బాబరీ మసీదు – తిలాపాపం తలా పిడికెడు 

Babri Masjid
ఎప్పుడో 1992  నాటి కేసు…దేశం మొత్తాన్ని మతపరంగా చీల్చి అల్లకల్లోలం గావించిన రోజు..కలిసిమెలిసి సోదరుల్లా జీవిస్తున్న హిందూ ముస్లిమ్స్ మధ్య దూరాన్ని పెంచిన దుర్దినం.  ఎప్పటిదో పదహారో శతాబ్దం నాటి మసీదు కొంతమంది కరసేవకుల చేతుల్లో ధ్వంసం గావించబడిన రోజు..  దాని కింద రామ మందిరం ఉన్నదని, దాన్ని కూల్చేసి మసీదును నిర్మించారని ఆరోపణలు…ఇరవై ఆరేళ్లపాటు వాదప్రతివాదాలు జరిగి చివరకు అక్కడ రామమందిరం నిర్మించాలని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.  ముస్లిమ్స్ కు మరొకచోట మసీదును నిర్మించుకోవడానికి స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఇదే తీర్పు పాతిక సంవత్సరాల క్రితం వస్తే ఎలా ఉండేదో కానీ,  సామాజికంగా, ఆర్ధికంగా మన జీవితాల్లో సంభవించిన పెను మార్పులు, ఆర్ధిక సంస్కరణలు, సామాజిక జీవితం లాంటి మార్పుల కారణంగా సుప్రీమ్ కోర్ట్ తీర్పు తరువాత దేశంలో ఏ మతం వారూ రెచ్చిపోలేదు.  అల్లర్లకు పాల్పడలేదు.  ముస్లిం సంస్థలు కూడా సుప్రీమ్ కోర్టు తీర్పును మన్నించాయి.  ఒక పెద్ద వివాదానికి తెరపడిందని సంతోషించాము.  
 
Babri Masjid
 
ఇంతలోనే బాబరీ మసీదు విధ్వంసానికి బాధ్యులను చేస్తూ లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్ మొదలైన నలభై తొమ్మిది మంది మీద సిబిఐ కేసులు నమోదు చేసింది.  సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తరువాత మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి కుట్ర లేదని, ఉద్దేశ్యపూర్వకంగా జరిగినది అని చెప్పడానికి ఆధారాలు లేవని సిబిఐ ప్రత్యేక కోర్టు కేసును కొట్టెయ్యడమే కాక నిందితులు అందరినీ నిర్దోషులుగా ప్రకటించడంతో బీజేపీ, విశ్వ హిందూ పరిషద్ లాంటి సంస్థలు హర్షం వ్యక్తం చేసినప్పటికీ, ముస్లిమ్స్ మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.  మసీదు తనంతట తానే కూలిపోయిందా అని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు.    సిబిఐ కోర్టు మీద హైకోర్టులో అపీల్ చేస్తామని ముస్లిం లా బోర్డు ప్రకటించింది.  
 
ఇన్ని సంవత్సరాల విచారణ తరువాత కూడా మసీదు కూలిపోవడం వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చి చెప్పలేకపోవడం విచిత్రం.  అక్కడ మసీదు అయితే కూలింది.  మరి అందుకు బాధ్యులు ఎవరు?  వారిని గుర్తించమని  కోర్ట్ ఆదేశించినట్లు లేదు.  నేరం మోపబడినవారంతా నిర్దోషులే అయితే మరి నేరస్తులు ఎవరు?  ఇన్ని సంవత్సరాల విచారణ తరువాత కూడా నిజం నిగ్గు తేలకపోవడం మన వ్యవస్థలోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నది.  అసలు నేరస్తులను పెట్టుకుంటారా లేదా అనేది తెలియదు.   ఏమైనప్పటికీ ఈ తీర్పు ముస్లిమ్స్ ను తీవ్రమైన అసంతృప్తికి గురిచేసిందన్న మాట వాస్తవం.  హిందూ ముస్లిమ్స్ సోదరుల్లా జీవించాల్సిన దేశంలో ఇలాంటి తీర్పులు సమంజసమేనా అని తటస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
Advani after Supreme Court verdict on Ayodhya
LK Advani former Deputy Prime Minister

 
ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఉపప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ.  దేశ ప్రధాని కావాలన్న ఆయన కల నెరవేరలేదు.  2004 లో మరలా ఎన్డీయే గెలిచి ఉన్నట్లయితే అద్వానీ ప్రధానమంత్రి అయ్యేవారేమో తెలియదు.  కానీ దురదృష్టవశాత్తూ ఎన్డీయే పరాజయం పాలైంది.  ఆ తరువాత 2009 లో అద్వానీ సారథ్యంలోనే ఎన్నికలను ఎదుర్కొన్నప్పటికీ ఎన్డీయే రెండోసారి కూడా ఓడిపోవడంతో ఆయన అవకాశాలు హరించుకుని పోయాయి.  2014  వచ్చేసరికి మోడీ సారధ్యంలో ఎన్నికలు జరిగినప్పటికీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ కొన్ని కేసుల్లో ఇరుక్కున్నప్పుడు తాను రక్షించిన ఘట్టాన్ని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతగా కొన్నాళ్లపాటైనా ప్రధాని పీఠం ఇస్తాడని ఆశిస్తే మోడీ వృద్ధ నాయకత్వాన్ని పక్కన పెట్టేసి తానే సర్వాధికారి అయ్యారు.  డెబ్బై ఐదేళ్లు దాటినవారికి పదవులు లేవు అనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి అడ్వాణీకి ఎన్నికల్లో పాల్గొనే అర్హత కూడా లేకుండా చేశారు.  పోనీ, ప్రణబ్ ముఖర్జీ తరువాత రాష్ట్రపతి భవన్ కైనా పంపిస్తారని ఆశలు పెట్టుకుంటే రాష్ట్రపతి ఎన్నిక వచ్చే నాటికి మళ్ళీ ఈ కేసును తిరగతోడించి అందుకు కూడా అవకాశం లేకుండా చేశారు.  ఇంత మానసికవేదనను అనుభవిస్తున్న తొంభై రెండేళ్ల కురువృద్ధుడు, బీష్మాచార్యుడు అనిపించుకున్న అద్వానీ బాబరీ మసీదు కేసులో జైలుకు వెళ్లకుండా బయటపడినందుకు సంతోషించాలేమో!  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు