ఖర్చులకు లెక్కాపత్రం ఉండేది కాదు. ఇక ఊళ్ళోవారి ఇళ్ల ప్రహరీగోడల నిండా ఎన్నికల ప్రచారపు రాతలు రాసేవారు. వీరి దెబ్బకు బయపడి ఇళ్లకు సున్నం కొట్టించుకోవాలంటే ఇంటి యజమానులు భయపడేవారు. గట్టిగా ఏమైనా మాట్లాడితే రేపు గెలిచాక వేధిస్తారనే భయం వెంటాడేది. దాంతో ఎన్నికల అభ్యర్థుల ఆగడాలను మౌనంగా భరించేవారు. కానీ, శేషన్ ఎన్నికల కమీషనర్ అయ్యాక ఇలాంటి దౌర్జన్యాలకు ముకుతాడు వేశారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు అందరిమీద నిఘా పెట్టడమే కాక ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టారు. ప్రభుత్వ అధికారులను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని వార్నింగులు ఇచ్చారు. మాట విననివారిని బదిలీలు చేశారు. ఇంకా చెప్పాలంటే శేషన్ ఏమి మాట్లాడినా, ఏమి ఆదేశాలు జారీ చేసినా, ప్రధానమంత్రి సైతం నోరు మూసుకుని పాటించాల్సిందే. లేకపోతె ప్రధానికి సైతం నోటీసులు ఇచ్చారు.
విశ్వాసాన్ని కోల్పోతున్న ఎన్నికలసంఘం
రాజ్యాంగవ్యవస్థలను ఎవరైనా గౌరవించాల్సిందే అనడంలో సందేహం లేదు. అలాంటి వ్యవస్థలలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన పవిత్రమైన బాధ్యత కలిగిన ఎన్నికల సంఘం చాలా ముఖ్యమైనది. సాధారణ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించరాదు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ గా టి ఎన్ శేషన్ వ్యవహరించినపుడు ఆయన రాజకీయపార్టీలతో, రాజకీయపార్టీలు ఆయనతో ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శించాయి. కానీ వారిమధ్య పోరులో చివరికి శేషన్ దే పైచేయి అయింది. నియమనిబంధనల అమలు విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరించారు. ముఖ్యంగా ఆయన రాకముందు అసలు ఎన్నికల సంఘం అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఏమాత్రం లెక్కచెయ్యకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. స్థానిక పోలీసు అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి పొద్దుపోయిన తరువాత కూడా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసేవారు. డబ్బుల పంపిణీ బహిరంగంగానే జరిగేది.
శేషన్ ధాటికి పెద్ద పెద్ద నాయకులు, పార్టీలు గజగజ వణికిపోయాయి. శేషన్ పదవిలో ఉన్నంతకాలం ఆయనకు ఎదురు చెప్పడానికి ఏ నాయకుడూ సాహసించలేదు. ఎక్కడ ఏ నిబంధన ఉల్లంఘిస్తున్నా శేషన్ గమనిస్తున్నారేమో అన్నంతగా అభ్యర్థులు బిక్కుబిక్కుమంటూ ప్రచారం చేసుకునేవారు. గోడలమీద రాతలు రాయడానికి ఎవ్వరూ సాహసించలేదు. గోడలమీద రాయడాన్ని శేషన్ నిషేధించారు. భారత ఎన్నికలసంఘం చరిత్రలో శేషన్ లా సర్వ స్వతంత్రంగా విధులు నిర్వహించిన ఎన్నికల అధికారి అంతవరకు లేరు. ఆ తరువాత కూడా లేరనే చెప్పాలి. అప్పటివరకు ఎన్నికల ప్రచారం అంటే భయపడుతున్న ప్రజలు శేషన్ ధైర్యసాహసాలకు నీరాజనాలు అర్పించారు. ఎన్నికల సంస్కరణలు అమలు చేసినవాడిగా, నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేసిన వాడిగా శేషన్ భారతీయుల స్మృతిపధంలో పాతికేళ్ల తరువాత కూడా చెరిగిపోని ముద్ర వేశారు.
