తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన రాయలసీమ జిల్లాల పర్యటన పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తోన్న సంగతి తెలిసిందే. కడప జిల్లా పులివెందుల ఆయన నిర్వహించిన రోడ్ షో ఉన్నంతలో ప్రశాంతంగా జరగగా… ఇప్పుడు తాజాగా అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో అలాంటి వాతావరణమే నెలకొంది.
నియోజకవర్గ పరిధిలోని అంగళ్లు గ్రామానికి చేరుకున్నప్పుడు చంద్రబాబు రోడ్ షోను వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు రాకను వ్యతిరేకిస్తూ నల్లజెండాలను ఎగురవేశారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జరిగిన రచ్చతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అయితే ఈ వ్యవహారంపై అటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. టీడీపీ దాడులకు నిరసనగా జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు జిల్లాలో బంద్ పాటిస్తామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబుకు పుంగనూరులో ఎదురైన పరిస్థితులపై టీడీపీ నేతలు స్పందించారు. కానీ… వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు లేకపోవడం గమనార్హం! అవును… ఉమ్మడి చిత్తురూ జిల్లాలో, చంద్రబాబు సొంత ఇలాకాలో ఆయనకు మద్దతుగా ఒకబలమైన టీడీపీ నేతా స్పందించకపోవడం, ఖండించకపోవడంపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
అవును… మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు గజగజ వణికిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించి విమర్శించడానికి చంద్రబాబు సొంత జిల్లా టీడీపీ నేతలకు ధైర్యం లేదని అంటున్నారు. ఈ విషయం మరోసారి రుజువైందని అభిప్రాయపడుతున్నారు.
కారణం… అన్నమయ్య జిల్లా అంగళ్లులో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కృష్ణా, కడప, శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖ, విజయనగరం తదితర జిల్లాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. కానీ చంద్రబాబు సొంత గడ్డ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం అలాంటివి మచ్చుకైనా లేవు.
అయితే చంద్రబాబుని నమ్ముకుని.. పెద్దిరెడ్డి లాంటి పెద్దలతో ఎందుకొచ్చిన తగాదా అనే ఆలోచనతోనే ఈ విషయంపై స్థానిక టీడీపీ నేతలు ఎవరూ స్పందించలేదని అంటున్నారు. ఉదాహరణకు తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ చార్జ్ సుగుణమ్మ కనిపించలేదు.
ఇదే సమయంలో చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని సైతం.. మౌనాన్నే తన బాషగా చేసుకుని ఉన్నారు. ఇదే క్రమంలో… చంద్రబాబును మోసే మీడియాలో పుంగనూరు ఘటనను నిరసిస్తూ పలువురు నాయకుల అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన బలమైన ఒక్క నాయకుడి పేరు కూడా లేకపోవడం గమనార్హం.
దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని కాదని టీడీపీ నాయకులు సైతం చంద్రబాబుకు అనుకూలంగా బహిరంగంగా వ్యాఖ్యానించలేకపోతున్నారని అంటున్నారు పరిశీలకులు.