అటల్ బిహారి వాజ్‌పేయి కన్నుమూత

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ కన్నుమూశారు.  94 ఏళ్ల అటల్ జీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూన్ 11న ఎయిమ్స్ లో జాయిన్ అయిన అటల్ జీ చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. అటల్ మరణంతో బిజెపి శ్రేణులు విషాదంలో మునిగిపోయారు.

అటల్ బిహారి వాజ్ పేయి… బిజెపి పార్టీని ఒంటి చేతితో నడిపించిన ధీరుడాయన.. 25 డిసెంబర్ 1924లో మధ్యప్రదేశ్ లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారి వాజ్ పేయి. వాజ్ పేయి తాత పండిట్ శ్యాం లాల్ వాజ్ పేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్లారు. వాజ్ పేయి తండ్రి కృష్ణ బిహారీ వాజ్ పేయి గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయిడు మరియు కవి. వాజ్ పేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశారు. వాజ్ పేయి గ్వాలియర్ విక్టోరియా కళాశాల లో చేరి హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంతలో పట్టభద్రుడయ్యాడు. ఆయన రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ పట్టాను కాన్పూరులోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుండి పొందారు. వాజ్ పేయి బ్రహ్మ చారిగా ఉండిపోయారు. నమిత అనే అమ్మాయిని వాజ్ పేయి దత్తతకు తీసుకున్నారు.

వాజ్ పేయి మెదటి సారిగా రెండో లోక్ సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ మరియు 9వ లోక్ సభలకు తప్పించి 14 వ లోక్ సభ ముగిసే వరకు పార్లమెంట్ కు ప్రాతినిద్యం వహించారు. రెండు సార్లు రాజ్య సభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారి ప్రధాన మంత్రి పదవి పొందినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో సారీ ప్రధాన మంత్రి పదవి పొంది 13 నెలలు పదవిలో ఉన్నారు. 1999లో 13 వ లోక్ సభలో గెలుపొంది మరో సారి ప్రధాని పదవి చేపట్టారు. 2004 వరకు ఆయన ప్రధానిగా కొనసాగారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. 2005 డిసెంబర్ నెలలో ముంబై శివాజీ పార్కులో జరిగిన బిజెపీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన దేశానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 24 డిసెంబర్ 2014లో భారతరత్నం పురస్కారం ప్రకటించింది. ఆయన పుట్టిన రోజైన డిసెంబర్ 25 ను  సుపరిపాలన దినంగా ప్రభుత్వం ప్రకటించింది. వాజ్ పేయి అనారోగ్యంగా ఉండటంతో అప్పటి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్ పేయి ఇంటికి వెళ్లి ఆయనకు భారతరత్నను అందించారు.