అనూహ్య పరిణామమిది. ఓ వైపు గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఇంకోపక్క వేలాది ట్రాక్టర్లతో దేశ రాజధానిలో రైతుల ర్యాలీ.. వెరసి, దేశమే కాదు.. ప్రపంచం నివ్వెరపోయింది. ఎర్రకోటపై రైతన్న జెండా రెపరెపలాడింది. దేశ చరిత్రలోనే ఇది ప్రప్రధమం. ‘జై కిసాన్.. భారత్ మాతా కీ జై..’ అనే నినాదాలతో రైతులు ఓ చేత్తో జాతీయ జెండా, ఇంకో చేత్తో తమ జెండా పట్టుకుని నినదించారు. రైతుల ఆందోలనలతో దేశ రాజధాని అట్టుడికింది. నిజానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయ్యాకనే ర్యాలీ చేపడ్తామని రైతు సంఘాలు చెప్పాయి. కానీ, నిర్ణీత సమయానికి కాస్త ముందుగానే రైతుల ట్రాక్టర్ల ర్యాలీ మొదలైంది. పైగా, దారి కూడా తప్పింది. దాంతో, పోలీసులు రైతుల్ని నిలువరించడానికి చాలా కష్టపడ్డారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అయితే, రైతుల్లో కొందరు పోలీసులపైకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాదు కాదు, పోలీసులే రెచ్చగొట్టారన్నది రైతుల వాదన. ఎవరి వాదనలు ఎలా వున్నా.. ఈ ఆందోళన కొంతమేర రక్తసిక్తమవడం అత్యంత బాధాకరమైన విషయం.
భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్ని ప్రపంచమంతా ఆసక్తితో తిలకిస్తుంటుంది. ఈ సమయంలో రైతుల ర్యాలీ జరగడం కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. రైతుల్ని తెరవెనుక ఏవో శక్తులు నడిపిస్తున్నాయని కేంద్రంలో అధికారంలో వున్నబీజేపీ ఆరోపించవచ్చుగాక. కానీ, రైతుల ఆందోళనల్ని కేంద్రం పట్టించుకోలేదు.. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు చాలా రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు బలవన్మరనానికి పాల్పడితే, ఇంకొందరు.. హఠాన్మరణం చెందారు. అయినా, కేంద్రం దిగి రాలేదు. రైతులు వద్దంటున్న చట్టాల్ని రైతుల మీద కేంద్రం బలవంతంగా రుద్దాలనుకోవడాన్ని చాలా రాజకీయ పార్టీలు తప్పుపడుతున్న విషయం విదితమే. కొత్త వ్యవసాయ చట్టాలకు తొలుత మద్దతిచ్చిన పార్టీలు కూడా, ఆ తర్వాత మాట మార్చాయి.. రైతులకు అండగా నిలబడ్డాయి. ఏదిఏమైనా, పంతాలకు పోయే సమయం కాదిది. దేశం పరువు ప్రతిష్టలకు సంబందించిన వ్యవహారంగా మారిందిప్పుడు రైతుల ఆందోళన. బేషజాలకు పోకుండా కేంద్రం, కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గడమే మంచిది.