తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా వాటి ఎజెండాగా మారింది. వ్యాపారం అనేది ఎలాగో మీడియాకు అంతర్లీనంగా ఉండే ఎజెండా. దాన్ని ఎవరూ మార్చలేరు. కాదు అని కూడా అనలేరు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో అది అంతర్లీనంగా కాకుండా బహిరంగంగానే కులం, రాజకీయంతో ముడిపడిపోయింది. ఒక కులం రాజకీయ, మీడియా, వ్యాపార రంగాలపై ఆధిపత్యం చెలాయించడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. అందుకే 2000 దశకం తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతమై చివరికి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడే వరకూ వచ్చింది. అయితే విడిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి ఒకే కులం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ, వ్యాపార రంగాలపై ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నం చేయడంతోనే 2019 ఎన్నికలు ఆ కులానికి, ఆ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి భారీ ఓటమి ఇచ్చాయి.
అయితే, ఈ కారణాలను విశ్లేషించడంలో ఇందులో మీడియా పాత్రను పసిగట్టడంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కొంత తప్పటడుగు వేస్తున్నారని చెప్పక తప్పదు. స్వయంగా ఒక మీడియా సంస్థకు యజమాని అవడం వల్లనో, లేక ఒక వర్గం మీడియా పూర్తిగా తనకు వ్యతిరేకంగా పనిచేసినా ప్రజలు తననే గెలిపించారు కాబట్టి మీడియా ప్రభావం లేదనే అభిప్రాయం వల్లనో జగన్మోహన్ రెడ్డి మీడియాకు అందనంత దూరంలో కూర్చున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు. మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటి మాట్లాడడం కూడా 8 నెలల తర్వాతనే జరిగింది. నిత్యం ప్రజలకోసం పనిచేస్తున్న తాను, అధికారంలోకి వచ్చిన మొదటి రోజునుండే ఎన్నికల ప్రణాళిక అమలు చేయడం మొదలుపెట్టిన తాను ప్రజలకు దగ్గర అవుతున్నానని అందువల్ల ఇలా మీడియాకు దూరంగా ఉంటే లేదా మీడియాను దూరంగా పెడితే తనకు నష్టం ఏమీలేదని అనుకుంటే అది పొరపాటే. ఎంత ప్రజలకోసం పనిచేస్తున్న ప్రభుత్వం అయినా తాము చేస్తున్నదేమిటో మీడియాలో చూపించుకోలేకపోతే ప్రజల మనసులలోకి ఎక్కదు.
2019 ఎన్నికల్లో మీడియా ప్రభావం లేదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే పొరపాటే. మీడియా మొత్తం వ్యతిరేకంగా రాస్తుంటే ఆ విషయాన్ని ప్రజలు ఆ మీడియా ద్వారానే గమనించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు మీడియా మాత్రమే కాదు, దేశంలో ఉన్న జాతీయ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు, వ్యాసాలు, సంపాదకీయాలు రాశాయి. అందుకు రెండు కారణాలు. ఒకటి చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం, తద్వారా వచ్చిన మీడియా సంస్థల స్నేహం. ఈ స్నేహాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా వార్తలు, వ్యాసాలు మరియు సంపాదకీయాలు రాయించారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ నుండి తమిళనాడుకు తరలి వెళ్ళుతోంది అంటూ ఒక ప్రత్యేక కథనం రాయించింది. ఆ వార్త జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా ఓ కుదుపు కుదిపేసింది.
ఇక వ్యతిరేక ప్రచారానికి రెండో కారణం జగన్మోహన్ రెడ్డి వైఖరే. మీడియాకు ఆయన చాలా దూరం పాటిస్తున్నారు. ఇలా దూరం పాటించడం వల్ల మీడియా తన పంథా మార్చుకోదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ తొమ్మిది నెలల్లో మీడియా సమావేశం నిర్వహిస్తే కలిగివుండే నష్టం కన్నా, సమావేశం జరపక పోవడం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. ఈ ప్రభుత్వ విజయాలను మీడియాకు చెప్పే “సోర్స్” ప్రభుత్వం నుండి లేకపోవడం, జాతీయ మీడియాకు అసలు అందుబాటులో లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. పాలక పక్షం కంటే ప్రతిపక్షమే జాతీయ మీడియాకు అందుబాటులో ఉంది. అందువల్లనే ఎక్కువ వార్తలు, వ్యాసాలు, సంపాదకీయాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. రాయిటర్స్ లో వచ్చిన కియా వార్త కూడా ఈ కోవకు చెందిందే. అయితే రాయిటర్స్ లో వార్త వచ్చిన తర్వాత మేల్కొన్న జగన్మోహన్ రెడ్డి బృందం రాయిటర్స్ కు తమ విధానాలు వివరించి అనుకూల వార్త వచ్చేలా చేసుకోగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే శాసన సభలో, పార్టీలో “ఫ్లోర్ కోఆర్డినేషన్” ఎంత కీలకమో మీడియాతో కోఆర్డినేషన్ కూడా అంతకంటే ఎక్కువ కీలకం. ఈ కోఆర్డినేషన్ కోసమే ఒక అరడజను మంది మీడియా పెద్దలను సలహాదారులుగా పెట్టుకున్నా జాతీయ మీడియాలో వ్యతిరేక వార్తలు రావడం వైఫల్యంగా చూడాల్సిందే. ఈ వైఫల్యం నుండి రాయిటర్స్ ద్వారా ఒక సరికొత్త పాఠం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేర్చుకుందనే చెప్పాలి. రాయిటర్స్ ప్రయోగం ఇతర మీడియా సంస్థలకు కూడా విస్తరిస్తేనే పాఠం నేర్చుకున్న ఫలితం కనిపిస్తుంది. లేదంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీడియా ముందు బోర్లా పడాల్సి వస్తుంది
Written by Aditya for TeluguRajyam.com