ఆఫ్టర్ ఎ స్మాల్ గ్యాప్… బాస్ ఈస్ బ్యాక్ అనట్లుగా ఉంది నెల్లూరు ఎమ్మెల్యే, మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ వ్యవహారం. కొంతకాలంగా మీడియాకు, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన అనీల్… ఆంతీయ సమ్మేళనం అనంతరం ఫాం లోకి వచ్చేసినట్లున్నారు. అందులో భాగంగా… నారా లోకేష్, ఆనం రాం నారాయణ రెడ్డిపై ఫైరయ్యారు.
అవును… చిన్న గ్యాప్ ఇచ్చాను.. ఇక సినిమా చూపెడతాను అంటూ ఆత్మీయ సమ్మేళనంలో స్పందించిన అనీల్ కుమార్.. అన్నట్లుగానే ఇరవైనాలుగు గంటలు తిరగకముందే మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా… నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ పై తీవ్రంగా మండిపడ్డారు. పులకేశి చేసేది పాదయాత్ర కాదు అదొక విహార యాత్ర అని అంటూనే… రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ.. గతంలో పోటీ చేసిన మందలగిరిలో మందు గెలువు అంటూ కామెంట్స్ చేశారు.
ఇదే క్రమంలో… “నారా లోకేశ్ కు సరిగ్గా మాట్లాడటం కూడా రావడం లేదు.. సాగునీటి ప్రాజెక్ట్ లపై చర్చకు నేను సిద్ధం.. లోకేశ్ కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి..” అని ఛాలెంజ్ విసిరారు అనీల్ కుమార్.
ఇదే సమయంలో ఆనం రాం నారాయణ రెడ్డితో సహా వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నేతలపై అనీల్ తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని విడిచి బయటకు వెళ్లలేదని గుర్తుచేసిన ఆయన… తామే ఆ ముగ్గుర్ని స్క్రాప్ కింద జమ చేసి బయటకు విసిరేశామని అన్నారు.
ఇదే సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారంటే అది జగన్ పెట్టిన భిక్ష అని తెలిపిన అనీల్… ఆనంకు సిగ్గు, శరం ఉంటే ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. అదేవిధంగా… ఈసారి ఎక్కడనుంచి పోటీచేసినా ఆనంకు ఓటమి తప్పదని అనీల్ స్పష్టం చేశారు.