రాజధాని వికేంద్రీకరణ  జరుగుతుందా?

YS Jagan and Three Capitals
ఇరవైనాలుగు గంటల వ్యవధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఖేదం కలిగించే విషయం ఒకటి, మోదం కలిగించే విషయం మరొకటి అనుభవంలోకి వచ్చాయి.  ఎన్నికల కమీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి చాలా గట్టి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి.  నిమ్మగడ్డ పునర్నియామకాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు తలవంచక తప్పలేదు.  అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తగ్గడాన్ని రెండు రకాలుగా చెప్పుకుంటున్నారు.  ఇక గత్యంతరం లేకనే నిమ్మగడ్డను పునర్నియమించినట్లు వైసీపీయేతర పార్టీలు ఎద్దేవా చేస్తుండగా,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇబ్బందుల్లోకి నెట్టడం ఇష్టం లేకనే జగన్ అంగీకరించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  న్యాయస్థానాలు కూడా నిమ్మగడ్డ నియంతలా వ్యవహరించి ఎన్నికలను వాయిదా వెయ్యడం,  బీజేపీ నేతలతో హోటల్లో రహస్య సమావేశాన్ని నిర్వహించడం లాంటి అంశాలను పట్టించుకోలేదు.  ఆ మేరకు ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు కోర్టులో సమర్ధవంతంగా వినిపించడంలో వైఫల్యం చెందారు.     ఒక విషయం మాత్రం స్పష్టం అయింది.  న్యాయస్థానాలు అన్నీ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది.  దీనివలన జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో  అనుకూలత వస్తుందా లేక వ్యతిరేకత వస్తుందా అనేది కాలక్రమంలో తెలుస్తుంది.   
 
నిమ్మగడ్డ వ్యవహారం సుదీర్ఘంగా కొనసాగడం వలన అటు నిమ్మగడ్డ ప్రతిష్ట కూడా ప్రజల్లో దెబ్బతిన్నది.  ఎందుకంటే ఆయన ప్రవర్తన మొదటినుంచి అనుమానాస్పదంగానే ఉన్నది.  ప్రజాప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వెయ్యడం, వాయిదా వేసిన తరువాత కూడా ఆరునెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం,  లక్షల రూపాయల ఖర్చుతో ఖరీదైన లాయర్లను నియమించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు నడపడం, ఆయనకు తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీలు మద్దతుగా నిలబడటం,  కొందరు బీజేపీ నాయకులతో హైదరాబాద్లో హోటల్లో రహస్యంగా చర్చలు జరపడం, కేవలం ఒక్క అధికారి ఉద్యోగం కోసం నాలుగైదు పచ్ఛచానెళ్లు రోజూ గంటల తరబడి చర్చాగోష్టులు నిర్వహించడం, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం చూసి నిమ్మగడ్డ మీద సానుభూతి కూడా పోయింది.  చివరివరకు తన పంతాన్ని నెగ్గించుకోవాలని ప్రయత్నించి చివరినిముషంలో జగన్ తలవంచడం కూడా ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది.  అయితే, ప్రతిష్టకు పోకుండా నిమ్మగడ్డ పునర్నియామకాన్ని అంగీకరించి న్యాయస్థానాల పట్ల గౌరవాన్ని ప్రదర్శించుకున్నారనే మంచి పేరు కూడా జగన్ కు దక్కింది.   అయితే ఒక్కవిషయం మాత్రం స్పష్టం అయింది.  ప్రజాతీర్పు కన్నా ప్రజలతో సంబంధం లేని వ్యవస్థల తీర్పులు మిన్న అనే సత్యం ప్రపంచానికి తెలిసొచ్చింది.  కాబట్టి ప్రజాప్రభుత్వాలు ఇక మీదట తమ పంతాలు చెల్లించుకోవడానికి వేరే రాజ్యాంగ వ్యవస్థలతో యుద్ధం చెయ్యాల్సివస్తుందనేది సత్యం.  దీన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి పాలనలో పట్టువిడుపులు ప్రదర్శిస్తూ, రాజ్యాంగ వ్యవస్థలతో సమన్వయము చేసుకుంటూ ఇలాంటి ఎదురుదెబ్బలు తినకుండా వ్యవహరించాలి. 
 
