జగన్ మూడు రాజధానుల నిర్ణయం సమర్ధనీయమా ?

రాజధాని విభజన ఎందుకు? “ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం.” ఇది తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమైన సామెత. ఈ సామెత చెపితే చాలు, దాని అర్ధం ఏమిటో చెప్పగలరు మన తెలుగువారు. దశాబ్దాల క్రితం విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిన తెలుగువాళ్ళ ముందు చెప్పినా ఈ సామెతకు అర్ధం ఏమిటో ఇప్పటికీ చెప్పగలరు. మన రాజధానిగా పిలవబడుతున్న అమరావతి కథ సరిగ్గా ఈ సామెత లాంటిదే. నగరమే లేదు, కానీ అది రాజధాని నగరం అన్నారు. ఆ ప్రాంతం అసలు అమరావతే కాదు, కానీ అమరావతి అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఇది.

పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకోవచ్చని విభజన చట్టంలో ఉన్నా, విభజన జరిగిన మొదటి యేడాదిలోనే ఉమ్మడి రాజధాని వదులుకోవలసి వచ్చింది. అందుకు కారణాలు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తెలుగు ప్రజలకు తెలుసు. ఉమ్మడి రాజధానిలో ఉన్న భవనాలను వదిలేసి విజయవాడలో అద్దెభవనాల్లో ఎందుకు పాలన మొదలు పెట్టాల్సి వచ్చిందో ఇప్పుడు కొత్తగా చెప్పనవసరం లేదు.

రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని లేదు. లక్ష కోట్ల రూపాయల అప్పు. పదహారువేల కోట్ల రూపాయల లోటు. పరిశ్రమలు లేవు. చెప్పుకోదగ్గ పెద్ద నగరాలూ లేవు. మొత్తం 13 జిల్లాల్లో చాలా జిల్లాల్లో అనేక గ్రామాల ప్రజలకు తాగునీరు లేదు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయినప్పటికీ సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. ఆకాశ హర్మ్యాలు లేవు. ప్రపంచాన్ని, పెట్టుబడులను ఆకర్షించగల నగరం లేదు. ఇది 2014లో ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి. అలాంటి పరిస్థితులను మర్చిపోయి ప్రపంచస్థాయి నగరం నినాదంతో మొదలైన ప్రస్థాన్ని మొదట ప్రస్తావించిన సామెతతో పోల్చుకోవచ్చు. దీన్నే “నేల విడిచి సాము” అని కూడా అనొచ్చు. రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ, సామాజిక వాస్తవాలు మరిచి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయడం, ఆమేరకు ఆశాసౌధాలు ఆకాశహర్మ్యాలు చూపించేశారు. “కలలు కనండి” అని అబ్దుల్ కలామ్ చెప్పారు కానీ మరీ ఇలా “గాల్లో మేడలు” కట్టినట్టు కలలు కనమనలేదు. అందువల్లే రాష్ట్రం ప్రగతిపథంలో ఆశించిన మేర వెళ్ళలేదు. కనీసం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో ప్రచార ఆర్భాటమే తప్ప జరగాల్సినంత వేగంగా పనులు జరగలేదు. కృష్ణా, గోదావరి డెల్టాలకు సాగునీళ్ళు అందించి వ్యవసాధారిత రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంతో పాటు అటు విశాఖపట్నం (ఉత్తరాంధ్ర ప్రాంతం) వాసులకు మంచినీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించాల్సిన ప్రాజెక్టు ప్రచారానికే సరిపోయింది. ప్రతి ఇటుకకు ఒక ఉత్సవం, ప్రతి సోమవారం ఓ లక్షరూపాయల రివ్యూ ఖర్చు మినహా మిగిలిందేమీ లేదు. పైగా అక్కడ జరిగిన పనేంటో, సాధించిన ప్రగతేంటో చూడండి అంటూ వేలాదిమందికి రాష్ట్రం నలుమూలలనుండి బస్సుల్లో తరలించి ప్రభుత్వ ఖర్చుతో భారీ విహాయరయత్రలు నిర్వహించి అదో వెయ్యికోట్లపైనే ప్రభుత్వంపై భారం వేశారు.

