అమరావతి భూ కుంభకోణంలో దూకుడుగా ముందుకు వెళ్లాలని భావించిన జగన్ ప్రభుత్వం ప్రయత్నానికి మరోసారి హై కోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ అడ్వకేట్ జనరల్ అయిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఎసిబి కేసు నమోదు నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవడంపై హై కోర్టు స్టే విధించింది. అమరావతి ల్యాండ్ స్కామ్ కేసులో తన పేరు చేర్చడం ఏమిటంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హై కోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై మంగళవారం సాయంత్రం విచారణ జరగగా, ధర్మాసనం ఆయనపై తదుపరి చర్యలపై స్టే ఇచ్చింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి దాఖలైన
ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారాన్ని ఏ మీడియాలోనూ ప్రసారం కాకుండా చూడాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేసు నమోదు ఇలా…
2015-16 మధ్య అమరావతి రాజధాని ఏర్పాటు సందర్భంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏసీబీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా మరో 12 మందిపై నమోదు చేసిన కేసు సంచలనం సృష్టించింది. కారణం ఇదే జాబితాలో సుప్రీం కోర్టు జడ్జి ఎన్ వి రమణ ఇద్దరు కుమార్తెల పేర్లు కూడా ఉండటమే. ఈ జాబితాలోని వాళ్ల పేర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, దమ్మాలపాటి శ్రీనివాస్ నాన్న, నన్నపనేని లక్ష్మీ నారాయణ, నన్నపనేని సీతా రామరాజు, నన్నపనేని కృష్ణ మూర్తి, మాదాల విష్ణువర్ధన్ రావు, ముక్కపతి పట్టాభి రామారావు, యార్లగడ్డ రితేష్, యార్లగడ్డ లక్ష్మి, నూతలపాటి శ్రీ తనూజ (సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణ కుమార్తె), నూతలపాటి శ్రీ భువన ( సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణ మరో కుమార్తె) లపై ఎఫ్ ఐ ఆర్ నమోదైంది.
లంచ్ మోషన్ దాఖలు
ఇక దమ్మాలపాటి శ్రీనివాస్ విషయానికొస్తే చంద్రబాబు హయాంలో ఏజీగా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ తన హోదాను అడ్డం పెట్టుకొని అమరావతిలో భూ కుంభకోణానికి పాల్పడినట్లు ఏసీబీ కేసులో పేర్కొంది. ఆయన తన బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేసి తిరిగి అవే భూములను 2015-16 మధ్య కాలంలో తన పేరు మీద, తన భార్య పేరు మీద మార్చుకున్నారని ఏసీబీ వెల్లడించింది. ఈ భూములన్నీ అమరావతి కోర్ క్యాపిటల్‌లో కానీ సీఆర్డీయే పరిధిలోకి కానీ వస్తున్నట్లు ఏసిబి వివరించింది. అయితే తనపై కుట్ర పూరితంగా ఏసీబీ కేసు పెట్టారంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం హై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. దమ్మాలపాటి తరపున ముకుల్ రోహత్గీ, శ్యాందివాన్ వాదనలు వినిపించారు. దమ్మాలపాటిని ఇరికించేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే అభియోగాలు మోపారని ఆధారాలతో సహా హైకోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాదులు వివరించారు.
హైకోర్టు స్టే
రాజధాని భూముల కుంభకోణం కేసులో నిందితులపై విచారణ, దర్యాప్తులను నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు వివరాలతో పాటు అందులోని వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ద్వారా బహిరంగం చేయరాదని స్పష్టంచేసింది. ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ వివరాలు ఏ మీడియాలో రాకుండా హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, సమాచార పౌర సంబంధాలశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయాన్నిసోషల్ మీడియా సంస్థలకు తెలియచెప్పేందుకు డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసారశాఖ చర్యలు తీసుకోవాలని కోర్టు నిర్థేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులివ్వడం జరిగింది. ఇప్పుడు దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.