సంక్షేమాన్ని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం
మరో రెండున్నర మాసాల్లో ఇంటికి వెళ్లబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారసరళి చూడండి…ఆయన మొదటినుంచి చంద్రబాబు మనిషిగానే ముద్రపడ్డారు. ఆయన తీసుకుంటున్న ప్రతిచర్య అనుమానాస్పదంగానే ఉంటున్నది. చంద్రబాబు ఓడిపోవడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభలు వెలిగిపోతుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు ఆదేశాలపై ఏదోవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా మూడేళ్ళ క్రితం జరపాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు అభీష్టం మేరకు జరపకుండా రాజ్యాంగపదవికి వెన్నుపోటు పొడిచిన రమేష్ కుమార్ ఇవాళ ఎన్నికలు జరిపించాలని తహతహలాడుతున్నారు. ఒకవంక ప్రభుత్వ ప్రతినిధులు ఆయనతో చర్చించి వెళ్లిన గంటకే షెడ్యూల్ ప్రకటించి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ప్రకటించడం, సంక్షేమ పధకాలను ఆపేయాలని వెంటనే ప్రభుత్వానికి లేఖ రాయడం లాంటి పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పధకాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కోర్టులలో కేసులు వేస్తూ వాయిదాలు వేయిస్తున్న చంద్రబాబు స్టెప్పులకు పక్కవాయిద్యం వాయిస్తున్నట్లుంది తప్ప ఒక హుందాతనం గౌరవం కలిగిన రాజ్యాంగ వ్యవస్థ తీరులా కనిపిస్తున్నదా?
ఈ తొందర కోర్టు ధిక్కారమే
ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలు సబబుగా లేవని తోచినపుడు మళ్ళీ మళ్ళీ చర్చలు జరపాలి. న్యాయస్థానం ఆదేశాలమేరకే ప్రభుత్వ ప్రతినిధులు చర్చలకు వెళ్లారు. వారి అభ్యంతరాలను ఏకపక్షంగా తోసిపుచ్చడం, షెడ్యూల్ ప్రకటించడం కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఎన్నికల తేదీలను ప్రకటించమని ఎన్నికల సంఘానికి కోర్ట్ సూచించింది తప్ప వారి ప్రమేయం లేకుండా ఎన్నికలు నిర్వహించమని చెప్పలేదు. నిమ్మగడ్డ వ్యవహారశైలిని గమనిస్తుంటే ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారనిపించడం లేదు. ఆయనకు మార్చ్ నెలాఖరు వరకు సమయం ఉన్నది. ఈలోపల ప్రభుత్వం వెలిబుచ్చిన అభ్యంతరాలపై నిపుణుల సలహా కోరాల్సింది.. అలాగే న్యాయసలహాలు కూడా తీసుకోవాల్సింది. వారి నివేదికలను ప్రభుత్వ ప్రతినిధులతో కూర్చుని పరిశీలించాల్సింది. అలాంటిదేమీ లేకుండా ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల సంఘాన్ని ఒక్క తెలుగుదేశం తప్ప మరే పక్షమూ మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోతున్నది. జగన్ ను వ్యతిరేకించే రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ సైతం ఎన్నికల కమీషనర్ చిత్తశుద్ధిని శంకిస్తున్నాయి అంటే ఎన్నికలసంఘం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లే భావించాలి.
ఈ విషయంపై రేపు హైకోర్టులో విచారణ జరుగుతుందంటున్నారు. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని రాష్ట్రమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది.
అందరూ శేషన్ లు అవుతారా? ఒంటిమీద వాతలు పెట్టుకున్నంతమాత్రాన నక్క పులిగా మారుతుందా? ఉల్లిపూవూ, మల్లెపూవూ ఒకటే రంగులో ఉన్నా సువాసన చూస్తే తేడా తెలిసిపోదా? గాడిదా, జింకా గోధుమరంగులో ఉన్నంతమాత్రాన జింకకు దక్కే గౌరవం గాడిదకు లభిస్తుందా?
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు