జాతీయస్థాయిలో బలమైన ప్రతిపక్షం అవసరం 

Strong opposition is needed at the national level
భారతీయ జనతా పార్టీ తన అప్రతిహ విజయాలతో దూసుకుని పోతున్నది అనడంలో సందేహం లేదు.  ఇప్పుడున్న బీజేపీ ఒకనాటి వాజపేయి కాలం నాటి బీజేపీ కాదు. వాజపేయి, అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి గతకాలపు విలువలను నిలబెట్టే నాయకుల కాలాన్ని చూసినవారికి నేటి మోడీ-షా ల నేతృత్వంలోని బీజేపీని పోల్చి చూసేవారికి మోడీ బీజేపీ నచ్చకపోవచ్చు. కానీ, 2005  తరువాత చురుకుగా రాజకీయాలను గమనిస్తున్నవారికి మోడీ-షా ల నేతృత్వం కచ్చితంగా ఉత్తేజాన్ని కలిగిస్తుంది.  ఒక్క ఓటును కొనుగోలు చేస్తే ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ అంగీకరించకుండా వాజపేయి విలువల పేరుతో ప్రభుత్వాన్ని త్యాగం చేశారు ఒకనాడు. కానీ ఈనాడు శాసనసభలో ఒక్క సభ్యుడు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏమాత్రం వెనుకాడదు నేటి బీజేపీ. అయ్యో…ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు అంటూ నాటి వాజపేయి ప్రేమికులు గొంతు చించుకుని ఏడ్చినా నిష్ప్రయోజనం.  అది వీరోచితం అని భావించే తరం వచ్చింది ప్రస్తుతం.  
 
Strong opposition is needed at the national level
Strong opposition is needed at the national level
మొన్న తెలంగాణాలో దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందడం ఒక విశేషం అయితే ఆ తరువాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం అత్యద్భుతం అని చెప్పుకోవాల్సిందే.  నాలుగు సీట్లనుంచి నలభై ఎనిమిది సీట్లు గెలవడం అంటే కనీవినీ ఎరుగని విజయం అనడంలో సందేహం లేదు.  ఇక నెలరోజుల క్రితం జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం అటుంచితే మొన్న రాజస్థాన్ లో  జరిగిన స్థానిక సంస్థల  ఎన్నికల్లో కూడా బీజేపీ విజయభేరిని మోగించింది.  
 
నోట్లరద్దు, జీఎస్టీ, రామజన్మభూమి, శబరిమలై, ట్రిపుల్ తలాక్,  వ్యవసాయ చట్టాలు,  లాంటి వివాదాస్పదముగా భావించిన ఏ అంశమూ కూడా బీజేపీ విజయాన్ని నిలువరించలేకపోతున్నది. ఎవరేమి అనుకున్న మోడీ ప్రభుత్వం తాను చెయ్యదలచుకున్నవాటిని నిర్మొగమాటంగా చేసుకుంటూనే పోతున్నది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలిస్తున్న సమయంలో పెట్రో ధరలు అర్ధ రూపాయి పెరిగితే నానా రభస సృష్టించేవి ప్రతిపక్షాలు.  సైకిళ్ళు వేసుకుని చట్టసభలకు వెళ్లేవారు ప్రతిపక్ష నాయకులు.  రెండు రోజుల హడావిడి కాస్త ఉధృతమై హింస జరుగుతుంది అని భావిస్తే పది పైసలు తగ్గించేవారు ప్రభుత్వం వారు.  నలభై పైసలు అలాగే ఉన్నదే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తగ్గిన పదిపైసలు తమ ఘనతే అని జబ్బలు చరుచుకుని ఉద్యమాలను ఆపేసేవారు విపక్ష నాయకులు.  గత నెలరోజుల్లో పెట్రోల్ ధర సుమారు ఏడు రూపాయలు పెరిగింది. గత ఆరేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు.  సామాన్యులు కూడా పట్టించుకోవడం మానేశారు.  
 
ఏవిధంగా చూసినా మోడీ ప్రభుత్వానికి ఎదురే లేకుండా పోయింది.  ప్రశ్నించే గొంతుకే లేదు.  కారణం ఏమంటే దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షం లేదు.  కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్య మీద సంపూర్ణమరణం కోసం ఎదురు చూస్తున్నది. మిగిలిన ప్రాంతీయపార్టీలు తమ రాష్ట్రం వరకు పరిమితం అయ్యాయి.  ఎందుకంటే భజనలు, కాకాలకు లొంగిపోయే తత్త్వం మోడీలో లేకపోవడమే.  ఎవరెంత విమర్శించినా, ఎవరెంత ప్రశంసించినా మోడీ ఖాతరు చెయ్యడం లేదు.  మోడీ మీద నిప్పులు చిమ్ముతున్నవారందరికీ ప్రజాక్షేత్రంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రాంతీయపార్టీ నాయకుల్లో కూడా స్వార్ధం పెరిగిపోయింది.  ఎవరెట్లా ఛస్తే మనకేమిటి అన్న నిర్లిప్త భావం ఆవరించింది. ఒకప్పుడు దేశభక్తి అనేది శరీరంలో ఒక కనిపించని అవయవంగా ఉండేది నాయకుల్లో. ప్రస్తుతం ఆ తరం లేదు.  
 
ఇలాంటి పరిస్థితులు మరో పదేళ్లు కొనసాగితే దేశం మొత్తాన్ని నయానో భయానో బీజేపీ ఆక్రమిస్తుంది అనడంలో సందేహమే లేదు. అడ్డొచ్చినవారిని ఎంతటివారైనా కేసులు పెట్టేసి జైళ్లలో తోయిస్తారు. లేదా ఉన్న కేసులను నిద్ర లేపుతారు.   ఇరవై ఏళ్ళక్రితం, నలభై ఏళ్ళక్రితం బుక్ చేసిన కేసులను కూడా తవ్వుతారు.  ప్రతిపక్షాలను చంపడమే కొన్ని పార్టీలు ధ్యేయంగా పెట్టుకుంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నవారిని ఆకర్షించడం, కొనుగోలు చెయ్యడం, బెదిరించడం లాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నాయి.  తెలంగాణాలో జరిగింది అదే.  కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేస్తున్నామని సంతోషించారు కానీ అదే సమయంలో బీజేపీకి పాలు పోస్తున్నామని గ్రహించలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రతిపక్షం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో కూడా అంతే. బలమైన ప్రతిపక్షం ఉండాలి.  ప్రభుత్వాన్ని అదుపులో పెట్టగలిగే శక్తి కలిగిన బలమైన ప్రతిపక్షం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఆ పాత్రను పోషించాలి. లేదా బలమైన కొన్ని ప్రాంతీయపార్టీలు దేశ శ్రేయస్సు దృష్ట్యా  ఏకం కావాలి.  కానీ ఇది జరిగే పనేనా?  రాజనీతిజ్ఞులైన నాయకులు నేడు కన్ను పొడుచుకున్నా కానరావడం లేదు. ఎంత చెప్పినా చెవిటివానిముందు శంఖం ఊదడమే కదా!  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు