ఏపీలో ఎన్నికల వాతావారణం వేడెక్కుతుంది. అధికార విపక్షల మధ్య విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయాల్లో సెగలు రేగుతున్నాయి. గెలుపు అనివార్యం అయినవేళ వైసీపీ – టీడీపీ – జనసేనలు తీవ్రస్థాయిలో వ్యూహాలు రచిస్తున్నాయి. ఇలా ఏపీలో రాజకీయలు ఇంత కాకమీద ఉండి, ఇంత సీరియస్ గా సాగుతుంటే… మధ్యలో తనదైన టైమింగ్ తో ఈ సీరియస్ నెస్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు తోట చంద్రశేఖర్!
అవును… తాజాగా ఏపీలో ప్రభుత్వ పాలన, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజల అభిప్రాయాలపై హైదరాబాద్ లో మాట్లాడిన బీఆరెస్స్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మైకుల ముందుకు వచ్చిన ఆయన… వైసీపీ, టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆగమాగమైపోయిందని మండిపడుతూ.. పెరిగిన నిత్యావసర ధరలతో జనాలు కుదేలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సరే ఏముందిలే అది సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా సహజం అని వ్యాఖ్యానించేలోపు మరో కీలక వ్యాఖ్య చేశారు చంద్రశేఖర్. అదేమిటంటే… ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా అందరు బీఆరెస్స్ వైపే చూస్తున్నారట. పైగా… ఏపీలో తాను ఎక్కడ పర్యటించినా కూడా అందరు బీఆరెస్స్ రావాలనే కోరుకుంటున్నట్లు తెలుస్తోందట.. ఇది కూడా చంద్రశేఖరే చెప్పారు.
అయితే… పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఏపీలో జనాలు ఇబ్బందిపడుతున్నారని చెబుతున్న చంద్రశేఖర్… తెలంగాణాలో జనాల తాజా పరిస్ధితిపైనా, అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులపైనా, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ పైనా, రైతురుణమాఫీ పైనా, నిరుద్యోగ భృతిపైనా, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీపైనా స్పందించకపోవడం గమనార్హం.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే… గుంటూరు ఆటోనగర్ సమీపంలో నిర్మించిన ఐదంతస్తుల భవనంలో ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆరెస్స్) ఏపీ శాఖ కార్యాలయంలో స్పందించిన ఆయన… ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంట్ స్థానాల్లో బీఆరెస్స్ పార్టీ పోటీ చేస్తుందని గతంలో ఆయన వెళ్లడించిన సంగతి తెలిసిందే.
దీనిపై స్పందించిన నెటిజన్లు… అంతమంది అభ్యర్థుల సంగతి దేవుడెరుగు.. కనీసం అంతమంది కార్యకర్తలైనా ఉన్నారో లేదో చూసుకోవాలంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే!