రాజధాని అమరావతిలోనే కొనసాగాలంటూ, అమరావతి కోసం భూములిచ్చిన రైతులు 400 రోజులుగా ఉద్యమిస్తున్న విషయం విదితమే. ఉద్యమం 400 రోజుల మైలు రాయిని చేరుకోవడంతో, అమరావతి రైతులు ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏం చేసినా, అధికార వైసీపీలో ‘రాజదాని మార్పు’ విషయమై ఎలాంటి పునరాలోచనా కన్పించడంలేదు. పేరుకే మూడు రాజధానులంటున్నా, ముమ్మాటికీ ఇది రాజధాని తరలింపే. కోర్టులో ‘స్టేటస్ కో’ కారణంగా నిలిచిపోయిన మూడు రాజధానుల ప్రక్రియలో కదలిక మరో మూడు నాలుగు నెలల్లో వస్తుందన్నది వైసీపీ బలమైన నమ్మకం.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కర్నూలుకి హైకోర్టు తరలింపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించారు కూడా. అయితే, ఇంతలోనే రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్లో అర్థం లేదని న్యాయస్థానం తేల్చి చెప్పడాన్ని అమరావతి రైతాంగం స్వాగతిస్తోంది. ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ని సాకుగా చూపి, రాజధాని తరలింపు దిశగా అదికార పార్టీ పావులు కదిపిన విషయం విదితమే. న్యాయస్థానాల్లో పదే పదే అమరావతి రైతాంగానికి ఊరట కలుగుతుండడం, అదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతుండడం.. అలా మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ ముందడుగు వేయలేకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, రెండేళ్ళుగా అమరావతిలో అభివృద్ధి నిలిచిపోయింది. తద్వారా అమరావతి బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతినేసింది. ‘ప్రభుత్వం చెబుతున్న శాసన రాజధాని’కి సమ్మతిస్తే, కాస్తో కూస్తో అభివృద్ధి జరుగుతుంది కదా.? అన్న చర్చ కొందరు రాజకీయ విశ్లేషకుల నుంచి తెరపైకొస్తోంది. అయితే, దాన్ని సమర్థించేందుకు అమరావతి రైతాంగం సుముఖంగా లేదు. మరోపక్క, అమరావతి విషయంలో ప్రభుత్వానిది మొండి పట్టుదల అనీ, రైతులతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల నేపథ్యంలో సీఆర్‌డిఎ రద్దు కూడా అసాధ్యమనీ, ఈ విషయం ప్రస్తుత ప్రభుత్వానికి తెలిసీ మొండి వైఖరి ప్రదర్శిస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఎవరి గోల వారిదే.. రాష్ట్రానికి రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడంలేదు.. ఎప్పటికి దొరుకుతుందో తెలియదు.