హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఎన్నో అంచనాల మధ్య నేడు (మే 31, 2024) థియేటర్లలో విడుదలయింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిచించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందో తెలుసుకుందాం…
కథ: జీవితంలో ఎదగాలని కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం(విశ్వక్ సేన్) ఎమ్మెల్యే దొరసామ రాజు(గోపరాజు రమణ) బృందంలో చేరుతాడు. ఆ తరువాత అతడు నానాజీ(నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా అతడికి శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన రత్నాకర్ ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు? బుజ్జి(నేహా శెట్టి) ఎవరు.. రత్నాకర్‌కు ఆమెతో ఎలాంటి సంబంధం ఉంటుంది..? ప్రత్యర్థుల ఎత్తుగడలను రత్నాకర్ ఎలా తిప్పికొట్టాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ : గ్యాంగ్స్ ఆప్ గోదావరి ఒక రొటీన్ మాస్ యాక్షన్ మూవీగా నిలుస్తుంది. విశ్వక్ సేన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే అంజలి నటన ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. అయితే, సెకండాఫ్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాలి. కృష్ణ చైతన్య డైరెక్షన్ బాగున్నా, స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ పెట్టాల్సింది. నేహా శెట్టి పాత్ర ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. అంజలి పాత్ర నిడివి కూడా ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది. ఎమ్మెల్యే పాత్రలో గోపరాజు రమణ కాకుండా వేరొక నటుడైతే ఆ ఇంపాక్ట్ బలంగా ఉండేది. నాజర్, సాయి కుమార్ల ట్యాలెంట్ వృధా అయ్యింది. స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడం, అనవసరమైన సన్నివేశాలు, కథ స్లోగా సాగడం ప్రేక్షకులకు నిరాశను మిగిలిస్తాయి. సినిమాలోని ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో సాగగా, సెకండాఫ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఫస్ట్ హాఫ్‌లోని ఆసక్తిని సెకండ్ హాఫ్‌లో కొనసాగించలేకపోయారు. కొన్ని సీన్స్ చాలా బలంగా ఉన్నప్పటికీ వాటిని ప్రెజెంట్ చేసిన తీరు వాటిపై ఆసక్తిని తగ్గిస్తాయి. దర్శకుడు ఎమోషనల్ సీక్వెన్స్‌లపై మరికాస్త ఫోకస్ చేయాల్సింది. లంకల రత్నాకర్‌గా విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అతడు గోదావరి యాసలో చెప్పే డైలాగులు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అధికారం రాకముందు, వచ్చిన తరువాత అతడి పాత్రలోని వైవిధ్యాన్ని విశ్వక్ చాలా బాగా చూపెట్టాడు. అంజలి మరోసారి తన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, యువన్ శంకర్ రాజా అందించిన స్కోర్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి. గోపరాజు రమణ, నాజర్, హైపర్ ఆదిలు తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు.
టెక్నీకల్ విషయాలకొస్తే…యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. అనిత్ మధడి సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్షన్ ఓవరాల్‌గా బాగున్నా, సెకండాఫ్‌పై ఆయన మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా కథ మరింత ఆసక్తికరంగా ఉండేది. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే అనిపించింది. చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
(చిత్రం : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విడుదల తేదీ : మే 31, 2024, రేటింగ్ : 2.5/5, నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు, దర్శకత్వం : కృష్ణ చైతన్య, నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య, సంగీతం : యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: అనిత్ మధడి, ఎడిటింగ్: నవీన్ నూలి).