస్తుతం తెలంగాణ మేడి గడ్డ నుండి రివర్స్ పంపింగ్ స్కీం తో 225 టియంసిలు నీటిని తరలించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు అమలు చేస్తున్నది. దీనికి కేంద్రం నుండి దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. 
 
ఈ పరిస్థితుల్లో గోదావరి పెన్నా అనుసంధానం ఎంత వరకు వీలౌతుంది. 80 వేల కోట్ల పథకం కేంద్ర అండ లేకుండా సాధ్యమా? అసలు అనుమతులు మాటేమిటి?           
 
గోదావరి లో శ్రీ రాంసాగర్ నుండి ఇచ్చం పల్లి వరకు ప్రాణ హిత ఇంద్రావతి ముఖ్యనదులు. ఇచ్చం పల్లి దిగువన శబరి ముఖ్యనది. వీటిలో నీరు వుంటేనే గోదావరి లో వరద వుంటుంది.           
 
రాష్ట్ర విభజన తదుపరి జాతీయ జల సంఘం ఇచ్చిన నివేదిక వున్నా ఇరువురు ముఖ్యమంత్రులు అదేమీ పట్టించు కోకుండా గోదావరి ఆధారంగా పథకాలు ప్రకటించుతునారు.                     
 
దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనల మేరకు వ్యవహరించడంలేదు. వాస్తవంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కొన్ని అనుమతులు వస్తాయని కొందరు భావించ లేదు. అయినా ఇచ్చారు. అంతా రాజకీయం. ఏతా వాతా మనం అన్ని విధాలా నష్టపోయాం. మున్ముందు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోనికి వచ్చినా జరగాల్సిన నష్టం జరిగి పోయి నందున పూడ్చడం అతి కష్టం. ఇదిలా ఉండగా గత సంవత్సరం కేంద ప్రభుత్వం తెలంగాణలోని అఖినే పల్లి నుండి లిఫ్టు ద్వారా తమిళ నాడు కు గోదావరి జలాలను తరలించాలని ఒక ప్రతిపాదన చేసింది. అయితే బిజెపితో సఖ్యతగా వుండిన ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదప లేదు. గాని కెసిఆర్ అడ్డం తిరగడంతో ఈ పథకం ఆగిపోయింది.