ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. కృష్ణా నది తీర ప్రాంతాలకు హెచ్చరిక..!

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలకు మళ్లీ వరద ముప్పు భయాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది. గతేడాది బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని జలమయం చేసిన దృశ్యం ఇప్పుడు మరలికీదంటోంది. ఈసారి కూడా అదే దృశ్యం పునరావృతం కాకూడదని అధికారులు ముందస్తు జాగ్రత్తలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు సోమవారం ఉదయం గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడదల చేశారు. వరద నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో ఆధారంగా మారుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టంచేసింది.

ప్రస్తుతం కృష్ణానది కరకట్టల చుట్టూ, లంక గ్రామాలు ఉన్న ప్రాంతాలకు ఈ వరద మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఎవరైనా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తే అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు పునః విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాల వల్ల వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదిలో ప్రయాణాలు, ఈత, చేపల వేట వంటి ప్రమాదకర కార్యకలాపాలు చేయకూడదని అధికారులు స్పష్టం చేశారు.

ఇంతలో వాతావరణ శాఖ కూడా రాష్ట్రానికి మరో హెచ్చరిక జారీ చేసింది. సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కోస్తా, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రజలు పునరావృత వరద వణుకుల నుంచి తప్పించుకోవాలంటే అధికారులు సూచించే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే వారు ముందే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచిస్తున్నారు. కృష్ణానది లో వరద ఇంకెంత వస్తుందో.. పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. అయితే జాగ్రత్తలు మాత్రం అందరూ పాటించాలి.