ఇక నిమ్మగడ్డ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ,  జగన్మోహన్ రెడ్డి పొగరును కోర్టులు ఎలా దించాయో … తెలుగుదేశం అనుకూల విశ్లేషకులతో పొద్దస్తమానం చర్చలు నిర్వహించి జగన్ ను అసమర్ధుడుగా, పరాజితుడుగా అదే సమయంలో చంద్రబాబును విజేతగా చిత్రించాలని ఎల్లో మీడియా కన్న కలలన్నీ కేవలం గంటల వ్యవధిలోనే చెదిరిపోయాయి.   మూడు వారాల క్రితం తనవద్దకు చేరిన రాజధాని వికేంద్రీకరణ బిల్, సీఆర్డీఏ బిల్ ను గవర్నర్ ఆమోదించడంతో  వైసిపి శ్రేణులు హర్షామోదాలతో పండుగ చేసుకుంటుండగా, మిగిలిన రాజకీయపక్షాలు, అమరావతి రైతులు భగ్గుమన్నారు.  నిమ్మగడ్డ విజయాన్ని ఆసాంతం అనుభవించకుండానే,  రాజధాని వికేంద్రీకరణ బిల్ ఆశనిపాతంలా వారి ఆశలను నిలువునా నీరుగార్చింది.  వెంటనే పచ్చ మీడియా జగన్ మీద గవర్నర్ మీద అసభ్యపదజాలంతో విరుచుకునిపడుతూ హోరాహోరీగా చర్చలు ప్రారంభించాయి.  అమరావతి రైతుల ఆక్రోశాలు, మహిళారైతుల కన్నీళ్లు తెరనిండా చూపిస్తూ ప్రభుత్వానికి, గవర్నర్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం  చేశాయి.  వైసిపి వారికి  నిమ్మగడ్డ విషయంలో ఎదురైన పరాభావ భారం కన్నా రాజధాని విషయంలో కలిగిన ఆనందమే వెయ్యిరెట్లు ఎక్కువ.  ఎందుకంటే నిమ్మగడ్డ మళ్ళీ కమీషనర్ గా నియమితులైనా, ఆయన ఇప్పుడు చేసేదేమి లేదు.  మహా అయితే ఆయన మరో ఎనిమిది నెలలు అధికారాన్ని అనుభవిస్తారు.  అసలు ఆయన పదవీబాధ్యతలు తీసుకోగానే రాజీనామా చేస్తారని ఇప్పటికే పచ్చ చానెళ్లు సంకేతాలు ఇస్తున్నాయి.  ఏమి జరుగుతుందో మరో నాలుగైదు రోజుల్లో తెలుస్తుంది.  
 
ఇక ఇప్పుడు తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు చేతులు ముడుచుకుని కూర్చుంటాయనుకోవడం పొరపాటు.  కోర్టుకు వెళ్తామని ఇప్పటికే ప్రకటించేశారు.  కాబట్టి రాజధాని తరలింపు అంత తేలికగా అవుతుందా అనేది సందేహమే.  గవర్నర్ ఆమోదం లభించినంత మాత్రాన ఇల్లు అలకగానే పండుగ అయినట్లు భావించరాదు.  కోర్టుల్లో ఇంకా పోరాటం చెయ్యాల్సి వస్తుంది.  ఏమైనప్పటికీ జగన్ కు గవర్నర్ నిర్ణయం ఉపశమనం కలిగించేదే.  కేంద్రం కూడా వైసిపికి అనుకూలంగా ఉన్నదన్న సంకేతాలు వెలువడ్డాయి.  ముఖ్యంగా రాజధాని తరలింపుకు వ్యతిరేకం అయిన కన్నా లక్ష్మీనారాయణను తొలగించడం, సోము వీర్రాజును ప్రతిష్టించడం, రాజధాని వికేంద్రీకరణ తో మాకు సంబంధం లేదని ఆయన ప్రకటించడం, ఆ వెంటనే గవర్నర్ బిల్లులను ఆమోదించడం చూస్తుంటే ఈ పరిణామాలన్నిటికి కనెక్షన్ ఉన్నదని అనిపిస్తుంది.  
 
ఇక ఇప్పుడు జగన్ కర్తవ్యమ్ ఏమిటంటే అమరావతి రైతులతో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి మనశ్శాంతి కలగజేయాలి.  వారి ఆస్తులకు, ఆస్తుల విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి.  వారి డిమాండ్స్ ను పరిశీలించాలి.  వారిని బుజ్జగించాలి.  వారిని తనకు అనుకూలురుగా మార్చుకోవాలి.  ఇదంతా జగన్ వ్యక్తిగత రాజకీయ పరిణితి మీద ఆధారపడి ఉంటుంది.  చూద్దాం ఏమి జరుగుతుందో! 
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు