రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభల కోసం జనం తరలి వెళతారు.. సోషల్ మీడియాలోనూ ఆయా పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేస్తారు.. కానీ, ఓట్ల పండగ వచ్చేసరికి.. ఓటెయ్యకుండా పారిపోతారు.! ఇదీ గ్రేటర్ ఓటర్ పరిస్థితి. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ చాలా చాలా మందకొడిగా సాగుతోంది. సినీ తారలు, ఓటు ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఎన్ని వీడియోలు చేసినా, ఓటేశాక.. సోషల్ మీడియాలో ‘అభిమానులూ ఓటు తప్పక వేయండి..’ అని పిలుపునిస్తున్నా.. ఓటర్లు మాత్రం, లైట్ తీసుకున్నారు. సొంతూళ్ళలో వీకెండ్ సెలవులకి అదనంగా కలిసొచ్చిన పోలింగ్ హాలీడేని ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు తప్ప, హైద్రాబాద్‌లోనే వుండి ఓటెయ్యాలన్న సోయ మాత్రం ప్రదర్శించలేదు. అందరూ అని కాదుగానీ, చాలామంది చేసింది ఇదే. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైద్రాబాద్ విడిచి వెళ్ళిన హైద్రాబాదీల సంఖ్య చాలా ఎక్కువగానే వుందట. ఇందుకు నిదర్శనం హైద్రాబాద్ చుట్టూ ఆయా మార్గాల్లోని టోల్‌గేట్ల వద్ద కనిపిస్తున్న రద్దీ పరిస్థితే.
ఓటెయ్యకపోతే, ప్రశ్నించే హక్కుని కోల్పోతాం..
ఓటెయ్యకపోతే ప్రశ్నించే హక్కుని నైతికంగా కోల్పోతాం. ఓటెయ్యకపోతే ప్రశ్నించకూడదనే రూల్ ఏమీ లేకపోయినా.. నైతికత విషయానికొస్తే, ఓటెయ్యని మనకి వ్యవస్థను ప్రశ్నించే హక్కు ఎలా వస్తుంది.? మనల్ని మనమే సంస్కరించుకోవాలి. ఏ రాజకీయ పార్టీ నచ్చితే ఆ రాజకీయ పార్టీకి ఓటెయ్యొచ్చు. ఎవరూ నచ్చలేదని చెప్పడం సమంజసం కాదు. వున్నవాళ్ళలో నచ్చినవారికి ఓటెయ్యడం ఓటరుగా ప్రతి ఒక్కరి విధి. మంచాన పడ్డ ముదుసలి వ్యక్తులూ ఇతరుల సాయంతో పోలింగ్ స్టేషన్లకు వెళుతున్నారు. కానీ, అన్నీ సక్రమంగా వుండి కూడా ఓటెయ్యకపోతే.. వ్యవస్థకు చేటు చేసినవారే అవుతారన్నది ప్రజస్వామ్యవాదుల వాదన.
బెంబేలెత్తుతున్న పార్టీలు..
ఓటింగ్ శాతం తక్కువగా నమోదైతే ఎలా.? అన్న విషయమై అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ ఆందోళన చెందుతున్నాయి. కనీ వినీ ఎరుగని రీతిలో గ్రేటర్ ఎన్నికల కోసం ఆయా రాజకీయ పార్టీలు ఖర్చు చేశాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను తలదన్నేలా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేయడం చూస్తున్నాం. ప్రచారం హోరెత్తింది.. వీధుల్లో రచ్చ రచ్చ జరిగింది. అప్పుడు కనిపించిన జనం, ఇప్పుడెందుకు పోలింగ్ బూత్‌ల వద్ద కనిపించడంలేదు.? అన్న విషయమై ఆయా రాజకీయ పార్టీల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అభ్యర్థుల మొహాలైతే వాడిపోయి కనిపిస్తున్నాయి.
ఈ గుద్దుడే బావుందంటున్న యువతరం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లతో పోల్చితే, బ్యాలెట్ ఓటింగ్ విధానమే బావుందన్న చర్చ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా యువతలో వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళ ఈవీఎంలు మొరాయించడం అనేది సర్వసాధారణమే. అందుకే, బ్యాలెట్ విధానమే ముద్దు.. అన్న చర్చ జరుగుతోంది చాన్నాళ్ళుగా. పైగా, ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో బ్యాలెట్ వైపుకు ఆయా పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. ఎంత హైటెక్ యుగమైనా.. ఈవీఎం సమస్యలు, అనుమానాలూ మామూలే. అందుకే, ఎన్నికల కోసం ఈవీఎంలు దండగ.. బ్యాలెట్ మాత్రమే ముద్దు.. అన్న అభిప్రాయాలకు ఎక్కువమంది ఓటేస్తున్నారు.