ఈ కలల సౌధాలను దాటి, ప్రపంచరాజధాని పగటికలలోనుంచి మేల్కొని, ప్రజలను మేల్కొలిపి వాస్తవ ప్రపంచంలోకి తేవాల్సిన భారం, వారిని భుజం తట్టి ముందుకు నడిపించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉంది. చంద్రబాబులాగా కలల ప్రపంచంలో విహరింపజేసే ప్రయత్నం చేయకుండా, దుబారా ఖర్చులను తగ్గిస్తూ పాలన మొదలు పెట్టిన జగన్, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలా లేక ఒక్క అమరావతినే ప్రపంచం తలెత్తి చూసే మహా నగరంగా ఐకానిక్ భవనలతో “ఆర్కిటెక్చర్ వండర్” (భారీ భవనాలు) నిర్మించాలా అన్నది తేల్చుకోవాలి. మంచినీళ్ళు లేని గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వాలా లేక అమరావతిలో 24గంటల వాటర్ ఫౌంటెన్ నిర్మించాలా? మందుబిళ్ళలు లేని ఆస్పత్రులను అభివృద్ధి చేయాలా లేక 160 మీటర్ల టవర్ నిర్మించాలా? సరైన దార్లులేని గ్రామాలకు కనీస రోడ్లు నిర్మించాలా లేక ఐకానిక్ వంతెనలు నిర్మించాలా? మూడు మీటర్ల పునాదితో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించాలా లేక 30 మీటర్ల పునాదితో ప్రభుత్వ భవనాలు నిర్మించాలా? గ్రామ సచివాలయాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఆస్పత్రుల్లో మంచాలు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలా అన్నవి ఇప్పుడు ప్రజల ముందు, ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన అంశాలు. ఈ అంశాల ప్రతిపాదికపైనే అమరావతిని ఇప్పటికి ఉన్న పరిస్థితికి పరిమితం చేసి, ఇతర నిర్మాణాలను తక్కువ ఖర్చుతో పూర్తయ్యే, తక్కువలోతు పునాదులతో భవనాలు వచ్చే ప్రదేశానికి తరలించాలి.

ఈ తరలింపు వెనుకబడిన ప్రాంతాలకు చేరిస్తే అభివృద్ధి అక్కడ కూడా వస్తుంది. “నిర్లక్ష్యానికి గురవుతున్నాం” అనే భావన ఆ ప్రజల్లో లేకుండా పోతుంది. “విడిపోతాం” అనే నినాదం వినబడకుండా ఉంటుంది. ఇక ప్రణాళికలో మనం ఎవరితో పోల్చుకోవాలి? ఎవరితో పోటీ పడాలి అనే అంశంలో కూడా పాలకులకు స్పష్టత ఉండాలి. సానియా మీర్జాతో పోటీకి ఎవరిని దించాలో తెలియాలి. పి టి ఉష తో పోటీకి బరిలోకి ఎవరిని దింపితే గెలవగలం అనే స్పష్టత ఉండాలి. ఏ ఆర్ రెహమాన్ తో పోటీకి ఎవరిని దించాలో తెలియాలి. గెలుపు నీ సొంతం అవ్వాలంటే పోటీ ఏంటో, ప్రత్యర్థి ఎవరో స్పష్టత ఉండాలి. అలాగే 100 మార్కుల టార్గెట్ కి ఏ విద్యార్థికి తర్ఫీదు ఇవ్వాలో తెలియాలి. బడికే రాని విద్యార్థిని, లేదా సున్నా మార్కుల విద్యార్థిని 100 మార్కుల పోటీకి దించలేం. ఈ స్పష్టత ఉండాలి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం అనే స్పృహ ఉండాలి. మనం పోటీపడేది 21వ శతాబ్దపు నగరాలతో. పూర్తిగా సాంకేతికత అభివృద్ధి చెంది పరిపాలన అరచేతుల్లో ఆన్లైన్లో (Online) జరుగుతున్న రోజులు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పునాదులే లేని అమరావతిని పోటీకి దింపుతామా లేక ఎంతో కొంత అభివృద్ధి చెంది ఉనికిలో ఉన్న నగరాలను పోటీకి దింపుతామా? ఉనికి లేని అమరావతి కంటే మెట్రోపాలిటన్ నగర స్థాయి ఉన్న విశాఖపట్నం ఈ 21వ శతాబ్దపు నగరాలతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కొద్దిగా చేయూత ఇస్తే విశాఖ నగరం తూర్పు తీరాన కలకత్తా, చెన్నయ్ నగరాలకు పోటీగా నిలిచే అవకాశం చాలా వేగంగా ఉంది. పైగా సువిశాల తూర్పు తీరంలో అటు కలకత్తాకు, ఇటు చెన్నయ్ కి మధ్యలో ఉన్న ఏకైక పెద్ద నగరం విశాఖ. ఈ రెండు నగరాలకు అతి కొద్దికాలంలోనే విశాఖ ఒక ప్రత్యామ్న్యాయ నగరంగా వెలుగొందుతుంది. ఈ చిన్న లాజిక్ మర్చిపోయిన గత పాలకులు ప్రజల తిరస్కారానికి గురయ్యారు.

1953లో వచ్చిన రాజధానిని కోల్పోయాం అనే భావనతో పాటు నిర్లక్ష్యానికి గురవుతున్నాం అనే వాదం గట్టిగా ఉన్న రాయలసీమకు, అందునా కర్నూలుకు హై కోర్టు తరలింపుకూడా సముచిత నిర్ణయమే. ఒక్క హై కోర్టు మాత్రమే కాదు, లోకాయుక్త, జ్యూడిషియల్ కమిషన్లు తదితర న్యాయవిభాగాలు, వాటికి సంబంధించిన కార్యాలయాలు, వాటి సిబ్బంది నివాసాలు తదితరమైనవి ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతాయని ఆలోచించకపోవడం గత పాలకుల తప్పిదం అయితే ఇప్పటి ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేయడం అభినందనీయం, హర్షణీయం, సముచితం.

ఇక అమరావతి విషయానికి వస్తే ప్రభుత్వం అక్కడ భారీ వ్యయంతో నిర్మాణాలు చేసే బదులు ఆ భూముల్ని తగిన ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తే వ్యాపారమే లక్ష్యంగా పనిచేసే సంస్థలు పెట్టుబడి పెట్టగలవు, ఆ మేరకు లాభాలు సాధించగలవు. ఆ మెళుకువలు వ్యాపారవేత్తలకు బాగా తెలుసు. అమరావతి భూముల్లో ప్రభుత్వం విద్యాసంస్థలతో పాటు పలు పర్యాటక కేంద్రాలు, సమావేశ కేంద్రాలు (Convention Centers) ఏర్పాటు చేస్తే అమరావతి కూడా వేగంగానే అభివృద్ధి చెందుతుంది. విడిపోయిన రాష్ట్రం. రాజధాని లేని రాష్ట్రం. రెవిన్యూ లోటుతో ఉన్న రాష్ట్రం. రెండు లక్షల కోట్ల అప్పులతో ఉన్న రాష్ట్రం. ఖజానా ఖాళీగా ఉన్న రాష్ట్రం. ఈ పరిస్థితుల్లో ప్రతి పైసా ఎలా వినియోగించాలి, ఎందుకు వినియోగించాలి అనే విచక్షణ పాలకుడికి ఉండాలి. ఈ విచక్షణ ఇప్పటి ముఖ్యమంత్రికి, ఇప్పటి ప్రభుత్వానికి ఉందని రాజధాని విస్తరణ ప్రతిపాదన స్పష్టంగా తెలియజేసింది. ఈ చర్యలను స్వాగతించాలిసిందే.

రాజకీయాలు పక్కన పెట్టి, వాస్తవ పరిస్థితులను గమనంలోకి తీసుకుని నేలపై సాము చేయాలి. ఆలి వచ్చి, ఆమెకు శూలు వచ్చి, ఆమె ప్రసవించి బిడ్డను కనాలి, కన్న బిడ్డ మగబిడ్డ అయితే అప్పుడు ఆ బిడ్డపేరు సోమలింగం అని పెట్టుకోవచ్చు. అసలు పెళ్ళే కాకుండా, భార్య రాకుండా, ఆమెకు గర్భం రాకుండా, ఆడబిడ్డో, మగబిడ్డో తెలియకుండా సోమలింగం పేరుపెట్టేస్తే అది అపహాస్యం పాలవుతుంది. అలా అపహాస్యం పాలు కాకుండా వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాజధాని విస్తరణ, విభజన ప్రతిపాదన ముందుకు వచ్చింది.

Written By Aditya for TeluguRajyam.com